NIMS Fire Accident | ఖైరతాబాద్, మే 3 : నిమ్స్‌లో అగ్ని ప్రమాద ఘటన తర్వాత చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో పటాకులు, సూట్ కేసు కేసుల్లో ఒక్కో చిక్కుమూడి వీడుతున్నట్లు కనిపిస్తోంది. నిమ్స్‌లో జరిగిన అనేక ఎపిసోడ్లకు బాధ్యుడిగా చెబుతున్న ఓ అధికారి.. తాను రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయినట్లు భావించాడేమో ఆ సూట్ కేసులు తనవేనంటూ పోలీసులకు వాంగ్మూలం ఇచ్చినట్లు సమాచారం. అయితే పటాకుల విషయంలో మళ్లీ పాత పాటే పాడినట్లు తెలిసింది.
కాగా, ఆ సూట్ కేసులు అక్కడ ఎందుకు దాచాల్సి వచ్చిందో….అవి ఖాళీ కేసులా…? అందులో ఏమైనా ఉన్నాయా…? సీసీ కెమెరాలు లేని వార్డులో ఎందుకు దాచాల్సి వచ్చిందనేది విచారణలో తేలాల్సి ఉంది. ఇప్పటికే ఆ అధికారి తప్పులను నిజాయితీపరులైన కొందరు వైద్యాధికారులపై మోపే ప్రయత్నాలు జరుపుతూనే….మరో వైపు పటాకుల కేసు తీవ్రమైంది కావడంతో దాని నుంచి కూడా తప్పించుకునేందుకు కొందరు అమాయకులపై నెట్టి వేసే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిసింది. వాస్తవానికి పటాకులు ఎనిమిది నెలలుగా అదే గదిలో ఉన్నట్లు సమాచారం.
ఎక్స్‌ప్లోజివ్ రూల్స్ 2008 ప్రకారం పటాకులను అక్రమంగా భద్రపర్చడం, ఆస్పత్రులు, పాఠశాలలు, పెట్రోలు బంకుల్లో వాటిని నిల్వ చేయడం తీవ్ర నేరంగా పరిగణిస్తారు. అగ్ని ప్రమాదం, పటాకులు, సూట్ కేసుల వ్యవహారంతో పాటు నిమ్స్‌లో ఇప్పటి వరకు జరిగిన, జరుగుతున్న పరిణామాలపై విజిలెన్స్ అధికారులు విచారణ చేపడుతున్నట్లు తెలిసింది. ఇటీవల దవాఖానను సందర్శించిన విజిలెన్స్ అధికారుల బృందం బాధ్యుడిగా భావిస్తున్న ఆ అధికారి పాత, కొత్త రికార్డులను వెలికి తీయడంతో పాటు అతని వ్యవహారంపై ఆరా తీస్తున్నట్లు సమాచారం.