ఖైరతాబాద్, నవంబర్ 22 : నిమ్స్ మరో మైలురాయిని అధిగమించింది. దవాఖాన చరిత్రలోనే మొదటిసారిగా అనేక దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న రోగికి విజయవంతంగా కోత లేకుండా వాల్ రిప్లేస్మెంట్ చేసి వైద్యులు రికార్డు సృష్టించారు. నగరానికి చెందిన 56 ఏండ్ల రోగి కొంత కాలంగా రక్తపోటు, మధుమేహం, దీర్ఘాకాలిక మూత్రపిండాల వ్యాధితో బాధపడుతూ నిమ్స్‌లో చేరాడు. అప్పటికే హీమో డయాలసీస్ చేసుకుంటున్న ఆ రోగికి కొత్త సమస్య వచ్చింది.
వైద్య పరిభాషలో మైట్రాల్ వాల్వ్ స్టీనియోసిస్గా పిలిచే ఈ వ్యాధికి చికిత్స అందించాలంటే అప్పటికే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న సదరు రోగికి ఓపెన్ హార్ట్ సర్జరీ చేస్తే అత్యంత ప్రమాదకరమని వైద్యులు గుర్తించారు. వివిధ పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు ఎలాంటి కోత లేకుండానే ఆధునిక విధానంలో చికిత్స అందించాలని నిర్ణయించారు. కార్డియాలజీ విభాగాధిపతి ప్రొఫెసర్ డాక్టర్ బి. శ్రీనివాస్, వైద్యులు డాక్టర్ మణికృష్ణ, డాక్టర్ అభినయ్‌రెడ్డి, డాక్టర్ కె. అనురాగ్ బృందం కాంప్లెక్స్ ట్రాన్స్క్యాథటర్ మైట్రా వాల్వ్ రీప్లేస్మెంట్ విధానంలో చికిత్స చేసి సమస్యను తీర్చింది. రోగి రెండు రోజుల్లోనే సాధారణ స్థితి వస్తారని, వైద్యుల సూచనలు పాటిస్తే సరిపోతుందని డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు.