BRS Party | మహారాష్ట్రలో బీఆర్ఎస్ పార్టీలోకి జోరుగా చేరికలు కొనసాగుతున్నాయి. ఎన్సీపీ, బీజేపీ తదితర పార్టీల నుంచి నేతలు గులాబీ పార్టీలో చేరేందుకు క్యూకడుతున్నారు. ఇప్పటికే పలువురు నాయకులు బీఆర్ఎస్లో చేరగా.. బుధవారం కూడా ఈ చేరికలు కొనసాగాయి. విశ్రాంత ఐపీఎస్ అధికారి, మాజీ మహారాష్ట్ర ఐజీ విఠల్ జాదవ్, మరాఠీ సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ డ్యాన్సర్, ఎన్సీపీ నేత సురేఖ పునేకర్ బుధవారం నాడు బీఆర్ఎస్ పార్టీలో చేరడం ప్రాధాన్యం సంతరించుకుంది. వీరితో పాటు సామాజిక కార్యకర్తలు శేఖర్ అంబేడ్కర్, ఉమాకాంత్ మంగ్రూలే బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వీరికి సీఎం కేసీఆర్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
హైదరాబాద్లో జరిగిన ఈ కార్యక్రమంలో లాతూర్, ఉస్మానాబాద్ జిల్లాలకు చెందిన ఆమ్ఆద్మీ పార్టీ అధ్యక్షులు, గ్రామ సర్పంచ్లు, పలువురు బీజేపీ నాయకులు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణలో రైతు సర్కార్ అధికారంలోకి రావడం వల్లనే తొమ్మిదేండ్ల అనతికాలంలో రాష్ట్రం అభివృద్ధి చెందిందని.. తెలంగాణ మోడల్ పాలన అందుబాటులోకి వచ్చిందని అన్నారు. మన జీవితాలు బాగుపడాలంటే , హక్కులు సాధించుకోవాలంటే పోరాటాలు చేయడమే తప్ప వేరే మార్గం లేదన్నట్లుగా దేశంలోని రైతు పరిస్థితి తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక నుంచి దేశంలో రైతులు వ్యవసాయ పనులు వదులుకొని రైతులు రోడ్డెక్కి పోరాటాలు చేయాల్సిన అవసరం లేకుండా తమ ప్రభుత్వాన్ని తామే ఏర్పాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు. మన ఓటు మనకే అనే చైతన్యంతో అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ నినాదాన్ని నిజం చేసేందుకు దైశ రైతాంగమంతా బీఆర్ఎస్ పార్టీతో కలిసి నడవాలని పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర బీఆర్ఎస్ నేతలు శంకరన్న దొంగ్డే, మాణిక్ కదం తదితరులు పాల్గొన్నారు.