Hyderabad | బంజారాహిల్స్, జూన్ 22 : బస్తీలో పేదలకు విద్యను అందించేందుకు ప్రభుత్వం స్థలం కేటాయించగా దాన్ని కాజేసేందుకు కొంతమంది అధికార పార్టీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారా..? నిధులు మంజూరైనా పాఠశాల నిర్మాణం ప్రారంభం కాకుండా వారే అడ్డుపడుతున్నారా..? పేదలకు ప్రభుత్వ స్కూల్ కట్టించాలన్న ప్రజాప్రతినిధుల ప్రతిపాదనలు మూలనపడ్డట్లేనా..? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి.
నగరం నడిబొడ్డున్న ఉన్న బంజారాహిల్స్ డివిజన్లోని బోళానగర్, కాజా నగర్ బస్తీలలో సుమారు 10 వేల జనాభా ఉంటుంది. పన్నేండేళ్లుగా అక్కడ నడుస్తున్న ప్రభుత్వ పాఠశాల మూతపడి మూడేళ్లు గడుస్తున్నా అధికారుల్లో చలనం లేదు. పాఠశాల భవనాన్ని నిర్మించాలన్న స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారుల ప్రయత్నాలకు ఎప్పటికప్పుడు గండికొట్టి పాఠశాలకు చెందిన స్థలంపై కొంతమంది అధికారపార్టీ నేతలు కన్నేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. బోళానగర్లో కొత్త పాఠశాల నిర్మాణం కోసం గత ప్రభుత్వం హయాంలో సర్వశిక్షా అభియాన్, మన బస్తీ-మనబడి పథకాల కింద గతంలో బీఆర్ఎస్ కార్పొరేటర్‌గా ఉన్న సమయంలో ప్రస్తుత మేయర్ గద్వాల్ విజయలక్ష్మి చొరవతో నిధులు మంజూరు చేశారు. రాజ్యసభ సభ్యులు కే.కేశవరావు సైతం తన ఎంపీ ల్యాడ్స్ నుంచి నిధులు మంజూరు చేశారు. సుమారు 1.5 కోట్ల వ్యయంతో సుమారు 500 గజాల స్థలంలో జీ ప్లస్ 2 పద్దతిలో స్కూల్ భవనం కోసం అప్పటి ఎమ్మెల్యే దానం నాగేందర్, కార్పొరేటర్ గద్వాల్ విజయలక్ష్మి చేతులమీదుగా శంకుస్థాపన చేశారు.
కాగా స్కూల్ నిర్మాణం చేసేదాకా విద్యార్థులను ఇతర స్కూల్లోకి మార్చాలని విద్యాశాఖ అధికారులు నిర్ణయించి కొంతమందిని రెండు కిలోమీటర్ల దూరంలోని మాసాబ్ ట్యాంక్ ప్రభుత్వ పాఠశాలకు, కిలోమీటరున్నర దూరంలోని ఎన్బీటీ నగర్ ప్రభుత్వ పాఠశాలలో సర్దుబాటు చేశారు. స్కూల్ భవన నిర్మాణం కోసం రెండేళ్ల క్రితం టెండర్లు ఖరారయ్యాయి. అయితే శాసనసభ ఎన్నికలు రావడంతో పనులు ముందుకు సాగలేదు. ఎన్నికలు పూర్తయ్యాక కాంట్రాక్టర్ పనులు చేపట్టేందుకు రాగా కొంతమంది అధికారపార్టీ నేతలు అడ్డుకోవడంతో పాటు రకరకాలైన ఇబ్బందులకు గురిచేశారు. దీంతో పనులను ప్రారంభించకుండానే కాంట్రాక్టర్ వెనుదిరిగారు. అప్పటినుంచి స్కూల్ భవన నిర్మాణాన్ని గురించి అధికారులతో పాటు స్థానిక ప్రజా ప్రతినిధులు పట్టించుకోవడం మానేశారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
స్థలాన్ని కాజేసేందుకే అడ్డంకులు..?
2012లో బోళానగర్లో ప్రభుత్వ పాఠశాలకు 500 గజాల స్థలాన్ని కేటాయిస్తూ షేక్‌పేట రెవెన్యూ అధికారులు పంచనామా చేసి నిప్పటించారు. కొండప్రాంతంగా ఉన్న ఈ స్థలంపై అప్పటికే కన్నేసిన కొంతమంది నేతలు అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు. కాగా 2014లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వారు స్థలంపై ఆశలు వదులుకున్నారు. ఎలాగైనా ఈ స్థలంలో ప్రభుత్వ పాఠశాల నిర్మాణం చేపట్టాలని కొంతమంది ప్రయత్నించగా,మరికొంతమంది నేతలు మాత్రం ఈ స్థలాన్ని ప్లాట్లుగా మార్చుకుని పంచుకోవాలని విశ్వ ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో ఏడాదిన్నర క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్థలాన్ని కాజేసేందుకు మరోసారి ప్రయత్నాలు ప్రారంభమయినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరపడంతో పాటు స్కూల్ నిర్మాణానికి అడ్డంకులను తొలగించాలని బస్తీవాసులు కోరుతున్నారు. సుమారు 10వేల జనాభా కలిగిన బస్తీలకు ప్రభుత్వ పాఠశాల లేకపోవడం సిగ్గుచేటని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.