Tragedy | రాజు, ఐశ్వర్య ఒకరినొకరు ప్రేమించుకున్నారు.. వీరిద్దరూ గత నెలలో పెద్దలను ఎదురించి మరీ పెండ్లి చేసుకున్నారు. రాజేంద్రనగర్‌లోని జన చైత్యన ఫేజ్ టూలో నివాసం ఉంటున్నారు. అయితే ఐశ్వర్యకు హఠాత్తుగా ఫిట్స్ రావడంతో కుప్పకూలిపోయి ప్రాణాలు విడిచింది.
నవ దంపతులిద్దరూ అత్తవారింటికి వెళ్లి నిన్న రాత్రి తమ వారి నివాసానికి తిరిగొచ్చారు. అయితే ఇంతలోనే ఐశ్వర్య ఫిట్స్‌తో కిందపడిపోయింది. అప్రమత్తమైన రాజు వెంటనే ఐశ్వర్యను ఆస్పత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఐశ్వర్య అప్పటికే మృతి చెందిందని డాక్టర్లు నిర్దారించారు. తమ బిడ్డను పొట్టన బెట్టుకున్నాడు అంటూ అల్లుడు రాజుపై నవ వధువు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
అల్లుడు రాజే తమ కూతురిని చంపాడంటూ ఐశ్వర్య తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నాగర్‌కర్నూల్ జిల్లాకు చెందిన రాజు మహబూబ్ నగర్‌కు చెందిన ఐశ్వర్యను గత నెలలో పెళ్లి చేసుకున్నాడు.