అంబర్ పేట, జూన్ 2 : తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలు సోమవారం అంబర్ పేట నియోజకవర్గంలోని పలు ప్రాంతాలలో ఘనంగా జరిగాయి. నియోజకవర్గంలోని కాచిగూడ, నల్లకుంట, గోల్నాక, అంబర్ పేట, బాగ్ అంబర్ పేట తదితర డివిజన్లలో పార్టీలకతీతంగా ఆవిర్భావ వేడుకలను నిర్వహించారు. ఇందులో భాగంగా నల్లకుంట ఫీవర్ హాస్పిటల్ చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ జాతీయ జెండాను ఎగరవేశారు. దివంగత ప్రొఫెసర్ జయశంకర్ సార్ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి పార్టీ కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలకు పంపిణీ చేశారు.
అనంతరం ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ మాట్లాడుతూ.. కేసీఆర్ కృషి, పట్టుదల ద్వారానే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తున్న సమయంలోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని దివాలా తీస్తుందని విమర్శించారు. దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తెలంగాణను నిలిపిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో పరిపాలన అయోమయంగా ఉందని, ఇది ప్రజా పాలన కాదని ప్రజలను ఇబ్బంది పెట్టే పాలన అని మండిపడ్డారు. కాంగ్రెస్ పాలనలో ఏ రంగం వారు కూడా సంతోషంగా లేరని అభిప్రాయపడ్డారు. మళ్లీ కేసీఆర్ అధికారంలోకి రావడం ఖాయమని చెప్పారు.