సిటీబ్యూరో, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ): వినాయక నవరాత్రులు ప్రారంభమయ్యాయి…. నిమజ్జనోత్సవం కూడా మరో ఆరు రోజులే ఉండడంతో పనిచేయని సీసీ కెమెరాలకు యుద్ధ ప్రతిపాదికన మరమ్మతులు చేసేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. అప్పటి వరకు ఎన్ని సీసీ కెమెరాలు పూర్తి చేయగల్గుతామనే విషయంలో పోలీసులు ఆందోళన చెందుతున్నారు. సగానికి సగం సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో వాటి నిర్వాహణను ప్రభుత్వం పక్కన పెట్టింది. దీంతో ప్రశాంతంగా నిమజ్జనాల నిర్వాహణకు సీసీ కెమెరాలు అనివార్యమయ్యాయి. దీంతో పోలీసులే తమ నిధులతో పనిచేయని సీసీ కెమెరాలను బాగుచేసే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
ప్రజల సహకారం, టెక్నాలజీని ఉపయోగిస్తూ ప్రతియేడు ప్రశాంతంగా నిర్వహించేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో ట్రై కమిషనరేట్ల పరిధిలో లక్షలాది సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఆ సీసీ కెమెరాలలో ఇప్పుడు సగం వరకు పనిచేయడం లేదని పోలీసు వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. సీసీ కెమెరాల నిర్వాహణను ప్రభుత్వం ఏనాడూ పట్టించుకోకపోవడంతో పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోంది. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నేను సైతం, కమ్యూనిటీ, నిర్భయ, ఎల్ అంట్ టీ సంస్థల ద్వారా సుమారు 2.5 లక్షలకుపైగా సీసీ కెమెరాలు ఉన్నాయి.
అందులో కమ్యూనిటీ, నిర్బయ కింద ఉన్న సుమారు 17 వేల కెమెరాలు కమాండ్ కంట్రోల్ సెంటర్లకు అనుసంధానమై ఉన్నాయి. ఈ 17వేల సీసీ కెమెరాలలో సుమారు 8 వేల కెమెరాల వరకు పనిచేయడం లేదని సమాచారం. ఇతర కమిషనరేట్ల పరిధిలో కూడా ఇదే పరిస్థితి నెలకొన్నట్లు సమాచారం. వినాయక నిమజ్జనం మహాశోభయాత్ర రాచకొండ కమిషనరేట్ పరిధిలోని బాలాపూర్ నుంచే ప్రారంభమవుతుంది. దీంతో ఇప్పుడు రాచకొండ పోలీసులు ప్రధాన ర్యాలీలు జరిగే రూట్లలో సీసీ కెమెరాలకు మరమ్మతులు చేయడంతో పాటు అవసరమైన చోట కొత్త కెమెరాలను ఏర్పాటు చేసే ప్రక్రియను చేపట్టారు.
నిరంతరం సీసీ కెమెరాలతో నగరాన్ని కంటికి రెప్పలా కాపాడేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ట్రై పోలీస్ కమిషనరేట్లలో లక్షలాది సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి, దేశంలోనే గాక ప్రపంచ స్థాయిలోనే సీసీ కెమెరాలు ఎక్కువగా ఉన్న నగరంగా హైదరాబాద్‌కు గుర్తింపు తీసుకొచ్చారు. సురక్షితమైన నగరంగా పేరున్న హైదరాబాద్ ప్రతిష్టను మరింత పెంచాల్సిన ప్రభుత్వం, ఈ విషయాన్ని ఏ మాత్రం పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి.
సీసీ కెమెరాల నిర్వాహణకు కావాల్సిన నిధులు ఇవ్వకపోడంతో మరమ్మతులు, నిర్వహణకు ఆయా కెమెరాలు నోచుకోవడం లేదని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వినాయక నవరాత్రులు, నిమజ్జనం అనేది శాంతి భద్రతల పరంగా కీలకమైంది. ప్రశాంత వాతావారణంలో వేడుకలు నిర్వహించడానికి పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేస్తూ 11 రోజుల పాటు నిరంతరం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరముంది. వేలాది మంది పోలీసులు బందోబస్తులో ఉంటారు, అయితే సీసీ కెమెరాలు అన్ని చోట్ల సక్రమంగా పనిచేస్తే, పోలీస్ బందోబస్తుకు అవి బలంగా మారుతాయి. కాని ప్రభుత్వం ఈ విషయాన్ని ఏ మాత్రం పట్టించుకోకపోవడం గమనార్హం.
సీసీ కెమెరాలు పోలీసుల బందోబస్తులో కీలక భూమిక పోషిస్తున్నాయి. ఈ నేపధ్యంలోనే పోలీసు శాఖ తమ నిధులతోనే ఆయా సీసీ కెమెరాలను బాగు చేయించుకుంటుంది. వినాయక మండపాలు, ఆయా రూట్లలో జరిగే రాకపోకలు, నిమజ్జనం సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి జరిగే శోభాయాత్ర ర్యాలీలు, ప్రధాన యాత్ర రూట్‌కు వచ్చి చేరే వరకు పోలీసుల నిఘా నిరంతరం ఉంటుంది.
ఇందుకు ప్రత్యేకంగా ఆయా ప్రాంతాల్లో కమాండ్ కంట్రోల్ సెంటర్లు ఏర్పాటు చేయడంతోపాటు, వాటిని ప్రధాన కమాండ్ కంట్రోల్‌కు అనుంధానం చేస్తూ నిరంతరం పర్యవేక్షిస్తుంటారు. దీంతో ఇప్పుడు ఆయా రూట్లలో పనిచేయని సీసీ కెమెరాలను గుర్తించి వాటికి మరమ్మతులు చేయడమే గాక కొత్తవి కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకు పోలీస్ శాఖ తమ సొంత నిధులను వెచ్చిస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వం నిధులు మంజూరు చేసి, సీసీ కెమెరాల నిర్వాహణ చేపట్టే వరకు ఎంత కాలం అవుతుందో.. అసలు నిధులు వస్తాయన్న గ్యారంటీ కూడా లేదు. దీంతో ప్రశాంతంగా నవరాత్రులు, నిమజ్జనం పూర్తి చేయడమే లక్ష్యంగా పోలీస్ శాఖ కావాల్సిన చోట సీసీ కెమెరాలతో నిఘాను పటిష్టం చేసుకుంటుంది.