NCRB | ఫుడ్ క్వాలిటీ ఇండెక్స్‌లో హైదరాబాద్ అట్టడుగు స్థానంలో నిలిచింది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఈ సర్వే నిర్వహించింది. ఇటీవల కాలంలో ఫుడ్ విషయంలో భాగ్యనగరం ప్రతిష్ట మసకబారుతూ వస్తున్నది. కల్తీ ఆహారానికి సంబంధించి భారత్‌లోని ప్రముఖ 19 నగరాల్లో క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఈ సర్వే చేపట్టింది. ఆహార నాణ్యత ప్రమాణాలను ప్రాతిపదికగా తీసుకుని ఈ సర్వే చేపట్టగా.. హైదరాబాద్ ఆఖరి స్థానంలో నిలిచింది. కల్తీ ఆహారంలో టాప్ ప్లేస్‌లో నిలువగా.. నగరంలోని హోటల్స్, రెస్టారెంట్స్ సైతం కనీసం నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదనే విషయం సర్వేలో వెల్లడికావడం ఆందోళన వ్యక్తమవుతున్నది. దాదాపు 62శాతం హోటల్స్‌లో గడువు తీరిన ఆహార పదార్థాలు వినియోగిస్తున్నట్లు తెలుస్తున్నది. వాస్తవానికి ఫుడ్ విషయంలో హైదరాబాద్‌కు ఎంతో ఘన చరిత్ర ఉన్నది.
హైదరాబాద్ బిర్యానీ, హలీంతో పాటు మొఘలాయి వంటకాలకు హైదరాబాద్ అంతర్జాతీయంగా ఖ్యాతిని ఆర్జించింది. అయితే, ఇటీవల కాలంలో అధికారుల నిర్వహించిన దాడుల్లో దిగ్భ్రాంతిని కలిగించే విషయాలు వెలుగులోకి వచ్చాయి. తనిఖీల్లో కుళ్లిపోయిన పదార్థాలను వినియోగించడం, నాసిరకమైన పదార్థాలను వినియోగిస్తున్నట్లు తేలింది. అయితే, నగరంలోని పలు హోటల్స్ ఆహారం తన్న పలువురికి ఫుడ్ పాయిజనింగ్ జరిగిన విషయం తెలిసిందే. గడిచిన రెండునెలల్లో నగరంలో 84శాతం ఫుడ్ పాయిజనింగ్ కేసులు రికార్డయ్యాయి. దాంతో హోటల్స్, రెస్టారెంట్స్‌లో నాణ్యతా ప్రమాణాలు ఎలా ఉంటున్నాయో అవగతమవుతున్నది. ఇదిలా ఉండగా.. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో సర్వే తో జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది. హోటల్స్, రెస్టారెంట్లలో మార్పులు వచ్చే వరకు దాడులు కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.