Cheque Bounce | మియాపూర్ ఫిబ్రవరి 10 : ఆస్తి పన్ను (Property Tax) వసూళ్లలో అధికారులు దూకుడు పెంచారు. ఈ ఆర్థిక సంవత్సరం మరో కొద్ది రోజుల్లో ముగియనుండడంతో ఎలాగైనా 100% పన్ను వసూళ్ల లక్ష్యాన్ని చేరుకునేందుకు కసరత్తులు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే మొండి బకాయిదారులకు వందల్లో నోటీసులను జారీ చేశారు. మరోపక్క ఆస్తి పన్ను విభాగం సిబ్బందిని క్షేత్రస్థాయిలో ప్రతి నివాసం, వాణిజ్య దుకాణాల వద్దకు పంపుతూ పన్ను వసూలు చేస్తున్నారు. పన్ను చెల్లింపులలో వినియోగదారులు వివిధ మార్గాలను అనుసరిస్తుండగా.. ప్రధానంగా చెక్కులు అందించిన వాటిపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి నిలుపుతున్నారు.
ఆస్తి పన్ను చెల్లింపు నిమిత్తం అందించిన చెక్కులు బౌన్స్ (Cheque Bounce) అయిన సందర్భాలలో ,సదరు వినియోగదారుడికి నోటీసులను జారీ చేస్తూ 15 రోజుల గడువు అనంతరం దుకాణాలకు తాళం వేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఇటీవల శేర్లింగంపల్లి జోన్ పరిధిలోని చందానగర్ సర్కిల్ మాదాపూర్ లో ఇదే తరహాలో రూ 24 లక్షల చెక్ బౌన్స్ కేసులో ఓ వాణిజ్య భవనానికి అధికారులు తాళం వేశారు. ఇదే తరహాలో మరో మూడు భవనాలకు తాళాలు వేయగా, స్పందించిన వినియోగదారులు యుద్ధప్రాతిపదికన చెక్ బౌన్స్ అయిన మొత్తాన్ని వెంటనే చెల్లింపులు చేయడంతో వారి వాణిజ్యాలకు అనుమతులను ఇచ్చారు.
ఉన్నత అధికారులు దృష్టి..
ప్రధానంగా ఆస్తి పన్ను వసూళ్లు అత్యంత కీలకంగా చేపట్టాలన్న ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు పన్ను విభాగం అధికారులు మరింత దూకుడు పెంచి క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. కొందరు సిబ్బంది వాణిజ్య దుకాణాల నిర్వాహకులతో సత్సంబంధాలు కలిగి ఉండి సకాలంలో పన్ను వసూలు చేయకుండా దాటవేస్తుండడంపై ఉన్నత అధికారులు దృష్టి కేంద్రీకరించారు. ఇప్పటికే పలువురికి తీవ్ర హెచ్చరికలను జారీ చేశారు. చందానగర్ సర్కిల్ పరిధిలో ఈ ఆర్థిక సంవత్సరం రూ. 120 కోట్ల వరకు ఆస్తి పన్ను వసూళ్ల లక్ష్యంగా నిర్ధారించగా, ఇప్పటికే రూ 86 కోట్ల మేర లక్ష్యాన్ని చేరుకున్నారు.
తరచుగా పన్ను వసూళ్ల పురోగతిపై సమీక్షలు నిర్వహించడంతోపాటు బకాయిదారులను హెచ్చరిస్తుండడంతో కొంతమేర సత్ఫలితాలు నెలకొంటున్నాయి. తాజాగా చెక్ బౌన్సుల కేసులో దుకాణాలకు తాళాలు వేస్తుండడంతో బకాయిదారుల గుండెల్లో వణుకు పుడుతుంది. ఈ తరహాలో చందానగర్ సర్కిల్ పరిధిలో సుమారు వందకు పైగా చెక్ బౌన్సుల కేసులు ఉండడంతో అధికారుల హెచ్చరికలతో వినియోగదారులు వెంటనే తమ బకాయిలను క్లియర్ చేసుకోవడం గమనార్హం.
Power Demand | తెలంగాణలో భారీగా పెరిగిన విద్యుత్ డిమాండ్.. మండుతున్న ఎండలే కారణం..!
KTR | హిమాయత్‌నగర్ చౌరస్తాలో గులాబీ జెండా ఎగురవేసిన కేటీఆర్