ఉస్మానియా యూనివర్సిటీ, ఆగస్టు 16 : ఉస్మానియా యూనివర్సిటీ(Osmania University) దూరవిద్యా కేంద్రమైన ప్రొఫెసర్ జి. రాంరెడ్డి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ (PGRRCDE)లో వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు పీజీఆర్ఆర్సీడీఈ డైరెక్టర్ ప్రొఫెసర్ జీబీ రెడ్డి తెలిపారు. యూజీసీ నిబంధనల మేరకు వివిధ కోర్సులకు ప్రతి ఏటా రెండు దఫాలుగా ప్రవేశాలు నిర్వహిస్తున్నామని, అందులో భాగంగా మొదటి దఫా శుక్రవారం నుంచి అక్టోబర్ 15వ తేదీ వరకు ప్రవేశాలు నిర్వహిస్తామని ప్రకటించారు.
వివిధ పీజీ, యూజీ, డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సులతో కలిపి మొత్తం 72 ఓపెన్ డిస్టెన్స్ లెర్నింగ్ కోర్సులను అందిస్తున్నట్లు వివరించారు. కోర్సుల వివరాలు, నిబంధనలు, ఫీజు వివరాలు తమ వెబ్సైట్ www.oucde.netలో అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. అందులో లాగిన్ అయి దరఖాస్తు ఫారం నింపాలని సూచించారు. రిజిస్ట్రేషన్ ఫీజు, కోర్సు ఫీజు, పరీక్షా ఫీజులను ఆన్లైన్ విధానంలోనే చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.