KTR | మొయినాబాద్ : రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని హిమాయత్‌నగర్ చౌరస్తాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావుకు బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. ఈ సందర్భంగా కేటీఆర్ చౌరస్తాలో పార్టీ జెండా ఎగురవేశారు. అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్ నినాదాలతో హిమాయత్ నగర్ చౌరస్తా, హైదరాబాద్-బీజాపూర్ రహదారి హోరెత్తింది.
కేటీఆర్ కొడంగల్‌లో నిర్వహించే కార్యక్రమానికి వెళ్తుండగా.. హిమాయత్ నగర్ చౌరస్తాలో ఆయనకు ఘన స్వాగతం పలకడానికి పార్టీ శ్రేణులు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఆయనతోపాటు మాజీ మంత్రి పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డి, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, పార్టీ నేతలు ఉన్నారు.
చిలుకూరు బాలాజీ దేవాలయం ప్రధాన అర్చకులు సీఎస్ రంగరాజన్‌పై రామరాజ్యం స్థాపన సైనికులు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు కేటీఆర్, మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఇతర బీఆర్ఎస్ నేతలతో కలిసి రంగరాజన్ ఇంటికి వెళ్లి పరామర్శించారు. రంగరాజన్‌పై జరిగిన దాడికి సంబంధించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆలయాల పరిరక్షణకు, ఆలయంలో అర్చకత్వం చేస్తున్న అర్చకులకు బీఆర్ఎస్ అండ ఎప్పుడూ ఉంటుందని కేటీఆర్ మనోధైర్యం ఇచ్చారు.