అబిడ్స్, నవంబర్ 15: దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమంతోనే ఉత్తర భారతీయులంతా బీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలుపుతున్నారని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. తొమ్మిదిన్నర సంవత్సరాలుగా తమ ప్రభుత్వం ఉత్తరభారతీయులతో పాటు అన్ని వర్గాల అభ్యున్నతికి పాటుపడినట్లు చెప్పారు. గోషామహల్ నియోజకవర్గం అభివృద్ధిని కాంక్షిస్తూ నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థిగా నందకిశోర్ వ్యాస్‌ను ప్రకటించినట్లు తెలిపారు.
గోషామహల్ నియోజకవర్గంలోని పలువురు వ్యాపారవేత్తలు, పలు సంఘాల నాయకులు మంత్రి కేటీఆర్‌ను కలిసి బీఆర్ఎస్కు తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ వ్యాపారస్తులకు రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు బేగంబజార్ ఒక ప్రధాన వాణిజ్య కేంద్రం అని ఆయన అన్నారు. వ్యాపారులకు తమ ప్రభుత్వం అండగా ఉండి వారికి అన్ని విధాలా సహాయ సహకారాలు అందించిందన్నారు. మార్వాడీ సమాజ్‌కు చెందిన బీఆర్ఎస్ అభ్యర్థి నందకిశోర్ వ్యాస్‌ను గెలుపించేందుకు ప్రతి వ్యాపారస్తుడు, ప్రతి ఉత్తర భారతీయులతో పాటు ప్రజలంతా కృషి చేయాలన్నారు.
వ్యాస్‌ను గెలిపిస్తే గోషామహల్ గ్రేటర్‌లోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతారని పేర్కొన్నారు. నగర బీఆర్ఎస్ ఇన్చార్జి దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రమంతటా అభివృద్ధి జరుగుతుంటే గోషామహల్ నియోజకవర్గంలో మాత్రం అభివృద్ధి నిలిచి పోయిందన్నారు. ఎమ్మెల్యే రాజాసింగ్ అభివృద్ధిని విస్మరించారని ఆరోపించారు. బీఆర్ఎస్ అభ్యర్థి నందకిశోర్ వ్యాస్‌ను గెలిపిస్తే నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి నందకిశోర్ వ్యాస్ మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వ్యాపారులకు, ఉత్తర భారతీయులకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందించామన్నారు. గోషామహల్లో విజయం సాధించి నియోజకవర్గాన్ని మోడల్‌గా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు.
బీఆర్ఎస్కే మా మద్దతు
మంత్రి కేటీఆర్‌తో సమావేశమైన పలు సమాజ్‌ల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శిలు, పలు అసోసియేషన్ల నాయకులు బీఆర్ఎస్కు తమ మద్దతును ప్రకటించారు. 25 సంవత్సరాలుగా నందకిశోర్ వ్యాస్ బిలాల్ తమకు అండగా నిలిచారన్నారు. వ్యాస్‌ను గెలిపించేందుకు ఉత్తరభారతీయులమంతా కృషి చేస్తామని పేర్కొన్నారు. నియోజకవర్గంలో ఉత్తరభారతీయులమంతా ఈనెల 30న బీఆర్ఎస్కే ఓటు వేసి గెలిపిస్తామన్నారు.
ఉత్తరాది ప్రజల ఆత్మీయ సమ్మేళనానికి రండి..మంత్రి కేటీఆర్‌కు ఆహ్వానం…
ఈ నెల 19న అమీర్‌పేట్‌లో బాలాజీ రాజస్థాన్ మండల్ తదితర సంస్థల ఆధ్వర్యంలో జరుగనున్న ఉత్తరాది వ్యాపారస్తులు, ప్రజల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొనాలని కోరుతూ బీఆర్ఎస్ సీనియర్ నాయకులు గులాబ్‌సింగ్ రాజ్‌పురోహిత్ ఆధ్వర్యంలో ప్రతినిధులు బుధవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌ను కలిసి ఆహ్వానించారు. నియోజకవర్గం పరిధిలోని రాజస్థాన్, గుజరాత్, బెంగాలీ తదితర ప్రాతాల ఓటర్లంతా కలిసి తమకు తమ వ్యాపారాలకు హైదరాబాద్‌ను ఎంతో అనువైన ప్రాంతంగా తీర్చిదిద్దిన బీఆర్ఎస్కు మద్దతుగా, ప్రత్యేకించి సనత్‌నగర్ అభ్యర్థి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌కు తమ మద్దతు తెలిపేందుకు ఓటర్లు తరలి రానున్నారని గులాబ్‌సింగ్ రాజ్‌పురోహిత్ తెలిపారు. మంత్రి కేటీఆర్‌ను కలిసిన వారిలో రామ్నివాస్ భన్సాల్, పీయూశ్గుప్తా, సంజయ్ పన్సారీ తదితరులు ఉన్నారు.
– అమీర్‌పేట్, నవంబర్ 15