దేశవ్యాప్తంగా కోట్లాది కుటుంబాల ఆశలపై ట్ -2026 పరీక్ష నీళ్లు చల్లింది. అవినీతి, నిర్లక్ష్యం, కోచింగ్ మాఫియా, కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వెరసి పేపర్ లీకేజీ కావడంతో పరీక్ష రద్దయ్యింది. దీంతో లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుపై నీలినీడలు అలుముకున్నాయి. ఈ క్రమంలో బీఆర్ఎస్, ఏఐవైఎఫ్ సహా వివిధ విద్యార్థి, ప్రజా సంఘాలు బుధవారం నగరంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయడంతో పాటు ఈ వ్యవహారంతో సంబంధాలు ఉన్న నిందితులను వెంటనే అరెస్టు చేయడంతో పాటు కఠినంగా శిక్షించాలని నేతలు, విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.
సమగ్ర దర్యాప్తు జరిపించాలి
హిమాయత్‌నగర్, మే13: నీట్ పరీక్ష ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంపై సమగ్రమైన దర్యాప్తు చేసి బాధ్యులను కఠినంగా శిక్షించాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి పుట్టలక్ష్మణ్ కేంద్రప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం హిమాయత్‌నగర్ వై జంక్షన్లో ఎఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నీట్ పరీక్ష నిర్వహణను రాష్ర్టాలకే ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి గ్యార నరేష్, నేతలు సామిడి వంశీవర్ధన్‌రెడ్డి, అరుణ్, హరీష్, రంజిత్, సుమన్ పాల్గొన్నారు.

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి
ఉప్పల్, మే 13: నీట్ పరీక్షను నిర్ధిష్టంగా నిర్వహించలేకపోయిన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) మేడ్చల్ జిల్లా సమితి ఆధ్వర్యంలో ఈసీఐఎల్ లోని అంబేదర్ కూడలి వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్లూరు ధర్మేంద్ర, ఏఐవైఎఫ్ మేడ్చల్ జిల్లా కార్యదర్శి టి. సత్య ప్రసాద్ ఆధ్వర్యంలో ధర్మేంద్ర ప్రధాన్ దిష్టిబొమ్మను దహనం చేశారు. వారు మాట్లాడుతూ.. ఇది కేవలం ఒక పరీక్ష వైఫల్యం కాదని, మోదీ ప్రభుత్వ పాలనా వైఫల్యానికి నిదర్శనమన్నారు. ఎన్టీఏ ను పూర్తిగా ప్రక్షాళన చేసి, అవినీతికి పాల్పడిన అధికారులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఏఐవైఎఫ్ మేడ్చల్ జిల్లా ఉపాధ్యక్షుడు శేఖర్, నాయకులు.. వికాస్, మురళి, నేతలు రవళి, కిరణ్మయి, దీప్తి, కుమార్,నదీమ్, మురళీకృష్ణ, పరమేశ్, ప్రదీప్, సాయికుమార్ పాల్గొన్నారు.
బాధ్యులపై చర్యలు తీసుకోవాలి
హిమాయత్‌నగర్, మే13: నీట్ పేపర్ లీకేజీ ఘటనలో బాధితులైన విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం న్యాయం చేయాలని పేదల రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు గిరగాని భిక్షపతిగౌడ్ బుధవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. పేపర్ లీకేజీపై సమగ్రమైన విచారణ చేసి ఈఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసు కోవాలన్నారు. నీట్ పరీక్ష నిర్వహణలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్న కేంద్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా ఉద్యమాలు కొనసాగిస్తామని హెచ్చరించారు.

విద్యార్థుల ఆకాంక్షలపై దాడి
సుల్తాన్‌బజార్, మే 13: నీట్ యూజీ-2026 పేపర్ లీక్, పరీక్ష రద్దును ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర శాఖ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నామని శాఖ అధ్యక్షుడు డాక్టర్ పీ కిషన్, కార్యదర్శి డాక్టర్ వీ అశోక్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. నీట్ పరీక్షకు దేశ వ్యాప్తంగా సుమారు 22.79 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారని వీరిలో ఒక్క తెలంగాణ రాష్ట్రం నుంచే సుమారు 70వేల మంది అభ్యర్థులు ఉన్నారని వారు తెలిపారు. ఈ రద్దు కేవలం పరీక్షా అవకతవకలు మాత్రమే కాదని, ఇది లక్షలాది మంది విద్యార్థుల ఆకాంక్షలపై, వైద్య విద్యకు సమాన ప్రాప్యత అనే ప్రాథమిక సూత్రాలపై జరిగిన దాడిగా వారు అభివర్ణించారు. భారతదేశ భవిష్యత్ వైద్యులకు ఒక న్యాయమైన అవకాశం లభించాలని.. రాజీపడిన పునాదిపై దేశ ఆరోగ్యాన్ని నిర్మించలేమని వారు పేర్కొన్నారు.
పరీక్ష నిర్వహణలో కేంద్రం విఫలం
కవాడిగూడ, మే 13: నీట్ పరీక్షను పారదర్శకంగా నిర్వహించడంలో కేంద్ర ప్రభుత్వం, ఎన్టీఏ పూర్తిగా విఫలమయ్యాయని స్టూడెంట్ ఇస్లామిక్(ఎస్ఐఓ) రాష్ట్ర అధ్యక్షుడు మహ్మద్ పరాజ్అహ్మద్ విమర్శించారు. ఎస్ఐఓ ఆధ్వర్యంలో ట్యాంక్‌బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద బుధవారం విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఫరాజ్అహ్మద్ మాట్లాడుతూ.. నీట్ పేపర్ లీకేజీలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పరీక్ష రద్దుతో 22 లక్షల మంది విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్ఐఓ నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
