మేడ్చల్, సెప్టెంబర్9 (నమస్తే తెలంగాణ): మేడ్చల్ జిల్లావ్యాప్తంగా రుణమాఫీ అందని రైతులు గ్రీవెన్స్‌సెల్‌లో దరఖాస్తు చేసుకున్నారు. అయితే అర్జీల పరిశీలన నామమాత్రంగానే ఉన్నదని రైతులు ఆరోపిస్తున్నారు. దరఖాస్తులను పరిశీలించి.. ప్రభుత్వానికి నివేదించామని, తమ పని పూర్తయిందని, రుణమాఫీపై తమకు ఎలాంటి సమాచారం లేదంటూ.. అధికారులు చేతులు దులుపుకొంటున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు.
రుణమాఫీ కోసం తాము ఎవరినీ సంప్రదించాలన్నది అర్థం కావడం లేదని వాపోతున్నారు. రుణమాఫీ కాకపోవడంతో ఇటీవల సిద్దిపేట జిల్లా చిట్టాపూర్‌కు చెందిన రైతు సురేందర్‌రెడ్డి ఆత్మహత్య చేసుకున్న క్రమంలో అన్నదాతల్లో మరింత ఆందోళన ఎక్కువైంది. గ్రీవెన్స్ సెల్‌లకు వస్తున్న దరఖాస్తులను పరిశీలించి నివేదికను ఉన్నతాధికారులకు పంపిస్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. రుణమాఫీ కాని రైతుల వివరాలు, రేషన్‌కార్డుల్లో ఉన్న కుటుంబసభ్యుల వివరాలను సేకరించే పనిలో ఉన్నట్లు తెలిపారు.