ఓఆర్ఆర్ పరిధిలోని జీహెచ్ఎంసీలో 150 డివిజన్లు, సీఎంసీలో 76, ఎంఎంసీలో 74 డివిజన్లు ఉన్నాయి. ఒక్కో డివిజన్‌కు వర్షాకాల అత్యవసర బృందం (మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్) నియమించాలని నిర్ణయం తీసుకున్నప్పటికీ వాటిని అమలులోకి తీసుకురాలేదు. సుమారు 300 ఎంఈటీ బృందాలు రహదారుల పక్కన పేరుకుపోయిన చెత్తను, నాలాల్లోని వ్యర్థాలు, పూడిక మట్టి, కంకర, రాళ్లు, ఇసుకను తొలగించాల్సి ఉండగా వారిని ఏర్పాటు చేయడంలోనే ఆలస్యమైంది. నీటిని దారి మళ్లించే చర్యలు చేపట్టేందుకు 3 కార్పొరేషన్లు కలిపి 889 స్టాటిక్ సర్వైలెన్స్ బృందాలను నియమించుకున్నాయి. హైడ్రా ఆధ్వర్యంలో 51 డీఆర్ఎఫ్ బృందాలు 24 గంటల పాటు అందుబాటులో ఉంటామని చెప్పారు.
విపత్తుల్లో కాపాడేందుకు ఈసారి 1450 మంది ఆపదమిత్ర వలంటీర్లను సిద్ధంగా ఉంచినట్లు హైడ్రా సిబ్బంది గత వారం రోజులుగా పత్రికల్లో ప్రముఖంగా ప్రకటించుకుంటున్నారు. అయితే వర్షం పడే సూచనలు ఉన్నప్పటికీ వీరెవరూ రోడ్లపైకి రాకపోవడంతో అత్యవసర చర్యలు ఆగమాగమైపోయాయని హైడ్రా సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. వర్షం పడడడం మొదలైనప్పటి తర్వాత కొద్దిసేపటికి హైడ్రా బృందాలు రోడ్లపైకి రావడం, అప్పటికే రోడ్లన్నీ జలమయం కావడంతో పాటు చెట్లు కూలిపోవడంతో వాహనదారులు, నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
గంటలకొద్దీ ట్రాఫిక్ జామ్‌లో వాహనదారులు చిక్కుకుపోవడంతో వర్షాకాలం ప్రారంభంలోనే హైడ్రా పనితీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత సంవత్సరం నుంచి హైడ్రా స్వయంగా తామే మాన్సూన్ ఎమర్జెన్సీ పనులు చేపడుతామని ప్రకటించినప్పటికీ అప్పుడే చాలాచోట్ల సమస్యలు వెల్లువెత్తాయి. అయినప్పటికీ మున్సిపల్ అధికారులతో సమన్వయం చేసుకోకుండా నగరవాసికి వర్షమంటే భయం కల్పించారు. ఈసారి కూడా అదే పరిస్థితి తలెత్తుతుందా అనుకుంటూనే ఉండగా నిన్న కురిసిన వర్షం మళ్లీ హైడ్రా వైఫల్యాన్ని ఎత్తిచూపింది.
గత వర్షాకాలం అనుభవాలను దృష్టిలో ఉంచుకుని హైడ్రా అధికారులు గుర్తించిన ముంపు నివారణ, విపత్తుల నుంచి ప్రజలను కాపాడడమే లక్ష్యంగా గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్‌తో పాటు మల్కాజిగిరి, సైబరాబాద్‌లతో కలిసి ప్రణాళిక రూపొందించినట్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రకటించారు. ముందస్తుగానే అంటే మే నెలలోనే టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి మాన్సూన్ సీజన్‌కు తగినట్లుగా సన్నద్ధం కావలసిన చోట హైడ్రా నిర్లక్ష్యం కనిపిస్తున్నది. ఓఆర్ఆర్ పరిధిలోని మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్‌కు వాహనం, లేబర్, స్టాటిక్ టీమ్స్‌కు లేబర్ కావాలంటూ ఈనెల 1న టెండర్లు పిలిచింది. హైడ్రాకు జీహెచ్ఎంసీ, సైబరాబాద్, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్లతో కలిపి రూ.100కోట్ల నిధులు కేటాయించింది. మున్సిపల్, రెవెన్యూ, పోలీసు సిబ్బందితో సమన్వయం చేసుకోవలసిన అవసరం ఉంది. తామే బాస్లంటూ హైడ్రా వ్యవహరిస్తే తాము పనిచేయలేమని పలు శాఖల అధికారులు తమ ఉన్నతాధికారులకు చెప్పినట్లు సమాచారం.