సిటీబ్యూరో, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ): నిబంధనలకు విరుద్ధంగా ఇతర రాష్ర్టాల నుంచి నగరానికి నాన్‌డ్యూటీ పెయిడ్ మద్యం తరలిస్తున్న ఓ వ్యక్తిని కుత్బుల్లాపూర్ ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి 67 మద్యం ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. కర్ణాటక ప్రాంతానికి చెందిన శివప్ప సేలం జిల్లా నుంచి ప్రైవేటు ట్రావెల్ బస్సులో 67 ఆఫీసర్స్ ఛాయిస్ నాన్‌డ్యూటీ పెయిడ్ మద్యం ప్యాకెట్లను నగరానికి తరలించాడు.
ఈ మేరకు సమాచారం అందుకున్న అబ్కారీ అధికారులు మేడ్చల్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కె.నవీన్ ఆదేశాల మేరకు కుత్బుల్లాపూర్ మాధవపురం ప్రాంతంలో ప్రైవేటు ట్రావెల్స్‌ను ఆపి తనిఖీ చేయగా.. టెట్రా ప్యాకెట్ల రూపంలో 67 మద్యం ప్యాకెట్లు బయటపడ్డాయి. ఈ మేరకు నిందితుడిని అరెస్టు చేసి, అతడి వద్ద నుంచి నాన్‌డ్యూటీ పెయిడ్ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.
ధూల్‌పేటలో గుట్టుచప్పుడు కాకుండా గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు దంపతులను ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్టీఎఫ్ అధికారులు పట్టుకుని అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి 2.160 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఎస్టీఎఫ్ అధికారి నంద్యాల అంజిరెడ్డి కథనం ప్రకారం.. జుమ్మేరాత్ బజార్‌కు చెందిన మహేందర్‌సింగ్, అతడి భార్య సునీత బాయి..
అదే ప్రాంతానికి చెందిన దుర్గేశ్, అంగూర్‌బాయి కలిసి గుట్టుచప్పుడు కాకుండా గంజాయి విక్రయిస్తున్నారు. సమాచారం అందుకున్న ఎస్టీఎఫ్ బృందం సోమవారం దాడులు జరిపి మహేందర్‌సింగ్ దంపతులను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 2.168 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. కాగా, దుర్గేశ్, అంగూర్బాయిపై కేసులు నమోదు చేశారు. ఈ దాడుల్లో ఇన్స్పెక్టర్ మధుబాబు తదితరులు పాల్గొన్నారు.
ప్రస్తుతం వినాయక నిమజ్జనం నేపథ్యంలో మద్యం అమ్మకాలపై విధించిన నిషేధం సందర్భంగా డ్రై డేస్‌లో(నిషేధిత రోజుల్లో)ఎవరైనా మద్యం అమ్మకాలు జరిపితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని, నిబంధనలు ఉల్లంఘించిన వైన్ షాపు లేదా బార్ అండ్ రెస్టారెంట్‌కు సంబంధించిన లైసెన్స్‌ను కూడా రద్దు చేస్తామని అబ్కారీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వి.బి.కమలాసన్‌రెడ్డి హెచ్చరించారు.