సిటీబ్యూరో, మే 30 (నమస్తే తెలంగాణ): “నైజీరియన్లను డిపోర్ట్ చేయడం చాలా ఇబ్బందిగా మారింది. వారు భారత్‌లోనే ప్రత్యేకంగా హైదరాబాద్‌లోనే ఉండడానికి కొత్తకొత్త మార్గాలు అన్వేషిస్తున్నారు. తమపై వ్యక్తిగత కేసులు పెట్టించుకుని వాటి ద్వారా ఆ కేసులు మూతబడేవరకు ఇక్కడే ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ఇది పోలీసులకు పెద్ద సవాల్‌లా మారింది. వారిని ఎలా బయటకు పంపాలో అర్ధం కావడం లేదు”
ఇది నగర సీపీ సీవీ ఆనంద్ బహిరంగంగా చేసిన వ్యాఖ్య. నగరంలో నైజీరియన్లు తిష్ట వేసి ఎక్కడకు పోకుండా చేస్తున్న దందాలకు చెక్ పెట్టేందుకు పోలీసులు ప్రయత్నించినా వారి పన్నాగాలతో ఇక్కడే ఉండిపోతున్నారని ఆనంద్ స్వయంగా చెప్పారు.
హైదరాబాద్‌లో ఎక్కడ డ్రగ్స్ ముఠాలు పట్టుబడినా వారి మూలాలు మాత్రం నైజీరియన్ల వద్దనే ఉంటున్నాయి. ఇటీవల కాలంలో సుమారు 50 మందికి పైగా నైజీరియన్లను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసి ఉంటారు. అయితే ఎండీపీఎస్ చట్టాల్లో ఉన్న లోపాల కారణంగా నిందితులకు సులువుగా బెయిల్ వస్తున్నది. దీంతో బయటకు వచ్చి మళ్లీ దందాలకు పాల్పడుతున్నారు. దీంతో వీరిని హైదరాబాద్‌లో ఉంచకుండా నైజీరియాకు డిపోర్ట్ చేయాలని పోలీసులు నిర్ణయించుకున్నా వారిపై అప్పటికే ఉన్న కేసుల కారణంగా సాధ్యపడడం లేదు. ఇప్పటివరకు పదిమందికి పైగా నైజీరియన్లను హైదరాబాద్ నుంచి పంపించేశారు. హైదరాబాద్నగరంలోని పలు ప్రాంతాల్లో నైజీరియన్లు నివసిస్తున్నారు. మెహదీపట్నం, లంగర్‌హౌజ్, సన్‌సిటీ, గచ్చిబౌలి ప్రాంతాల్లో వీరు ఎక్కువగా ఉంటున్నట్లు పోలీసులు తెలిపారు.
వీరిలో కొందరు అక్రమ మార్గంలో వచ్చిన వారు కూడా ఉన్నారు. అయితే వీరు ఇక్కడ ఎక్కువగా సైబర్ నేరాలతో పాటు డ్రగ్స్ దందా నిర్వహిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు వారిని నైజీరియాకు తిరిగి పంపించే ప్రయత్నాలు చేస్తున్నారు. వీసా గడువు ముగిసినా ఇక్కడే ఉండి డ్రగ్స్ అమ్ముతున్న వ్యక్తులు, నకిలీ పాస్‌పోర్టులతో వచ్చిన వారిని గుర్తించి పంపిస్తున్నామని అధికారులు చెబుతున్నా సిటీలో నైజీరియన్ల చైన్ కొనసాగుతూనే ఉంది. ప్రతీ డ్రగ్ అరెస్ట్‌లో మూలాలు మాత్రమే నైజీరియన్లవే ఉంటున్నాయనేది వాస్తవం.
హైదరాబాద్ నగరంలో దాదాపు 2500 మంది నైజీరియన్లు ఉండగా వారిలో 750 మందికి వీసా గడువు ముగిసినట్లు పోలీసులు గుర్తించారు. ఇటీవల కాలంలో కొకైన్, హెరాయిన్, ఎండీఎంఏ పిల్స్, గంజాయి తదితర మత్తు పదార్థాలను తరలిస్తూ నైజీరియన్లు పట్టుబడుతున్నారు. వీరిలో ఎక్కువమంది స్టూడెంట్ వీసాలపై ఉన్నట్లుగా పోలీసులు గమనించి వారిని తిరిగి నైజీరియాకు డిపోర్ట్ చేస్తేనే డ్రగ్స్ దందాకు కొంతమేరకు చెక్ పెట్టవచ్చని భావించారు.
అయితే వారిపై కేసులు నమోదు చేయకుండా వారి దేశాలకు అప్పగించేందుకు హైదరాబాద్ పోలీసులు నిర్ణయించి ఆ దిశగా పదిమంది వరకు నైజీరియన్లను డిపోర్టేషన్ చేశారు. ప్రధానంగా డిపోర్టేషన్ సమయంలో నైజీరియన్లను వారి దేశాలకు పంపడం పోలీసులకు తలనొప్పిగా మారింది. డిపోర్టేషన్ చేసే సమయంలో వారికి సంబంధించిన ఫ్లైట్ టికెట్లను కూడా హైదరాబాద్ పోలీసులే కొనుగోలు చేస్తున్నట్లు ఒక పోలీస్ అధికారి చెప్పారు. కొన్ని సందర్భాల్లో మూడు లక్షల నుంచి ఐదు లక్షల వరకు ఒక్కొక్క నైజీరియన్‌కు టికెట్ బుక్ చేసి పంపించిన సందర్భాలు ఉన్నట్లు ఆయన తెలిపారు.
తమను హైదరాబాద్ నుంచి డిపోర్ట్ చేయకుండా ఉండేందుకు నైజీరియన్లు కొత్త మార్గాలు ఎంచుకుంటున్నారు. హైదరాబాద్‌లోనే ఉండేలా కొత్తగా పెళ్లిళ్ల పేరుతో డ్రామా మొదలు పెట్టారు. లోకల్‌గా ఒక అమ్మాయిని వివాహం చేసుకుని వారితో కొన్నిరోజులు గడిపి ఆ తర్వాత ఆ అమ్మాయితో వేధింపుల కేసు పెట్టించుకుని జైలుకు వెళ్తున్నారు. తిరిగి బయటకు వచ్చి కేసులు నడుస్తుండడంతో ఇక్కడే ఉంటున్నారు. వారిపై కేసులు ఉండడంతో డిపొర్టేషన్ ప్రక్రియ చాలా ఇబ్బందిగా మారుతోంది.
ఇలా ఎనిమిది మందికి పైగా సిటీలో ఉంటున్నట్లు సమాచారం. వీరిపై 498 కేసులు ఉండడంతో ట్రయల్ పూర్తయి కేసు క్లోజ్ అయ్యే వరకు బయటకు పంపించే పరిస్థితి లేదు. నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (ఎన్డిపిఎస్)చట్టం ఉల్లంఘించే విదేశీయులను మన దేశం బహిష్కరించవచ్చు. దేశంలోకి చట్టవిరుద్దంగా ప్రవేశించడం, వీసా గడువు ముగిసినా ఇక్కడే ఉండి తీవ్రమైన నేరాలకు పాల్పడడం వంటివి చేస్తే బహిష్కరణ అస్ర్తాన్ని వాడవచ్చు. కానీ విదేశీయులపై హైదరాబాద్‌లో కేసులు నమోదైతే వారిని పంపించడం చాలా కష్టం ఇదే అదునుగా నైజీరియన్లు కొత్త మార్గాల్లో కేసుల్లో ఇరికి ఇక్కడే ఉంటున్నారు.