ఖైరతాబాద్, అక్టోబర్ 1 : నిమ్స్ ధవాఖాన ఫీజియోథెరపి విభాగానికి ఆధునిక సొబగులు సంతరించుకున్నారు. ఈ విభాగానికి వచ్చే రోగులకు మరింత మెరుగైన వైద్య సదుపాయాలు అందనున్నాయి. రూ.40లక్షల విలువైన మూడు ఆధునిక పరికరాలను నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ నగరి బీరప్ప, డీన్ డాక్టర్ లీజా రాజశేఖర్, అదనపు మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ కృష్ణా రెడ్డితో కలిసి బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అసోసియేట్ డీన్ డాక్టర్ శ్రీభూషణ్ రాజు, ఫీజియోథెరపి విభాగాధిపతి డాక్టర్ శ్రవణ్ కుమార్, డాక్టర్ నవీన్, డాక్టర్ ప్రసాద్, డాక్టర్ ప్రవీణ్, డాక్టర్ సునీత్ వాగ్రే తదితరులు పాల్గొన్నారు.
పరికరాల ప్రత్యేకలివే..
కండరాల బలం, కీళ్ల కదలికల సంతులనం అంచనా వేయడంతో పాటు న్యూరో మస్క్యూలోస్కెలిటల్ సమస్యలు, స్పోర్ట్ ఇంజురీలు, శస్త్రచికిత్స తర్వాత పునరుద్దరణ, వృద్ధుల్లో పతన నిరోదంలో ఉపయోగపడే డైనామెమోట్రీ (ఫోర్స్ మేజర్మెంట్ సిస్టమ్), నడక బంగిమ, పాదపదన వ్యత్యాసాలను అంచనా వేయడానికి, డయాబెటిక్ ఫుట్ కేర్, స్పోర్ట్స్ ఇంజురీలు, ఆర్థోపెడిక్, న్యూరాలజికల్ రిహాబిలిటేషన్లో ఉపయోగించే ఫుట్ప్రెజర్ అనాలిసిస్ సిస్టమ్, లోతైన కణజాల చికిత్స, నొప్పి ఉపశమనం, వాపు తగ్గింపు, ఆర్థరైటీస్, లిగమెంట్ గాయాలు, దీర్ఘకాలిక వాపు, ఫ్రోజన్ షోల్డర్, వెనస్ డిజెనరేటీవ్ సమస్యల కోసం షార్ట్ వేవ్ డయాథెర్మి పరికరాని వినియోగిస్తారు. ఈ ఆధునిక పరికరాల ద్వారా రోగులకు స్వల్ప కాలంలోనే మెరుగైన ఉపశమనం కలుగుతుందని వైద్యులు తెలిపారు.