బడంగ్‌పేట,డిసెంబర్23 : ఎనీమియా అధికంగా ఉన్న రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాల్లో కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లు అందజేయబోతున్నామని విద్యాశాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. బడంగ్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పెద్ద బావి మల్లారెడ్డి గార్డెన్లో శుక్రవారం లబ్ధి దారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను అందజేశారు. అనంతరం రంగారెడ్డి జిల్లా టీయూడబ్ల్యూజే వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో స్త్రీ సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని చెప్పారు. ఇప్పటికే కేసీఆర్ కిట్లు అందజేస్తున్న ప్రభుత్వం గర్భిణులకు పౌష్టిక ఆహార కిట్లను అందజేయనున్నట్లు ఆమె పేర్కొన్నారు. మహిళల్లో రక్తహీనత అరికట్టి, తల్లీబిడ్డ సురక్షితంగా ఉండాలన్న లక్ష్యంతో ఈ పథకం తీసుకొచ్చామన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి, డిప్యూటీ మేయర్ ఇబ్రాం శేఖర్, బాలాపూర్ తాసీల్దార్ జనార్దన్ రావు, కార్పొరేటర్లు సూర్ణ గంటి అర్జున్, బోయపల్లి దీపికా శేఖర్ రెడ్డి, ఏనుగు రాంరెడ్డి, బీమిడి స్వప్నాజంగారెడ్డి, లిక్కి మమతా కృష్ణారెడ్డి, పెద్ద బావి శ్రీనివాస్ రెడ్డి, రాళ్లగూడెం సంతోషి శ్రీనివాస్ రెడ్డి, జనిగ భారతమ్మ, రోహిని రమేశ్, ముత్యాల లలితా కృష్ణ, నిమ్మల సునీతా శ్రీకాంత్ గౌడ్, తోట శ్రీధర్ రెడ్డి, గూడెపు ఇంద్రసేన తదితరులు ఉన్నారు.