Power Demand | తెలంగాణ విద్యుత్ డిమాండ్ రికార్డు స్థాయిలో 16వేల మెగావాట్లకు చేరువైంది. గత ఏడాది మార్చి 8న అత్యధికంగా 15,623 మెగావాట్ల డిమాండ్‌ను అధిగమించినట్లు విద్యుత్‌శాఖ ప్రకటించింది. ఈ నెల 7న నమోదైన 15,920 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ వచ్చిన విషయం తెలిసిందే. వేసవి, యాసంగి పంటల ప్రభావంతో విద్యుత్‌కు డిమాండ్ భారీగా పెరుగుతుందని విద్యుత్‌శాఖ అధికారులు పేర్కొన్నారు. విద్యుత్‌కు డిమాండ్ ఇలాగే కొనసాగితే.. 17వేల మెగావాట్లకు చేరుతుందని అంచనా వేస్తున్నారు. అయితే, డిమాండ్ పెరిగినా అవసరమైన మేరకు సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు విద్యుత్ శాఖ అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.
డిమాండ్ దృష్ట్యా రేపు విద్యుత్ సంస్థల అధికారులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమీక్షించనున్నారు. డిమాండ్ మేరకు విద్యుత్‌ను సరఫరా చేస్తామన్నారు. ఇదిలా ఉండగా.. తెలంగాణవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు భారీగానే నమోదవుతున్నాయి. ఫిబ్రవరిలోనే వేసవి తరహాలోనే ఎండలు మండుతున్నాయి. ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగిపోవడంతో పాటు ఫ్యాన్లు, ఏసీలు, కూలర్ల వినియోగం పెరుగుతున్నది. యాసంగి పంటలతో పాటు పరిశ్రమల్లోనూ విద్యుత్ వినియోగం పెరిగింది. దానికి తోడు గృహవినియోగం సైతం భారీగా పెరిగిపోతుందని విద్యుత్‌శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలోనే రికార్డు స్థాయిలో విద్యుత్‌కు డిమాండ్ పెరుగుతుందని పేర్కొంటున్నారు.