సిటీబ్యూరో, ఫిబ్రవరి 4 (నమస్తే తెలంగాణ): విద్యుత్ కనెక్షన్ల జారీలో కొత్త మార్గదర్శకాలను విడుదల చేస్తూ తెలంగాణ ప్రభుత్వం గెజిట్ జారీ చేసింది. ఈమేరకు జనవరి 19నుంచి గెజిట్ నిబంధనలు అమలులోకి వస్తాయని పేర్కొంది. స్తంభాలు, లైన్ల కోసం దూరాన్ని బట్టి వినియోగదారుల నుంచి గతంలో ఒక్కోరీతిలో డబ్బులు వసూలు చేసేవారు. కానీ ఇక నుంచి ఫిక్స్డ్ చార్జీలు వసూలు చేయాలని నిర్ణయించారు. ఒక కిలోవాట్‌కు రూ.500, ఒక కిలోవాట్ నుంచి ఐదు కిలోవాట్లకు రూ.500తో పాటు కిలో వాట్‌కు రూ.600చొప్పున, ఐదు నుంచి 20 కిలోవాట్లకు రూ. 2900ల మినీమమ్ చార్జీతో పాటు మిగతాకిలోవాట్కు రూ.1500 చొప్పున చెల్లించాలని, 20 కిలోవాట్లపై ప్రతీ కిలోవాట్‌కు రూ.10వేల చొప్పున చెల్లించాలంటూ నిర్ణీత రుసుము నిర్ణయిస్తూ తెలంగాణ ప్రభుత్వం గెజిట్ జారీ చేసింది.
కొత్తగా కనెక్షన్ కావాలనుకునే వారు ఇకపై డాక్యుమెంట్స్‌ను నేరుగా ఆయా డిస్కంల వెబ్సైట్లలో అప్లోడ్ చేసి తమకు కావలసిన కనెక్షన్‌ను లోడ్‌ను బట్టి రుసుము చెల్లించి తీసుకోవచ్చని అధికారులు తెలిపారు. అయితే ఈ కనెక్షన్లను నిర్ణీత గడువులోగా పూర్తిచేసి వినియోగదారుడికి ఇబ్బందికలగకుండా చూడాలంటూ గెజిట్‌లో ప్రచురించారు. ఈ మేరకు గృహకనెక్షన్లు ఏడురోజుల్లోగా, మిగతావి 15 నుంచి నెలరోజుల్లోగా, కొండప్రాంతాల్లో 90 రోజుల్లోగా పూర్తిచేయాలని ఆదేశించింది. అయితే మెటీరియల్‌తో సహా ఇప్పుడు వినియోగదారుడికి తాను చెల్లించిన నిర్ణీత డబ్బుల్లో మొత్తం కనెక్షన్ ఇవ్వాలి. అయితే గత కొన్ని నెలలుగా మెటీరియల్ లేకపోవడంతో డిస్కం అధికారులు చాలా కనెక్షన్లను ఎస్టిమేషన్లు వేసి డబ్బులు తీసుకుని పెండింగ్‌లో పెట్టారు.
ఈనెల 3వ తేదీనుంచి కొత్త కనెక్షన్లు ఇవ్వడం ఆపేశామని, గెజిట్ వచ్చిన తర్వాతే అందులో పేర్కొన్న నిబంధనలను బట్టి కొత్త కనెక్షన్లు ఇవ్వాలంటూ డిస్కం ఉన్నతాధికారుల సూచన మేరకు కనెక్షన్లు నిలిపివేశామని విద్యుత్ అధికారులు తెలిపారు. ప్రస్తుతం గెజిట్ వచ్చిన తర్వాత ఎల్టీ వినియోగదారులు తమకు కొత్త కనెక్షన్లు కావాలని దరఖాస్తు చేసుకోవడానికి ఒకట్రెండురోజులోల సమయం పట్టే అవకాశముందని వారు పేర్కొన్నారు.
జనవరి 19 న గెజిట్ ప్రచురణ జరిగిన నేపథ్యంలో అందులో పేర్కొన్నట్లుగా గెజిట్ ప్రచురించిన నాటినుంచి ఈ నిబంధనలు వర్తిస్తాయని డిస్కం ఉన్నతాధికారులు పేర్కొన్నారు. ఈ కారణంగా జనవరి 19 తర్వాత దరఖాస్తు చేసిన వారికి ప్రస్తుతం కొత్తగా అమల్లోకి వచ్చిన కనెక్షన్ల చార్జిలే వర్తిస్తాయని , ఒకవేళ వినియోగదారుడు జనవరి 19 తర్వాత ఎస్టిమేటెడ్ చార్జీలు చెల్లించి ఉండి ఇప్పటికీ కనెక్షన్ రాకపోతే వారికి కూడా కొత్త నిబంధనలు వర్తించే అవకాశముందని, అయితే ఈ విషయంలో కంపెనీ పరంగా ఒక నిర్ణయం తీసుకోవలసి ఉంటుందని వారు పేర్కొన్నారు.
ఒకవేళ వారికి కూడా కొత్త నిబంధనలు వర్తిస్తే కొత్త చార్జిల ప్రకారం వారికి కనెక్షన్ ఇచ్చి ఏవైనా సర్దుబాట్లు ఉంటే బిల్లింగ్‌లో చూస్తామని చెప్పారు. విద్యుత్ కనెక్షన్ల చార్జిల విషయంలో సీఎండీ ముషారఫ్ నుంచి వచ్చే ఆదేశాల మేరకు కట్ఆఫ్ తేదీ తర్వాత వచ్చిన కనెక్షన్లకు సంబంధించిన దరఖాస్తులను పరిశీలించి ఏఈ స్థాయిలో క్షేత్రస్థాయిలో వెరిఫై చేసి కనెక్షన్లను మంజూరు చేస్తామని సర్కిళ్ల అధికారులు తెలిపారు.
డిస్కం స్టోర్స్‌లో మెటీరియల్ కరువు కొట్టొచ్చినట్లుగా కనిపిస్తున్నది. కొత్త నిబంధనల ప్రకారం డిస్కం సిబ్బంది నేరుగా మెటీరియల్‌తో సహా ఇప్పుడు వినియోగదారుడికి తాను చెల్లించిన నిర్ణీత డబ్బుల్లో మొత్తం కనెక్షన్ ఇవ్వాలి. అయితే కొన్ని నెలలుగా సామగ్రి లేకపోవడంతో అధికారులు చాలా కనెక్షన్లను అంచనాలు వేసి డబ్బులు తీసుకుని పెండింగ్‌లో పెట్టడం గమనార్హం. తాజా నిబంధనల నేపథ్యంలో నిర్ణీత గడువులోగా కనెక్షన్లు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది.
ఇప్పుడేం చేయాలా అనే కోణంలో విద్యుత్ అధికారుల మధ్య చర్చ జరుగుతోంది. స్టోర్స్‌లో మెటీరియల్ లేకుండా పోవడంతో చాలాచోట్ల కాంట్రాక్టర్లు ధర్నాలకు దిగారు. అయితే చిన్నచిన్న సామగ్రి లేకపోయినా భూతద్దంలో చూపిస్తున్నారంటూ డిస్కం యాజమాన్యం అందరిపై కస్సుబుస్సులాడినా క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే 4వేల రకాల సామాగ్రి ఉండాల్సిన చోట అన్నీ ఉన్నట్లుగా చూపిస్తూనే కావల్సిన మోతాదులో లేకుండా కరువు సృష్టించి కనెక్షన్లను ఆలస్యం చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు ఇందులో కమీషన్ల గొడవ కూడా చాలావరకు ఉన్నట్లుగా సిబ్బందే చర్చించుకుంటున్నారు. ట్రాన్స్ఫార్మర్ల విషయంలో ఈ కమీషన్ల వ్యవహారం బహిరంగంగానే చర్చించుకుంటున్నారు.
మరి ఇప్పుడు వచ్చిన నిబంధనల ప్రకారం సర్కిల్స్‌లో కొత్తగా కనెక్షన్లకు దరఖాస్తు చేసుకునే వారికి స్టోర్స్ ద్వారా మెటీరియల్ ఎలా ఇస్తారో చూడాలంటూ విద్యుత్ అధికారులే మింట్ కాంపౌండ్‌లో గుసగుసలాడుకుంటున్నారు. గెజిట్ విడుదలైన తర్వాత వినియోగదారుల్లో అవగాహన పెరుగుతుందని, దీంతో క్షేత్రస్థాయి సిబ్బందిని దరఖాస్తు చేసుకున్న వారు ప్రశ్నించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, స్టోర్స్‌లో మెటీరియల్ అందుబాటులో లేకపోతే సమాధానం చెప్పలేని పరిస్థితి ఉంటుందని వారు చర్చించుకున్నారు.
గ్రేటర్ హైదరాబాద్‌లో ప్రస్తుతం ఉన్న పదిసర్కిళ్లలో 65.06 విద్యుత్ కనెక్షన్లు ఉన్నట్లుగా అధికారులు ప్రకటించారు. గత నవంబర్ వరకు వచ్చిన అధికారిక లెక్కల ప్రకారం గ్రేటర్లో కేటగిరీ 1లో 53.47లక్షలు, కేటగిరీ 7లో 8.83 లక్షలు, కేటగిరీ 3లో 36వేలు, ఏజీఎల్ కనెక్షన్లు 1.53లక్షలు, మిగతావి 86వేల కనెక్షన్లు ఉన్నాయని వారు తెలిపారు.
ఒక్క నవంబర్ నెలలో కేవలం 17,806 కనెక్షన్లు ఇచ్చారు. అయితే ఇందులో 13500 కనెక్షన్లు డొమెస్టిక్ ఉండగా, 3600 కమర్షియల్ కనెక్షన్లు ఉన్నాయని, గత సంవత్సరాలతో పోలిస్తే కనెక్షన్లు తగ్గిపోయినట్లుగా ఓ సీనియర్ అధికారి ఆఫ్ ది రికార్డుగా తెలిపారు. ఇందుకు కేవలం ఓ కీలక అధికారి తీసుకొస్తున్న కొత్త కొత్త నిబంధనలే కారణమని, డిస్కంలో కొత్త కనెక్షన్ల కోసం పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులు వేల సంఖ్యలో ఉన్నాయని, వాటిని పరిశీలించి క్షేత్రస్థాయిలో కనెక్షన్లు ఇవ్వడంలో ఏదో ఒక లోపం చూపించడం వల్ల చాలా దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్లుగా ఆ అధికారి పేర్కొన్నారు.