సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, జూన్ 22 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ నగరమంటే రియల్ సందడి. గల్లీ మొదలు కార్పొరేట్ కార్యాలయాల వరకు రియల్టర్లు.. మార్కెటింగ్ ఏజెంట్లతో పాటు సాధారణ యువకుడు సైతం రియల్ ఎస్టేట్ రంగాన్ని ఒక ఉపాధి మార్గంగా మలుచుకున్నాడు. కానీ గత కొన్ని నెలలుగా మహా నగరంలో ‘రియల్’ కళ తప్పింది. ముఖ్యంగా నిత్యం హడావిడిగా ఉండే శివారు ప్రాంతాల్లో ఆ సందడే కనిపించడం లేదు. ఇందుకు అనేక సామాజిక కారణాలు ఉన్నప్పటికీ… ప్రభుత్వపరంగా ఆశించిన సహకారం లేకపోవడం రియల్టర్లను ఆవేదనకు గురి చేస్తున్నది.
ఇందులో భాగంగా రియల్ ఎస్టేట్ వ్యాపారుల నుంచి వినిపిస్తున్న ప్రధాన కారణం… కొత్త వెంచర్లకు అవకాశం లేకపోవడం. సాధారణంగా నివాసయోగ్య (రెసిడెన్షియల్) జోన్లో ఉన్న భూముల్లో వెంచర్లకు అనుమతులు వచ్చే అవకాశం ఉన్నా.. నగర చుట్టూ అనేక ప్రాంతాల్లో ఇతర జోన్లలోని భూములను నివాసయోగ్య భూముల జాబితాలోకి మార్చేందుకు కావాల్సిన ‘భూ వినియోగ మార్పిడి (ఛేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్)’ అనుమతులు నిలిచిపోవడంతో రియల్ ఎస్టేట్ రంగాన్ని నీరుగార్చుతున్నదని పలువురు రియల్ వ్యాపారులు వాపోతున్నారు.
విశ్వ నగరంగా మారుతున్న హైదరాబాద్ తెలంగాణకు మాత్రమే కాదు.. దేశానికి సైతం ఒక ఆర్థిక ఇంజిన్. అంతర్జాతీయ మౌలిక వసతులు ఉన్న ఈ మహా నగరంలో విద్య, వ్యాపార, పారిశ్రామిక, ఐటీ వంటి రంగాలే కాదు.. రియల్ ఎస్టేట్ రంగం అనేది చాలా కీలకంగా మారింది. ఏటా లక్షల కోట్ల లావాదేవీలు జరిగే ఈ రంగంలో అదేరీతిలో ఉపాధి అవకాశాలు కూడా భారీగానే ఉన్నాయి. అందుకే తెలంగాణ ఏర్పడిన తర్వాత వచ్చిన మౌలిక వసతులతో దేశంలోని ఢిల్లీ, ముంబై, బెంగళూరు, కోల్కత్తా, చెన్నై వంటి మహా నగరాలను సైతం వెనక్కి నెట్టింది. ఆఫీస్ స్పేస్లోనైతే హైదరాబాద్ దేశంలోనే రారాజుగా నిలిచింది. అలాంటి మహా నగరంలో ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగం కళ తప్పింది.
లక్షల చదరపు అడుగుల్లో అపార్టుమెంట్లు కొనుగోలుకు సిద్ధంగా ఉన్నా.. గతంలోని దూకుడు కనిపించక బిల్డర్లు ఆవేదన చెందుతున్నారు. ఈ క్రమంలో శివారు ప్రాంతాల్లోనైనా కొత్త కొత్త వెంచర్ల ద్వారా కొంత ఊపు వచ్చే అవకాశమున్నా.. పలు కారణాలు కొత్త ప్రాజెక్టులకు మోకాలడ్డుతున్నాయి. ఇప్పటికే నగరానికి వంద కిలోమీటర్ల పరిధిలోని భూములు అత్యధికం దాదాపు వెంచర్లుగా మారాయి. ఇందులో సింహభాగం గతంలో జరిగినవి కాగా.. నివాసయోగ్య జోన్లో ఉన్న వాటిని హెచ్ఎండీఏ అనుమతులతో వెంచర్లుగా మారుస్తున్నారు. కానీ నివాసేతర జోన్‌లోని భూముల్లో వెంచర్లు చేయడం ఇప్పుడు వ్యాపారులకు ఒక సవాల్‌గా మారింది.
సాధారణంగా గతంలో హెచ్ఎండీఏ రూపొందించిన మాస్టర్‌ప్లాన్-2031 ప్రకారం భూమిని పన్నెండు రకాల జోన్లుగా విభజించారు. నివాసం, వ్యవసాయం, వినోదం, పారిశ్రామికం, అటవీ… ఇలా పన్నెండు జోన్లలోని సబ్ జోన్లు కలుపుకొని సుమారు 21-24 రకాలుగా విభజన జరిగింది. ఇందులో నివాసయోగ్య జాబితాలో ఉన్న భూముల్లో మాత్రమే వెంచర్లకు అవకాశం ఉంటుంది. మిగిలిన జోన్లలోని భూములను నివాసయోగ్యంలోకి మార్చుకొని (భూ వినియోగ మార్పిడి) ఆ తర్వాత వెంచర్లు చేపట్టాల్సి ఉంటుంది.
ఈ క్రమంలో బయో కన్జర్వేషన్ మినహా దాదాపుగా మిగిలిన జోన్లలోని భూములను నివాసయోగ్యంలోకి మార్చుకునే వీలుంది. ఇందుకోసం సదరు యజమానులు భూ వినియోగ మార్పిడి కింద దరఖాస్తు చేసుకోవాలి. అధికారులు నిబంధనల ప్రకారం వాటిని పరిశీలించి.. నిర్దేశిత రుసుముతో ప్రభుత్వానికి ప్రతిపాదిస్తే అనంతరం ప్రభుత్వం పరిశీలించి ఉత్తర్వులు జారీ చేస్తుంది. అయితే నగరం చుట్టూ నివాసయోగ్య భూములు కాకుండా ఇతర జోన్లలో వేలాది ఎకరాల భూములు ఉన్నాయి. వాటిని వెంచర్లుగా చేసేందుకు అవకాశం ఉన్నా… గత ఆరునెలలుగా భూ వినియోగ మార్పిడి అనుమతులు లేకపోవడంతో కొత్త ప్రాజెక్టులకు అంకురార్పణ జరగడం లేదు.
గతంలోని దరఖాస్తులు చాలా పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో అటు కొత్త వెంచర్లు రాకపోవడం ఒకవంతైతే… ప్రభుత్వ ఖజానాకు కూడా వందలాది కోట్ల ఆదాయం నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పటికైనా భూ వినియోగ మార్పిడి ప్రక్రియకు అనుమతులు ఇవ్వాలని చాలామంది రియల్టర్లు కోరుతున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ ప్రభుత్వం కొలువుదీరిన నేపథ్యంలో అమరావతి రాజధాని అభివృద్ధి అనేది కూడా హైదరాబాద్ రియల్ రంగంపై ప్రభావం చూపే అవకాశమున్నదని పలువురు రియల్టర్లు స్పష్టం చేస్తున్నారు.
అనుమతులు వచ్చిన తర్వాత ప్రాజెక్టు పట్టాలెక్కేందుకు కనీసం ఆరునెలల సమయం పడుతుందని, ఈ క్రమంలో ఇక్కడ కొత్త వెంచర్లకు అవకాశం లేనందున రియల్టర్లు అటు వైపు చూసే అవకాశమూ లేకపోలేదని ఒక రియల్టర్ అభిప్రాయపడ్డారు. వ్యాపారులకు టర్నోవర్ అనేది ప్రధానమని, అందుకే నెలల తరబడి ఖాళీగా ఉండటం కంటే అవకాశం ఉన్నచోటకు వెళ్లడం శ్రేయస్కరమనే కోణంలో ఆలోచించక తప్పదని వ్యాఖ్యానించారు.