సిటీబ్యూరో, జూలై 23 (నమస్తే తెలంగాణ): డ్రగ్ పెడ్లర్లు ఆయుధాలు వినియోగిస్తున్నారనే విషయంలో కొంత అనుమానం ఉండేదని, కానీ తాజాగా ఘటనలతో పెడ్లర్లు ఆయుధాలు వాడుతున్నట్లుగా గుర్తించినట్లు హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ అన్నారు. హైదరాబాద్‌లో ముంబైతో సంబంధమున్న ముఠాతో సహా మూడు డ్రగ్స్ ముఠాలు హెచ్‌న్యూ పోలీసులకు పట్టుబడ్డాయని, వీరి నుంచి పెద్ద ఎత్తున డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్లు సి వి ఆనంద్ తెలిపారు.
బషీర్‌బాగ్‌లోని సిసిఎస్ కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డ్రగ్స్ సైప్లె చేస్తున్న ఇద్దరు నైజీరియన్లతో సహా ఏడుగురు నిందితుల అరెస్ట్ వివరాలను సివి ఆనంద్ వెల్లడించారు. నార్కోటిక్స్ వింగ్ పోలీసుల దాడుల్లో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయని, ముంబైతో సంబంధం ఉన్న హైదరాబాద్ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. కొకైన్, ఎఫిడ్రన్ సరఫరా చేస్తున్న డ్రగ్స్ పెడ్లర్లను అరెస్ట్ చేశారు.
ఆరుగురు కొకైన్, మరోముగ్గురు మియావ్మియావ్ డ్రగ్ అఫెండర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి సుమారు కోటి రూపాయల విలువ చేసే 286 గ్రాముల కొకైన్, 11 ఎక్సాటసీ పిల్స్, కంట్రీమేడ్ తుపాకీ, ఆరురౌండ్ల బుల్లెట్లు ,12 మొబైల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో డ్రగ్ ట్రాఫికింగ్‌కు పాల్పడుతున్న ఇద్దరు క్లెమెంట్, లాజరస్ అనే ఇద్దరు నైజీరియన్లను అదుపులోకి తీసుకున్నారు.
త్వరలోనే వీరిని డిపోర్టేషన్ చేయనున్నట్లు సివి ఆనంద్ తెలిపారు. నిందితుల్లో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కూడా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో హెచ్‌న్యూ డిసిపి వైవిఎస్ సుధీంద్ర, హెచ్‌న్యూ ఇన్స్పెక్టర్తు జిఎస్ డానియల్, బాలస్వామి, ఎస్ఐ వెంకటరాములు, బేగంబజార్ ఎస్హెచ్ఓ భరత్‌కుమార్ గౌడ్, ఎస్ శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు. డ్రగ్ ముఠాను పట్టుకోవడంలో కృషిచేసిన పోలీసులను సిపి అభినందించారు.
సముద్రమార్గం ద్వారా కొకైన్..!
డ్రగ్స్ సైప్లె చేయడంలో మొదటి ముఠాకు ముంబైతో సంబంధముందని ఆనంద్ తెలిపారు. హైదరాబాద్‌లో కొద్దిరోజుల క్రితం రవివర్మ, సచిన్ అనే ఇద్దర్ని డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేశారు. ఆ ఇద్దరిని విచారించినప్పుడు ప్రేమ్ ఉపాధ్యాయ్ అనే పెడ్లర్ పాత్ర వెలుగులోకి వచ్చింది. 2022లో ప్రేమ్ డ్రగ్స్ వాడడం మొదలుపెట్టారని, నల్లకుంట, శేరిలింగంపల్లిలో ప్రేమ్‌పై రెండుకేసులు ఉన్నాయని ఆనంద్ తెలిపారు. అతను బెయిల్‌పై బయటకు వచ్చిన తర్వాత సాఫ్ట్వేర్ కంపెనీలో క్వాలిటీ ఎనలిస్ట్‌గా పనిచేస్తున్నారని తెలిపారు.
ప్రేమ్‌కు ముంబైకి చెందిన డ్రగ్స్ ముఠాలతో సంబంధాలు ఏర్పడ్డాయని, ముంబైకి చెందిన ముజాయిత్ అనే డ్రగ్ పెడ్లర్ నైజీరియన్ల నుంచి డ్రగ్స్ కొనుగోలు చేస్తారని తెలిపారు. కొకైన్‌ను సముద్రమార్గం ద్వారా తెప్పించి, తన సబ్సప్లయర్స్తో పెడ్లింగ్ చేస్తారని, ఆర్థికంగా వీక్‌గా ఉన్న ఇద్దరు ఎలక్ట్రిషియన్లను సబ్పెడ్లర్లుగా మార్చుకున్నాడని చెప్పారు.
వినోద్ కిషన్‌లాల్ శ్రీవాత్సవతోపాటు డ్రగ్స్ సైప్లె చేస్తున్న క్రమంలో ముజాయిత్కు చెందిన సప్లయర్లు చైతన్యవినాయక్ వాగ్, ముస్తక్ఖాన్ ఇద్దరు ముఠాగా ఏర్పడి హైదరాబాద్‌లో సైప్లె చేస్తున్నారని, ఈ ఇద్దరితో కలిసి ప్రేమ్ ఉపాధ్యాయ్ డ్రగ్స్ కొనుగోలు చేసి అమ్ముతున్నారని, వీరి నుంచి 276 గ్రామ్ కొకైన్ స్వాధీనం చేసుకున్నామని, వీటి విలువ రూ.69లక్షలు ఉంటుందని సివి ఆనంద్ తెలిపారు.
వ్యాపారంలో నష్టపోయి.. ఈజీ మనీ కోసం..!
రెండోగ్యాంగ్లో పవన్భాటి, జితేందర్ కీలకమైన వ్యక్తులని, కాటేదన్కు చెందిన జితేందర్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నప్పుడు ఈ డ్రగ్స్ వ్యవహారం బయటకు వచ్చిందని ఆనంద్ చెప్పారు. జితేందర్ రాజస్తాన్‌కు చెందిన వ్యక్తి కాగా, చిన్నవయసులో నగరానికి వచ్చి స్వీట్ షాప్ పెట్టుకుని లాస్ అయి, ఈజీ మనీ కోసం డ్రగ్స్ అమ్ముతున్నాడని ఆయన తెలిపారు.
పవన్ భాటి రాజస్థాన్‌కు చెందిన వ్యక్తి కాగా ఆయన హైదరాబాద్‌కు వచ్చి ఇక్కడ కిరాణాషాపులో పార్ట్నర్గా చేరి తర్వాత నష్టాల పాలయ్యాడు. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న జితేందర్‌కు పవన్భాటి పరిచయం అయ్యారని, ఆర్థికంగా బలపడడానికి డ్రగ్స్ అమ్మడమే మార్గమని, వీరు మియావ్ మియావ్ ఎండి డ్రగ్స్ విక్రయిస్తున్నారన్నారు.
డ్రగ్స్ పెడ్లింగ్ ప్రమాదకరమైన బిజినెస్ కాబట్టి ఆయుధం ఉండాలని, రూ.70వేలతో కంట్రీమేట్ తుపాకీ, ఏడురౌండ్ల బుల్లెట్లు కొన్నారని, అందులో కాటేదన్లో ఒక రౌండ్ బుల్లెట్లు టెస్టింగ్ కోసం పేల్చారని కమిషనర్ తెలిపారు. సురేందర్, హనుమాన్ అనే ఇద్దరు రాజస్తాన్‌కు చెందిన వారి దగ్గర నుంచి జితేందర్, పవన్‌లు డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నారని, ఈ కేసులో మొత్తం ముఠాను అరెస్ట్ చేసినట్లు ఆనంద్ చెప్పారు.
గర్ల్‌ఫ్రెండ్ మోసం చేసిందని..!
డ్రగ్స్ కేసులో మూడో గ్యాంగ్ బొల్లారం పీఎస్ పరిధిలో పట్టుబడిందని, ఇందులో హర్ష అనే నిందితుడు బిటెక్ చదివి సాఫ్ట్ వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తూ తన గర్ల్ ఫ్రెండ్ మోసం చేయడంతో డ్రగ్స్ వినియోగించడం అలవాటు చేసుకున్నాడని సివి ఆనంద్ పేర్కొన్నారు. హర్షకు గోవాకు చెందిన పెడ్లర్ క్రిస్తో పరిచయమైందని, మొదట డ్రగ్స్ వినియోగించడం ఆ తర్వాత తానే పెడ్లర్‌గా మారి విక్రయించడం మొదలుపెట్టాడు. హర్ష నుంచి పది గ్రాముల కొకైన్ ఎక్స్టసి పిల్స్ స్వాధీనం చేసుకున్నట్లుగా పోలీసులు తెలిపారు. అతనిని విచారించగా ఇద్దరు నైజీరియన్ల పాత్ర వెలుగు చూసిందని, వీరు వీసా, పాస్‌పోర్ట్ గడువు ముగిసినా ఇక్కడే ఉంటూ డ్రగ్స్ పెడ్లింగ్ చేస్తున్నారని సిపి చెప్పారు. ఇందులో క్లెమెంట్ అనే నైజీరియన్ చీటింగ్ కేసులో చండీగడ్‌లో అరెస్ట్ అయ్యాడని, నాలుగు నగరాల్లో తిరుగుతున్నాడని తెలిపారు.
డిపోర్ట్ చేయడం పనిష్మెంటే..!
డ్రగ్స్‌తో పాటు ఇతర కేసుల్లో పట్టుబడ్డ విదేశీయులను డిపోర్టేషన్ చేయడం చాలా కష్టమవుతున్నదని, ఇది ఒక రకంగా తమకు పనిష్‌మెం ట్ లాంటిదని కమిషనర్ సివి ఆనంద్ పేర్కొన్నారు. నైజీరియన్లను అరె స్ట్ చేసి జైలుకు పంపితే బెయిల్‌పై బయటకు వచ్చి కేసులు తేలే సమయంలో దొరకడం లేదని, వారు వేర్వేరు పేర్లతో నగరాల్లో తిరుగుతున్నారని, ఎన్బిడబ్ల్యూ జారీ చేసినా వారు దొరకడం లేదన్నారు. విదేశీయులను డిపోర్ట్ చేయడానికి ఎమర్జెన్సీ ట్రావెల్ సర్టిఫికేట్ పొంది ఉం డాలని, అది పొందడం చాలా కష్టమన్నారు. ట్రావెల్ పొందిన తర్వాత ఎఫ్ఆర్వో ఎగ్జిట్ పర్మిషన్ ఇస్తారని, అప్పుడు ట్రావెల్ టికెట్ బుక్ చేసి వాళ్లను పంపాలని, అప్పటివరకు వారి బాధ్యత, ఖర్చు అంతా పోలీసులే భరించాల్సి వస్తున్నదని ఆనంద్ చెప్పారు. ఇప్పటివరకు తెలంగాణ 1844 మంది విదేశీయులు ఉన్నట్లు గుర్తించామని, అందులో హైదరాబాద్‌లో ఆఫ్రికన్లు 1387, 43 మంది నైజీరియన్లు ఉన్నారని వీరిలో 21 మందిని డిపోర్టేషన్ చేశామని ఆయన పేర్కొన్నారు.