ఆబాల గోపాలాన్ని అలరించే నుమాయిష్ వచ్చేసింది. నూతన సంవత్సరం తొలిరోజు నాంపల్లిలోని ఎగ్జిబిషన్ మైదానంలో కొలువుదీరింది. 45 రోజుల పాటు సాగే ఈ ప్రదర్శనను మంత్రులు హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రారంభించారు. మొదటి రోజు భారీ సంఖ్యలో సందర్శకులు తరలిరావడంతో సందడి నెలకొంది.
సిటీబ్యూరో, జనవరి 1(నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ వేదికగా నుమాయిష్ సందడి మొదలైంది. నాంపల్లి గ్రౌండ్లో 45రోజుల పాటు జరిగే 82వ ఆలిండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్‌ను మంత్రులు తన్నీరు హరీశ్‌రావు, మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎగ్జిబిషన్ సొసైటీ కార్యవర్గ సభ్యులు అట్టహాసంగా ప్రారంభించారు. ఈసారి 1500పైగా స్టాళ్లు ప్రదర్శించనుండగా, 3వేలకు పైగా ఉత్పత్తులు ప్రదర్శనకు రానున్నాయి.
ఈ సందర్భంగా ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడు, మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ… నుమాయిష్‌తో హైదరాబాదీలకు ఎంతో అనుబంధం ఉందని, తెలంగాణ జీవన విధానంలో ఎగ్జిబిషన్ భాగమైందని అన్నారు. 1938లో చిరు ప్రదర్శనగా మొదలై… ఇప్పుడు సొసైటీ ఆధ్వర్యంలో నడుస్తున్న 19 విద్యాసంస్థల్లో 30 వేల మందికి పైగా విద్యార్థులకు విద్యావకాశాలు, 13వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా జీవనోపాధి దొరుకుతుందని అన్నారు. నగర బ్రాండ్ ఇమేజ్ను మరింత పెంచుతూ మినీ భారత్ లాంటి నుమాయిష్‌కు వచ్చి విభిన్న సంస్కృతులు, ఆహారపు అలవాట్లతో ప్రతి ఒక్కరూ అనుభూతి పొందాలన్నారు. ఎగ్జిబిషన్ ద్వారా వచ్చే డబ్బులను సొసైటీ తెలంగాణలోని మారుమూల జిల్లాలలోనూ విద్యకు ఖర్చు చేయడం అభినందనీయమన్నారు. ఈ సారి ప్రమాదరహిత ఎగ్జిబిషన్‌కు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. అలాగే కొవిడ్ జాగ్రత్తలు తీసుకుంటూ, ప్రత్యేక హెల్త్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
స్వీయ అనుభవాలెన్నో..
సొసైటీ ఆధ్వర్యంలో జరిగే నుమాయిష్‌తో ఉన్న అనుభవాలను ఈ సందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి పంచుకున్నారు. తాను చదువుకునే రోజుల్లో ఏడాదికోసారి జరిగే నుమాయిష్ కోసం ఎదురుచూసేవాళ్లమన్నారు. నిజాం కాలం నాటి చరిత్ర హైదరాబాద్ నుమాయిష్ సొంతమని, తన వాళ్లు కూడా ఇక్కడికి వ్యాపారం కోసం వచ్చేవారని మంత్రి మహమూద్ అలీ గుర్తు చేశారు. ఎగ్జిబిషన్ గ్రౌండ్ స్థలం విషయంలో సీఎం కేసీఆర్ చొరవ తీసుకుంటారని, ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడిగా మంత్రి హరీశ్‌రావు వ్యవహారించడం ఎంతో అదృష్టమని, మరింత వేగంగా సమస్యలు పరిష్కారం అవుతాయని మంత్రి తలసాని ఆశాభావం వ్యక్తం చేశారు.
మినీ ట్రైన్లో మంత్రుల పర్యటన…
నుమాయిష్‌ను ప్రారంభించిన అనంతరంలో సందర్శకుల కోసం ఏర్పాటు చేసిన మినీ ట్రైన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ట్రైన్లో మంత్రులు పర్యటించి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లోని స్టాళ్లు, వసతులు, ఏర్పాట్లను పరిశీలించారు. ఇప్పటికే 60-70శాతం స్టాళ్లు ప్రారంభానికి సిద్ధం కాగా, మరో ఐదు రోజుల్లో పూర్తి స్థాయిలో ఎగ్జిబిషన్ అందుబాటులోకి వస్తుందని సొసైటీ నిర్వహకులు తెలిపారు.