సిటీబ్యూరో, జూన్ 27(నమస్తే తెలంగాణ): విదేశీసంస్థల్లో చదువుకోవాలనే ఆశ, ఉద్యోగాల వేటలో అభ్యర్థుల అవకాశాలను ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు నయాదందాకు పాల్పడుతున్నారు. దేశ, విదేశాల్లోని విద్యా సంస్థల పేరిట నకిలీ వెబ్సైట్లు రూపొందించి అడ్మిషన్లు, లోన్ల పేరుతో వల విసురుతున్నారు. దేశంలోని ప్రధాన నగరాల్లోని కోచింగ్ కేంద్రాల పేరుతో ప్రకటనలిచ్చి ఆన్లైన్లో మెటీరియల్, కోచింగ్ అంటూ ఫేస్బుక్, వాట్సాప్, టెలిగ్రామ్ , ఇన్‌స్టా వేదికలుగా ప్రకటనలిచ్చి మోసాలకు పాల్పడుతున్నారు. వారం రోజుల వ్యవధిలోనే హైదరాబాద్‌లో పలు చోట్ల ఈ తరహా కేసులు 10కి పైగా నమోదయ్యాయి.
అభ్యర్థుల డేటా సేకరించి..!
నగరంలో విద్యార్థులు, ఉద్యోగార్థులను లక్ష్యంగా చేసుకొని సైబర్‌నేరగాళ్లు పెద్ద ఎత్తున మోసాలకు పాల్పడుతున్నారు. సైబర్ నేరగాళ్లు మొదట ప్రముఖ విద్యాసంస్థల్లోని విద్యార్థులు, కోచింగ్ సెంటర్లలో శిక్షణ పొందుతున్న అభ్యర్థు ల డేటా సేకరిస్తున్నారు. వారి మెయిల్, వాట్సాప్ నంబర్లకు ఫేక్ యూనివర్సిటీల లింకులు పంపి మోసం చేస్తున్నారు. అ డ్మిషన్ ఫీజులంటూ రూ.10-20 వేలు, సీటు కేటాయించాలంటే మరికొంత సొమ్ము కావాలంటూ వసూలు చేస్తారు. అదే సమయంలో తమకు సీటు వచ్చిందన్న ఆనందంలో ఉన్న విద్యార్థులు, తల్లిదండ్రుల పూర్తి వివరాలను సేకరించి వారి పేరిట బ్యాంకులకు లోన్కోసం దరఖాస్తు చేస్తారు.
ఆన్లైన్ బ్యాకింగ్ తమ ఆధీనంలోకి తీసుకుని ఎడ్యుకేషన్ లోన్ మంజూరు కాగానే మాయగాళ్లు విత్ డ్రా చేసుకుంటున్నారు.
నకిలీ వెబ్సైట్లతో గాలం..!
ఇటీవల కర్ణాటకకు సంబంధించిన ఒక యూనివర్సిటీ తమ అడ్మిషన్ల సమయంలో ఫేక్ సైట్ రూపొందించారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా దేశంలోని కొన్ని ప్రధాన యూనివర్సిటీలు కూడా స్థానిక పోలీసులకు ఈ తరహా ఫిర్యాదులు ఇచ్చినట్లు తెలిసింది. సైబర్ నేరగాళ్లు దేశ, విదేశాల్లోని ప్రము ఖ వర్సిటీల పేర్లతో అసలు దానిలా నకిలీ వెబ్సైట్లు రూపొందించి.. అడ్మిషన్లు, లోన్లు, స్కాలర్‌షిప్‌ల వివరాలు తెలిన వేర్వేరు ఫోన్ నంబర్లు ఇస్తారు. ఇదే సమయంలో ఫేస్బుక్, ఇన్‌స్టా, టెలిగ్రామ్ యాప్స్‌లో ప్రకటనలు ఇచ్చి విద్యార్థుల కు నమ్మకం కలిగించేలా వ్యవహరిస్తా రు.
ఇక మెరిట్ స్కాలర్షిప్లు సొంతం చేసుకునేందుకు ఆన్లైన్ పరీక్ష నిర్వహించడంతో పాటు వారికి లోన్లు కావాలంటే ఇప్పిస్తామంటూ నమ్మిస్తున్నారు. విద్యార్థులను నమ్మించడానికి సైబర్ నేరగాళ్లు ప్రముఖ విద్యాలయాల పేరిట నకిలీ వెబ్సైట్లు క్రియేట్ చేసి మోసం చేస్తున్న కేసులు ఈ మధ్యకాలంలో ఎక్కువగా వస్తున్నాయని సైబర్ పోలీసులు తెలిపారు. అయితే వెబ్సైట్ అసలుదా, నకిలీదా తేల్చుకునేందుకు అక్రిడిటేషన్, కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్, స్టూడెంట్ రివ్యూస్‌తో పాటు వీటన్నిటి కంటే ముందుగా డబ్బులు కట్టాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించాలని సూచించారు.
– హైదరాబాద్‌కు చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగి తన కుమారుడిని ఇంగ్లాండ్ పంపేందుకు ప్రయత్నాలు చేశారు. తనకు తెలిసిన కన్సల్టెన్సీలను సంప్రదించాడు. ఈలోగా ఒక వ్యక్తి బాధితుడిని సంప్రదించి అతని కుమారుడిని తమ యూనివర్సిటీలో చేర్చాలని అందుకు తగినట్లుగా ఫార్మాలిటీస్ పూర్తిచేయాలని సూచించారు. ఈ క్రమంలో దరఖాస్తుతో మొదలుపెట్టి ఇతర ఫార్మాలిటీస్ మొత్తం పూర్తిచేసే క్రమంలో అతను రూ.2 లక్షలు పోగొట్టుకున్నారు.
– సికింద్రాబాద్‌కు చెందిన ఓ యువకుడు బీటెక్ పూర్తి చేసి ఎంఎస్ చేసేందుకు అమెరికా వెళ్లాలనుకున్నారు. ఇందుకోసం ఇంటర్ అక్కడి విశ్వవిద్యాలయాలు, ఎడ్యుకేషన్ లోన్ పొందేందుకు ఉన్న మార్గాల కోసం వెతికాడు. మరుసటి రోజు అతడి వాట్సప్ నంబర్‌కు ఒక కన్సల్టెన్సీ నుంచి మెసేజ్ వచ్చింది. తమ కన్సల్టెన్సీ ద్వారా లోన్ ఇప్పిస్తామంటూ వివరాలు తీసుకుని వివిధ ఛార్జీల పేరుతో రూ.లక్షన్నర వరకు వసూలు చేశారు. ఆ తరవాత వారు స్పం దించకపోవడంతో ఆ యువకుడు సైబర్ పోలీసులను ఆశ్రయించాడు.
– నగరానికి చెందిన ఒక యువతి స్థానికంగా ఒక అకాడెమీలో సివిల్స్ శిక్షణ తీసుకుంటున్నారు. ఢిల్లీలోని ప్రముఖ కోచింగ్ సెంటర్లు యూపీఎస్సీకి సిద్ధమవుతున్న వారికి రాయితీపై మెటీరియల్ ఇస్తాయనే ప్రకటన చూసిన యువతి వారిని సంప్రదించింది. ఆపై వారు ఇచ్చిన యూపీఐ నంబర్‌కు రూ.10 వేలు పంపారు. కొంత సమయానికి ఓ యువకుడు ఫోన్ చేసి పార్సిల్ చేసి కొరియర్లో పంపేందుకు రూ.5 వేలు బ్యాంకు ఖాతాలో జమ చేయించుకోవాలన్నారు. ఆ తర్వాత వా రి నుంచి స్పందన లేకపోవడంతో ఢిల్లీ సెంటర్‌పై వాకబు చేయగా అసలు వారు ప్రకటనే ఇవ్వలేదని, అది ఫేక్ అని తేలింది.