గ్రేటర్‌వాసులు భారీ వరదల్లో చిక్కుకుని అల్లాడుతుంటే.. కాంగ్రెస్ ప్రభుత్వానికి చీమ కుట్టినైట్లెనా లేదు. మహానగరం జల దిగ్బంధంలో చిక్కుకుని వణికిపోతుంటే.. ముఖ్యమంత్రి, మంత్రులు మాత్రం ఢిల్లీ పర్యటనలో విహరిస్తున్నారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ మంత్రిగా ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీలో ఉండి ప్రకటనలు చేస్తున్నారు. బల్దియా, హైడ్రా అధికారులు ముందస్తు, సహాయక చర్యలు చేపట్టకుండా ఫొటోలకు ఫోజులిస్తూ కాలయాపన చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ సహాయ చర్యలను ముందుండి నడిపించాల్సిన జిల్లా కలెక్టర్, మేయర్ ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు. వెరసి.. విశ్వ నగరంలోని ప్రజలు వరద నీటిలో చిక్కుకుని విలవిలలాడుతున్నారు. ఎటు నుంచి ఏ ముప్పు ముంచుకొస్తుందోనని ప్రాణాలు అరచేతిలో పట్టుకుని కాలం వెళ్లదీస్తున్నారు. రోడ్డుపైకి వస్తే ఇంటికి వెళ్లడానికి ఎన్ని గంటలు పడుతుందోనని భయపడుతున్నారు. వరద నియంత్రణ, ట్రాఫిక్ నిర్వహణ చేపట్టాల్సిన ప్రభుత్వ యంత్రాంగాలన్నీ సమన్వయ లోపంతో విఫలమై ప్రజలను అవస్థలకు గురిచేస్తున్నాయి. విశ్వ నగరంలోని ఏ కాలనీ చూసినా.. ఏ ప్రధాన రహదారి చూసినా.. ఏ జంక్షన్ చూసినా వరద నీటిలో కూరుకుపోతున్నాయని సోషల్‌మీడియా వేదికగా నెటిజన్లు మండిపడుతున్నారు.
-సిటీబ్యూరో, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ)
భారీ వర్షాలు, వరదలతో నగర ప్రజలు అల్లాడుతుంటే మేయర్ వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్నారా? అంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేట్ కార్యక్రమాలకు హాజరయ్యే మేయర్ గద్వాల విజయ.. ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ఎక్కడున్నారని ప్రశ్నిస్తున్నారు. వర్షాలు కురుస్తున్నా వరద నియంత్రణ చర్యలు తీసుకోవడంలో ఎందుకు అలసత్వం వహిస్తున్నారని మండిపడుతున్నారు. మేయర్ విజయలక్ష్మి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. నగర ప్రజలకు రక్షణ, వరదల నుంచి రక్షణ కల్పించలేని మేయర్ తక్షణమే దిగిపోవాలని పోస్టులు పెడుతున్నారు. వరద నీటి కట్టడి, కాలనీల్లో పరిస్థితులపై కనీసం సమీక్షలు చేయడం లేదని ఎక్స్ వేదికగా నిలదీస్తున్నారు. కొంతమంది నెటిజన్లు మేయర్ మిస్సింగ్ అంటూ పోస్టులు చేస్తున్నారు. అసలు హైదరాబాద్‌కు మేయర్ ఉన్నారా? అంటూ సెటైర్లు వేస్తున్నారు.
భారీ వర్షాలతో హైదరాబాద్ నగరం అతలాకుతలం అవుతుంటే మున్సిపల్ మినిస్టర్‌గా ఉన్న రేవంత్‌రెడ్డి మాత్రం ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. పురపాలక మంత్రిగా రెండేండ్ల నుంచి వర్షాలపై ముందస్తు చర్యలు తీసుకోవడానికి ఒక్క సమీక్ష కూడా నిర్వహించలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పురపాలక మంత్రిగా పనిచేసిన కేటీఆర్ పనితీరు, చిత్తశుద్ధిని చూసైనా సీఎం రేవంత్‌రెడ్డి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. గత ప్రభుత్వంలో వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అనేకసార్లు ముందస్తు సమీక్షలు నిర్వహించారు. అధికారులను అప్రమత్తం చేసి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. 2017 మే 13, 2018 మే 4, 2020 మే 19, 2021 జూన్ 24న నాటి పురపాలక మంత్రి కేటీఆర్ మాన్సూన్ రివ్యూ మీటింగ్‌లు నిర్వహించి నిర్వహణ బాధ్యతలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో పురపాలక మంత్రిగా ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి మాత్రం ఒక్క రివ్యూ కూడా చేయలేదని కార్పొరేషన్ మాజీ చైర్మన్ క్రిషాంక్ ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ హయాంలో కేటీఆర్ నిర్వహించిన రివ్యూ మీటింగ్‌ల ఫొటోలను పంచుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్‌రెడ్డిపై సోషల్ మీడియాలో గురువారం నుంచి నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. దీంతో జరగాల్సిన నష్టం జరిగిపోయాక నేడు సీఎం అధికారులతో సమీక్ష చేశారు.