సిటీబ్యూరో, ఏప్రిల్19 (నమస్తే తెలంగాణ): వేలాది ప్రాణాలను కాపాడటంతో పాటు నిరుపేదలకు వైద్య ప్రదాయినిగా పేరుగాంచిన ఉస్మానియా ఆసుపత్రిలో సిబ్బంది కొరత వెంటాడుతోంది. ఆసుపత్రిలో నర్సులు, సహాయకులు లేక రోగులు అవస్థలు పడుతున్నారు. 1,168 పడకల సామర్థ్యం కలిగిన ఈ ఆసుపత్రిలో ప్రస్తుతం 1,072 పడకలు అందుబాటులో ఉన్నాయి. వీళ్లందరికి వైద్య సేవలందించాల్సిన నర్సింగ్ అధికారి పోస్టులు భర్తీకి నోచుకోవడం లేదు. ప్రభుత్వం ఉద్యోగాలకు ప్రకటన జారీచేసి చేసినప్పటికీ ఇప్పటివరకు భర్తీ చేయకపోవడంతో 125 నర్సుల పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. పోస్టుల భర్తీలో ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తుండటంతో రోగులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. అలాగే సిబ్బంది కొరత వల్ల ఆసుపత్రిలో ప్రస్తుతం ఉన్న వాళ్లపై అధిక భారం పడుతోంది.
ఉస్మానియా ఆసుపత్రికి నిత్యం సుమారు 3వేల మంది ఔట్ పేషెంట్లు వస్తుండగా, ఇన్‌పేషెంట్లు 1200 వరకు వస్తుంటారు. వివిధ అనారోగ్య సమస్యలతో ఉస్మానియాకు వచ్చే వారికి వైద్య సేవలందించడంలో నర్సుల పాత్ర ప్రముఖమైంది. వీరు రోగికి సహాయకరంగా ఉండటంతో పాటు, మందులు, చికిత్స తదితర సేవలందిస్తుంటారు. ఉస్మానియా ఆసుపత్రిలో ప్రస్తుతం 385 మంది నర్సులకు గాను, 375 మంది అందుబాటులో ఉన్నారు. ఈ 375 మందిలో 60 మంది డిప్యూటేషన్‌పై వచ్చినవారు, 41మంది టిమ్స్ నుంచి, 17 మంది పీసీఎస్పీ నుంచి వచ్చి తాత్కాలికంగా విధులు నిర్వర్తిస్తున్నారు.
ఇటీవల జరిగిన బదిలీల్లో సీనియర్ నర్సింగ్ అధికారి, నర్సింగ్ అధికారులు ఇతర జిల్లాలకు వెళ్లారు. దీంతో 125 ఖాళీలు ఏర్పడగా వాటిని ఇప్పటివరకు రెగ్యులర్ వారితో భర్తీచేయకుండా రాష్ట్ర ప్రభుత్వం చోద్యం చూస్తుంది. ఉస్మానియాలో 288 ఐసీయూ పడకలు, 259 హై రిస్క్ పడకలు, 525 సాధారణ పడకలు ఉండగా వీరందరికి సేవలందించాలంటే ప్రస్తుతం ఉన్న సిబ్బంది చాలా ఇబ్బందులు పడుతున్నారు. డిప్యూటేషన్ మీద వచ్చిన నర్సులు తాత్కాలికంగా కొంత భారం తగ్గించినా అది శాశ్వత పరిష్కారం కాదు. మెరుగైన వైద్యసేవలందాలంటే రెగ్యులర్ నర్సుల భర్తీ అత్యంత అవసరం.
ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో), ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ ప్రమాణాల ప్రకారం ఐసీయూలో 1:1 నిష్పత్తి ప్రకారం 1 రోగికి ఒక నర్సు, హైరిస్క్ పడకల వద్ద 1:2 నిష్పత్తి ప్రకారం ఇద్దరు రోగులకు ఒక్క నర్సు, జనరల్ వార్డులో 1:5 ప్రకారం ఒక్క నర్సు ఐదు మంది రోగులకు సేవలందించాల్సి ఉంటుంది. ఈ లెక్కన ఉస్మానియా ఆసుపత్రిలో ప్రస్తుతమున్న రెగ్యులర్, డిప్యూటేషన్, పీసీఎస్సీ లకు చెందిన 375 నర్సులతో పాటు అదనంగా 140 మంది నర్సులను కచ్చితంగా నియమించాల్సి ఉంది. ఉస్మానియా ఆసుపత్రి పేషెంట్ల కెపాసిటీకి తగినట్లు ప్రస్తుతం మొత్తం 523 మంది నర్సులు వరకు ఆస్పత్రిలో సేవలందించాల్సి ఉంది. అయితే ఖాళీల భర్తీలో కాంగ్రెస్ సర్కార్ తీవ్ర జాప్యం చేయడంతో రోగులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. వీలైనంత త్వరగా నర్సుల పోస్టులను భర్తీ చేసి ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.