Saifabad Science College : సుల్తాన్ బజార్, జూన్ 17 :ప్రతి ఒక్క విద్యార్థి రక్తదానం ప్రాముఖ్యాన్ని తెలుసుకొని, ఆపదలో ఉన్నవాళ్లకు రక్తదానం(Blood Donation) చేసి వారి ప్రాణాలను కాపాడాలని సైఫాబాద్ సైన్స్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కే శైలజ (K.Shailaja) అన్నారు. మంగళవారం మాసబ్ ట్యాంక్‌లోని సైఫాబాద్ సైన్స్ కళాశాలలో ఎన్ఎస్ఎస్(NSS), ఎన్సీసీ(NCC) విద్యార్థుల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. శిబిరాన్ని ప్రారంభించిన ప్రిన్సిపల్ శైలజ మాట్లాడుతూ.. రక్తదానం మహాదానమని పేర్కొన్నారు. ఆపదలో ఉన్న వ్యక్తిని కాపాడేందుకు రక్తదానం చేయడానికి విద్యార్థులు ముందుండాలని ఆమె పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా ఎన్సీసీ క్యాడేట్లు, అధ్యాపకులు, విద్యార్థులు ఎన్సీసీ వాలంటీర్లు, కళాశాల సిబ్బందితో కలిపి మొత్తంగా 52 మంది రక్తదానం చేశారు. నీలోఫర్ వైద్యులు వీళ్ల నుంచి రక్తాన్ని సేకరించారు. అనంతరం బ్లడ్ క్యాంప్‌లో పాల్గొన్న విద్యార్థులకు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు ప్రిన్సిపల్. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ అరవింద్ సీమ, ఎన్ఎస్ఎస్ ఆఫీసర్ డాక్టర్ వెంకటేశ్వర్లు, ఎన్సీసీ అధికారి లెఫ్టినెంట్ డాక్టర్ పల్లాటి నరేష్, నిలోఫర్ దవాఖాన బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ నరేందర్ నాయక్, కౌన్సిలర్ రామలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.