ఖైరతాబాద్, ఆగస్టు 6 : నిమ్స్ దవాఖానకు చికిత్స కోసం వెళ్లాలంటే వన్ వేలో ప్రయాణించాల్సిందేనా.. అంటే తాజాగా పరిపాలనా విభాగం తీసుకున్న నిర్ణయమే అందుకు నిదర్శనం. దవాఖానకు వచ్చే వారు పంజాగుట్ట రహదారి నుంచి ఎంట్రీ ఇచ్చి తిరుగు ప్రయాణంలో జలగం వెంగళరావు పార్కు ఎదురుగా బంజారాహిల్స్ రోడ్ నం.1లో ఉన్న గేటు ద్వారా బయటకు రావాలి. నిమ్స్‌కు ప్రతి నిత్యం వేలాదిగా రోగులు వివిధ చికిత్స కోసం వస్తుంటారు. తెలంగాణ నుంచే కాదు దేశంలోని వివిధ రాష్ర్టాలతో పాటు పలు దేశాల నుంచి చికిత్స కోసం రోగులు వస్తారు. బయటి వాహనాలను నిరోధించేందుకేనని యాజమాన్యం చెబుతున్నా.. ప్రస్తుతం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల దవాఖానకు వచ్చే రోగులు, వారి సహాయకులకే కాదు, సిబ్బందికి ఇబ్బందులు తప్పవంటున్నారు.
పంజాగుట్ట మీదుగా దవాఖానకు చికిత్స కోసం వచ్చే రోగులు, వారి సహాయకులు వైద్యులను సంప్రదించిన తర్వాత బంజారాహిల్స్ రోడ్ నం.1 వైపు ఉన్న ఎగ్జిట్ ద్వారా వెళ్లిపోవచ్చు. అయితే నిమ్స్ దవాఖానకు అధిక సంఖ్యలో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారే వస్తుంటారు. అత్యవసర చికిత్సతో పాటు జనరల్ మెడిసిన్, గ్యాస్ట్రో (మెడికల్, సర్జికల్), పల్మనాలజీ, న్యూరాలజీ, యూరాలజీ, కార్డియాలజీ, నెఫ్రాలజీ, హెమటాలజీ, ఆర్థోపెడిక్స్, రుమటాలజీ, ఆంకాలజీ (మెడికల్, సర్జికల్), వాస్కులర్, ప్లాస్టిక్ సర్జరీ, ఫిజియోథెరపీ తదితర విభాగాలు ఉన్నాయి. ప్రస్తుతం 1900 పడకల సామర్థ్యం కలిగిన నిమ్స్‌కు ప్రతి రోజు 2వేలకు పైగా వివిధ విభాగాలకు చికిత్స కోసం వస్తారు. అయితే ఒకే రోజు వచ్చి వైద్యులను సంప్రదించి వెంటనే తిరిగి వెళ్లే వారికి ఎలాంటి సమస్య ఉండదు.
ప్రస్తుతం 2వేల పడకల సామర్థ్యం కలిగిన భవన నిర్మాణం నేపథ్యంలో నిమ్స్‌కు వెళ్లేందుకు ఈ రెండు దారులు మాత్రమే ఉన్నాయి. దీంతో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ ఇన్ పేషంట్‌గా ఉండాల్సిన వారు, వారికి ఆహారం, నీరు తీసుకువచ్చేందుకు బయటకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు సమస్య వస్తోంది. అంతేకాకుండా ప్రమాదాలు జరిగినప్పుడు అన్ని రకాల మందులు, కొన్ని వైద్య పరికరాలు నిమ్స్‌లో కాని, ఫార్మసీలో కాని దొరకకుంటే వారు అత్యవసరంగా ప్రైవేట్ మెడికల్ షాపులకు పరుగులు పెట్టాల్సి వస్తున్నది. నిత్యం ఇది జరుగుతూనే ఉంటుందని పలువురు ఆరోపిస్తున్నారు.
ఆ సందర్భంలో మందులు, లేక వైద్య పరికరాలను తీసుకొని వాహనాలపై మళ్లీ దవాఖానకు వెళ్లాలంటే వెంగళరావు పార్కు మీదుగా యూటర్న్ తీసుకొని పంజాగుట్టకు వెళ్లి అక్కడ మరో యూటర్న్ తీసుకొని ఖైరతాబాద్ వైపునకు వెళ్లి సివిల్ సప్లయి భవన్ సమీపంలో మరో యూటర్న్ తీసుకొని సుమారు కిలోమీటరు ప్రయాణించి పంజాగుట్ట ఎంట్రీ గేటుకు చేరుకోవాలి. లేదా తాజ్ కృష్ణ హోటల్ ఎదురుగా లెఫ్ట్ తీసుకొని అటు నుంచి పంజాగుట్ట వైపునకు వెళ్లే దారికి మరో లెప్ట్ తీసుకొని కనీసం కిలోమీటరున్నర ప్రయాణించి మొత్తం నిమ్స్ చుట్టూ ప్రదక్షిణ చేసి తిరిగి పంజాగుట్ట గేటు వద్ద ఎంట్రీ ఇవ్వాల్సి వస్తుందని పలువురు రోగులు, వారి సహాయకులు వాపోతున్నారు.
ప్రతి రోజు నిమ్స్‌కు చికిత్సకు వచ్చే వారి వాహనాలే కాదు, ప్రైవేట్ వాహనాలు షార్ట్ కట్ రూట్ ద్వారా బంజారాహిల్స్ వెళ్లేందుకు అటు నుంచి పంజాగుట్ట వైపునకు వచ్చేందుకు నిమ్స్ క్యాంపస్‌ను వినియోగించుకుంటున్నారు. దీనిని అరికట్టేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నాం. ప్రస్తుతం తీసుకున్న వన్ వే నిర్ణయం ఫైనల్ కాదు. ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నాం. ప్రస్తుతం నిమ్స్‌లో పార్కింగ్‌కు స్థలాభావ సమస్య ఉంది. అంతేకాకుండా బయటి వాహనాలను నిరోధించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాం. ఒక వేళ రోగులు, వారి సహాయకులకు ఇబ్బందులు కలిగితే అవసరమైతే దీనిని విరమించుకుంటాం. అలాగే ఇటు నుంచి అటు వెళ్లేందుకు నిమ్స్ లోపలి మార్గాన్ని ఉపయోగించుకునే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఆ మేరకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం.
– డాక్టర్ నగరి బీరప్ప, నిమ్స్ డైరెక్టర్