సిటీబ్యూరో, జూన్ 6 (నమస్తే తెలంగాణ) : ‘నిమ్స్ హాస్పిటల్ ఎయిమ్స్‌కు ధీటుగా సేవలు అందిస్తున్నది. కానీ అది సరిపోదు. రాబోయే రోజుల్లో విదేశాల్లోని రోగులకు కూడా మెరుగైన వైద్యం అందించేలా అంతర్జాతీయ స్థాయి ఇనిస్టిట్యూట్‌గా చూడాలనేది నా కళ. ఆ దూర దృష్టితోనే పనిచేస్తున్నాను’ అని నిజాం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) డైరెక్టర్ డాక్టర్ బీరప్ప అన్నారు. నిమ్స్ డైరెక్టర్‌గా పూర్తి స్థాయి బాధ్యతలు చేపట్టి గురువారం నాటికి ఏడాది కాలం పూర్తవ్వడంతో ఆయన ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడారు.
నిమ్స్‌తో తనకు 33ఏళ్ల అనుబంధం ఉన్నదని, 1990లో సీనియర్ రెసిడెంట్‌గా జనరల్ సర్జరీ విభాగంలో చేరాను. అప్పటినుంచి అంచెలంచెలుగా ఎదిగి 2012లో సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజి విభాగాధిపతిగా పదోన్నతి పొంది, ఎన్నో అరుదైన శస్త్రచికిత్సలు చేశాను. 2023, జూన్ 6న నిమ్స్ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన తరువాత రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించడంపై ప్రత్యేక దృష్టి పెట్టాం.
ఓపీలో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశాం.
ఈఎండీ(అత్యవసర విభాగం)ని పునరుద్ధరించి, అత్యవసర చికిత్స కోసం వచ్చే రోగులకు నిరీక్షణ లేకుండా చర్యలు తీసుకున్నాం. ఓపీ కౌంటర్లలో రోగులు గంటల తరబడి నిరీక్షించే అవసరం లేకుండా ఓపీ రిజిస్ట్రేషన్ కౌంటర్ల సంఖ్య పెంచి, విభాగాల వారీగా రిజిస్ట్రేషన్ కౌంటర్లను ఏర్పాటు చేశాం. అంతే కాకుండా సీనియర్ సిటిజన్లు, ఈహెచ్ఎస్, జేహెచ్ఎస్, ఆరోగ్యశ్రీ, సింగరేణి కార్మికుల కోసం వేర్వేరుగా ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశాం.
దవాఖానలోని అన్ని విభాగాలలో అత్యాధునిక వైద్యపరికరాలను సమకూర్చడంతో పాటు వైద్యపరీక్షలకు సంబంధించిన రిపోర్టులను డిజిటలైజేషన్ చేశాం. దీని వల్ల మెడికల్ రిపోర్ట్స్ రోగుల సెల్ఫోన్లకే వస్తున్నాయి. దీంతో రోగులు నివేధికల కోసం మళ్లీ కౌంటర్ల వద్ద క్యూలైన్లలో నిల్చునే అవసరం తప్పింది. దవాఖాన ఆవరణలో ఒక బ్లాక్ నుంచి మరో బ్లాక్‌కు వెళ్లేందుకు రోగులు, వారి సహాయకుల కోసం ఉచిత బ్యాటరీ వాహనాలను అందుబాటులోకి తీసుకువచ్చాం.
దవాఖానలో గతంతో పోల్చితే శస్త్రచికిత్సలు 30శాతం పెరిగాయని, అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు సైతం 45శాతానికి పెంచాము. కొత్తగా అందుబాటులోకి వచ్చిన రోబోటిక్ సర్జరీలు ఏడాది లోపే 300వరకు చేశామని, గుండె సంబంధిత వ్యాధులతో బాధపడే చిన్నారుల ప్రాణాలు కాపాడేందుకు యూకే వైద్య బృందం సహకారంతో ప్రత్యేకంగా పిడియాట్రిక్ హార్ట్ సర్జరీ క్యాంప్‌ను నిర్వహిస్తున్నాం.