సిటీబ్యూరో, జూలై 28 (నమస్తే తెలంగాణ): బ్యాంకు ఖాతాల కమీషన్ ఏజెంట్ నుంచి.. అంతర్జాతీయ సైబర్నేరగాడిగా అహ్మదాబాద్‌కు చెందిన ప్రకాశ్ ప్రజాపతి ఎదిగినట్లు సీసీఎస్ సైబర్‌క్రైమ్ పోలీసులు గుర్తించారు. అతడి నెట్వర్క్ ద్వారానే ఉగ్ర లింక్‌ను గుర్తించేందుకు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ప్రయత్నిస్తున్నది. ఇందులో భాగంగా సీసీఎస్ సైబర్‌క్రైమ్ పోలీసుల నుంచి మరోసారి ఈ కేసుకు సంబంధించిన వివరాలను శుక్రవారం ఎన్ఐఏ అధికారులు సేకరించారు. ఒక డీఎస్పీ నేతృత్వంలోని బృందం సీసీఎస్ సైబర్‌క్రైమ్ పోలీసులను సంప్రదించింది. ప్రజాపతి నెట్‌వర్క్‌కు సంబంధించిన పూర్తి వివరాలను సేకరించారు. ఎవరీ ప్రజాపతి.. అతడి గత చరిత్ర ఏంటి.? అని ఎన్ఐఏ ఆరా తీస్తోంది. ఇదిలాఉండగా.. ఇటీవల పార్ట్‌టైం జాబ్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ కేసులో అరెస్టయిన 9 మంది నిందితులను 7 రోజుల పోలీసు కస్టడీకి న్యాయస్థానం అనుమతించింది. దీంతో ఈ కేసులో ప్రధాన నిందితుడైన ప్రకాశ్ ప్రజాపతి వెల్లడించే అంశాలు ఇటూ సైబర్‌క్రైమ్ పోలీసులకు, అటూ ఎన్ఐఏకు కీలకం కానున్నాయి.
ప్రకాశ్ ప్రజాపతి చైనా సైబర్‌నేరగాళ్లకు భారత దేశంలోని బ్యాంకు ఖాతాలు అప్పగిస్తుంటాడు. అతడికి దేశవ్యాప్తంగా కమీషన్ ఏజెంట్లు పనిచేస్తున్నారు. ఆయా ఖాతాల్లో డిపాజిట్ అయిన సొమ్మును క్రిప్టోగా మార్చి సైబర్‌నేరగాళ్లకు పంపిస్తున్నాడు. ప్రధానంగా పార్ట్‌టైం జాబ్ పేరుతో ఇన్వెస్ట్మెంట్ మోసాలకు పాల్పడుతున్న చైనా సైబర్ నేరగాళ్లు వాట్సాప్, టెలిగ్రామ్, సోషల్ మీడియా యాప్‌లను ఉపయోగిస్తున్నారు. సైబర్ నేరగాళ్లు ఈ వ్యవహారం మొత్తం దుబాయ్ నుంచే నడిపిస్తున్నారు. బాధితులు మాత్రం భారత్‌లోని బ్యాంకుల ఖాతాల్లోనే డబ్బు డిపాజిట్ చేస్తున్నారు. ఆయా బ్యాంకులకు సంబంధించిన ఖాతాలు, ఫోన్ నంబర్లన్నీ ప్రజాపతి కంట్రోల్లో ఉండగా.. అతడి ఫోన్లను సైబర్‌నేరగాళ్లు రిమోట్ యాప్‌ల సహాయంతో దుబాయ్ నుంచే ఆపరేట్ చేస్తున్నారు.