Hyderabad Metro | సిటీబ్యూరో, జూలై 14 (నమస్తే తెలంగాణ): మెట్రో రెండో దశ ప్రాజెక్టుకు ఆదిలోనే ఎన్నో అడ్డంకులు ఎదురవుతున్నాయి. నిర్దేశిత లక్ష్యాలు పెట్టుకున్నా అవి సకాలంలో పూర్తి చేయలేకపోతున్నారు. ఒకవైపు జనరల్ కన్సల్టెన్సీ సంస్థ, మరోవైపు హైదరాబాద్ మెట్రో అధికార యంత్రాంగం క్షేత్ర స్థాయిలో చేపట్టిన ట్రాఫిక్ సర్వే, నిర్ణీత కారిడార్ల అధ్యయనంలో స్పష్టత రావడం లేదు. ఇదే విషయమై హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) పరిధిలోని ఉమ్టా (యునిఫైడ్ మెట్రో ట్రాన్స్పోర్ట్ అథారిటీ) సంస్థ ప్రత్యేకంగా మరో అధ్యయాన్ని నిర్వహిస్తోంది. రెండో దశపై ఎంతో కసరత్తు చేస్తున్నా సమగ్ర ప్రాజెక్టు నివేదికపై కొలిక్కి రావడం లేదు.
ఫలితంగా మే-జూన్ నాటికే సిద్ధం కావాల్సిన రెండో దశ మెట్రో డీపీఆర్ రూపకల్పనలో తీవ్ర జాప్యం కావడంతో పాటు ప్రాజెక్టుకు అయ్యే వ్యయంపై అంచనాలు సైతం తారుమారవతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండో దశ మెట్రోను 70 కి.మీ మేర విస్తరించాలని ఎంతో హడావుడి చేసి 6 నెలలు గడుస్తున్న ఇప్పటికీ ఒక అంచనా రాలేదు. మొత్తం 7 మెట్రో మార్గాల్లో 70 కి.మీ మేర రెండో దశలో మెట్రోను పొడిగించేలా డీపీఆర్‌ను రూపొందించే పనులు హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ చేపట్టింది. ఇందుకోసం ప్రత్యేకంగా సిస్ట్రా కంపెనీ క్షేత్ర స్థాయిలో సర్వే, మార్గాలను అధ్యయనం చేస్తూ డీపీఆర్ రూపొందించే పనులు చేస్తున్నా, స్థానికంగా ఉన్న పరిస్థితులతో స్పష్టమైన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు.
రెండో దశ మెట్రోను విస్తరించాలని ప్రతిపాదించిన మార్గాల్లో జాతీయ రహదారులు ఉన్నాయి. మొదటి దశ మెట్రో రైలు మార్గాన్ని పొడిగిస్తూ జాతీయ రహదారులపైనే ఎల్బీనగర్-హయత్‌నగర్, మియాపూర్-పటాన్చెరు, ఆరాంఘర్ నుంచి కొత్త హైకోర్టు వరకు మెట్రో మార్గాలను నిర్మించేందుకు మెట్రో యంత్రాంగం సర్వేలు, అధ్యయనాలు చేస్తోంది. దీంతో ఒకవైపు జాతీయ రహదారుల విస్తరణలో భాగంగా ఫ్లై ఓవర్ల నిర్మాణం పనులు జరుగుతుండగా, అక్కడ మెట్రో కోసం రైట్ ఆఫ్ వే కోసం మెట్రో అధికారులు జాతీయ రహదారుల సంస్థ అధికారులతో సంప్రదింపులు జరిపారు.
ఆయా మార్గాల్లో మెట్రో కారిడార్‌ను ఎలా నిర్మించాలన్న దానిపై స్పష్టత రావాలంటే చాలా సమయమే పడుతుందని ఇటీవల చేపట్టిన సర్వే, అధ్యయనంలో గుర్తించారు. ఇప్పటికే జాతీయ రహదారులపై ఫ్లైఓవర్ బ్రిడ్జిలు నిర్మించాలని ప్రతిపాదనలు సిద్ధం చేయడంతో మెట్రో అలైన్మెంట్లో పెద్ద ఎత్తున మార్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొందని, ఈ కారణంగా ప్రాజెక్టు అంచనా వ్యయం సైతం మారిపోయే అవకాశాలు ఉన్నాయని ఓ మెట్రో అధికారి తెలిపారు. మొత్తం రెండో దశ మెట్రో డీపీఆర్‌పై పూర్తి స్పష్టతకు మరింత సమయం తీసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుందన్న అభిప్రాయాన్ని అధికారులు వ్యక్తం చేస్తున్నారు.