డిగ్రీలో కోర్సుల్లో చేరాలంటే గతంలో ఒక విద్యార్థి మూడు, నాలుగు కాలేజీలకు తిరిగి దరఖాస్తు చేసుకోవడం.. కాలేజీలకెళ్లడం, దరఖాస్తులు కొనుగోలుచేయడం, జిరాక్స్ కాపీలను జతపర్చడం జరిగేది. మొదటి లిస్ట్, రెండు, మూడు లిస్ట్ తర్వాత స్పాట్ సెలెక్షన్స్.. ఇలా ప్రతి సారి కాలేజీకి వెళ్లాల్సి వచ్చేది. ఇలాంటి తిప్పలకు చెక్‌పెడుతూ వన్ స్టాప్ సొల్యూషన్స్ చూపిస్తోంది డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) ప్లాట్ ఫాం. రాష్ట్రంలోని అన్ని వర్సిటీలు, అన్ని డిగ్రీ కాలేజీల్లో డిగ్రీ ప్రవేశాల కోసం ఏర్పాటు చేసిన ఆన్లైన్ వ్యవస్థ ఇది. ఒకే ఒక్క బటన్‌తో ఇంట్లో నుంచే దరఖాస్తు చేసుకోవడం, సీట్లు పొందడం దోస్త్ ప్రత్యేకత. అన్నింటిని ఒకే గొడుగుకిందికి తీసుకొచ్చి రాష్ట్రంలోని ఎక్కడి విద్యార్థి అయినా ఎక్కడైనా చదువుకునే అద్భుత అవకాశాన్ని దోస్త్ కల్పించింది. విప్లవాత్మక మార్పుగా ప్రవేశపెట్టిన దోస్త్ 2026 ప్రవేశాల కొనసాగుతున్నాయి.
డిగ్రీ ఫస్టియర్‌లో ఇప్పటి వరకు 91వేల సీట్లు నిండాయి. మొదటి విడతలో 39,101 సీట్లు భర్తీ కాగా, రెండో విడతలో 52వేల సీట్లు నిండాయి. ఇదిలా ఉండగా దోస్త్ మూడో విడత రిజిస్ట్రేషన్ నడుస్తున్నది. విద్యార్థులు రూ. 400 ఫీజు చెల్లించి జూన్ 15 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. జూన్ 16 వరకు వెబ్ ఆప్షన్లు ఎంచుకోవాల్సి ఉంటుంది. 20న సీట్లను కేటాయిస్తారు. మూడో విడత కౌన్సెలింగ్ పూర్తయిన తర్వాత విద్యార్థులు జూన్ 20 నుంచి 27 వరకు సీట్లు వచ్చిన కాలేజీల్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.
రాష్ట్రంలో డిగ్రీ కోర్సులకు డిమాండ్ పెంచేందుకు సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. డిగ్రీ సిలబస్‌లో సమూల మార్పులు చేసింది. కొత్త పాఠ్యాంశాలను చేర్చింది. ఐఐటీ హైదరాబాద్, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, సీసీఎంబీ, ఎన్ఐఎన్, ఐఎస్బీ, ఇప్లూ , సీఐఐ వంటి సంస్థల సహకారంతో సిలబస్‌లో కీలక మార్పులు చేశారు. 2026 -27 విద్యాసంవత్సరంలో కొత్తగా 11 అప్రెంటీస్‌షిప్ డిగ్రీ కోర్సులను ప్రవేశపెట్టింది. ప్రత్యేకంగా 94 న్యాక్ గుర్తింపు పొందిన ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో ఈ కోర్సులను ప్రవేశపెట్టింది. మూడేండ్ల కోర్సులో ఏడాది పాటు పరిశ్రమలోనే పనిచేయాల్సి ఉంటుంది.
కొత్తగా చేర్చిన సబ్జెక్టులివే..