బీఆర్ఎస్ పాలనలో అన్ని కులవృత్తులకు పెద్దపీట వేసిన కేసీఆర్.. వాటి పూర్వవైభవానికి విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. అందులో భాగంగానే అన్ని నిరుపేద నాయీబ్రాహ్మణులకు సెలూన్ నిర్వహణ భారం తప్పించేందుకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించి కరంటు బిల్లుల భారం తప్పించి జీవనోపాధికి తోడ్పాటునందించారు. ఫలితంగా రాష్ట్రంలో లక్షలాది క్షౌరవృత్తి కుటుంబాలకు లబ్ధిచేకూరగా వారి జీవితం ఎలాంటి ఇబ్బందుల్లేకుండా సాఫీగా సాగిపోయేది. కానీ కాంగ్రెస్ సర్కారు వచ్చీరాగానే మొటిరోజే ఉచిత విద్యుత్‌ను కట్ చేసింది. సెలూన్ల నిర్వహణపై కరెంటు బిల్లుల మోత మోగిస్తున్నది. ప్రస్తుతం ఒక్కో సెలూన్‌పై రూ.40వేల నుంచి రూ.80వేల దాకా బకాయిల భారం పడుతున్నది. ఇలా పరిస్థితి మళ్లీ మొదటికి రావడంతో నాయిబ్రాహ్మణుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. రోజంతా పనిచేయగా వచ్చే కొన్ని డబ్బులు కరెంటు బిల్లులకే పోతే తాము బతికేదెలా, కాంగ్రెస్ వచ్చిన నాటి నుంచి తమ జీవితాల్లో చీకట్లు కమ్ముకున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సెలూన్లకు ఇచ్చే ఫ్రీ కరంటును ‘కట్’ చేస్తే.. తాము జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌కు ఓటు ‘కట్’ చేస్తామంటూ తెగేసి చెబుతున్నారు.
– సిటీబ్యూరో, అక్టోబర్ 28
(నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తొలి నెల నుంచే నాయీ బ్రాహ్మణులకు 200 ఉచిత కరెంట్ కట్ చేశారు. బీఆర్ఎస్ హయాంలో ప్రతి నెల కరెంట్ బిల్లులో 200 యూనిట్లకు అయ్యేంత వరకు మినహాయించి అంతకంటే ఎక్కువ వినియోగిస్తే మాత్రమే బిల్లు వచ్చేది. ఒక నెలకు సుమారు రూ.2 వేల బిల్లు వస్తే అందులో 200 యూనిట్ల వరకు రూ.1500 తీసేసి పైన ఉండే రూ.500 మాత్రమే చెల్లించేవారు. దీంతో సెలూన్ నిర్వాహకులకు భారం ఉండకపోయేది. నెలకు కనీసం రూ.1500 దాకా ఆదా అయ్యేది. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వారి పరిస్థితి తలకిందులైంది. 2023 డిసెంబర్ నెల నుంచే బిల్లులో 200 యూనిట్లకు మినహాయింపు లేకుండా రశీదులు ఇస్తున్నారు. దీంతో ఒక్కో సెలూన్‌కు రూ.2500 నుంచి రూ.3000 దాకా బిల్లు వస్తున్నది. దీంతో అదనపు భారం పెరిగి వృత్తిదారులు ఇబ్బందులు పడుతున్నారు. వచ్చే ఆదాయంలో రూ.3వేలు బిల్లుకే పోతే సెలూన్, ఇంటి అద్దెలు చెల్లించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వచ్చే కొద్ది ఆదాయంతో కుటుంబ పోషణ భారమవుతుందని వాపోతున్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఉచిత విద్యుత్ పథకం అమలు కావడం లేదు. కానీ దీంతో ప్రతి సెలూన్‌పై నెలకు రూ.2500 నుంచి రూ.3000 వేల బిల్లులతో విద్యుత్ అధికారులు రసీదులు ఇస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో బిల్లులు ప్రభుత్వమే భరించి మిగతా బిల్లుతో రసీదు ఇచ్చేది. ఇప్పటి ప్రభుత్వం కూడా ఆ బిల్లులు చెల్లిస్తుందని సెలూన్ల నిర్వాహకులు బిల్లులు చెల్లించలేదు. దీంతో ఒక్కో సెలూన్‌పై రూ.40వేల నుంచి రూ.80వేల దాకా బకాయిలు పేరుకుపోయాయి. దీంతో విద్యుత్ శాఖ అధికారులు పెండింగ్ బిల్లులు చెల్లించకుంటే కనెక్షన్లు కట్ చేస్తామని హెచ్చరిస్తున్నారు. అటు ప్రభుత్వం చెల్లించక.. నిర్వాహకులు చెల్లించకుండా ఉంటే విద్యుత్ శాఖ మీద భారం పడుతుందని చెప్తున్నారు. ప్రభుత్వం చెల్లించే పరిస్థితి లేదని.. నిర్వాహకులు చెల్లించాల్సిందేనని తేల్చి చెప్తున్నారు. దీంతో అంత మొత్తంలో బకాయిలు చెల్లించాలంటే తమ వల్ల కాదని నాయీబ్రాహ్మణులు చెప్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాన్ని తీసేసి నాయీబ్రాహ్మణుల పొట్ట కొడుతున్నారని మండిపడుతున్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికలో ఓడించి సత్తా చూపుతామని హెచ్చరిస్తున్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటినుంచి కులవృత్తులు, చేతి వృత్తులు, దినసరి కూలీలతో పాటు అన్ని వర్గాల ప్రజలు అవస్థలు పడుతున్నారు. రేవంత్‌రెడ్డి సీఎం అయ్యాక 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకం అమలు కావడం లేదు. నాకున్న సెలూన్‌కు బీఆర్ఎస్ హయాంలో 200 యూనిట్లు పోను నెలకు రూ.600 నుంచి రూ.1000 వరకు బిల్లు కట్టేది. కానీ 2023 డిసెంబర్ నుంచి 200 యూనిట్లకు బిల్లు కట్ కాకుండానే మొత్తం బిల్లు రసీదులు వస్తున్నాయి. దీంతో నెలకు రూ.3000 దాకా భారం అవుతోంది. విద్యుత్ అధికారులు బిల్లు చెల్లించాల్సిందేనని ఒత్తిడి చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఇప్పటిదాకా ఎలాంటి స్పందన లేదు. వచ్చే కొంత ఆదాయంలో బిల్లులకే పోతే ఎలా బతికేది.
– ఎన్.గోపి, వెంగళరావునగర్
కాంగ్రెస్ ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడమే గాక కేసీఆర్ పెట్టిన పథకాలు కూడా బంద్ చేస్తున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వం నాయీబ్రాహ్మణుల కోసం ఉచిత విద్యుత్ పథకం తెస్తే కాంగ్రెస్ నమ్మకద్రోహం మోసం చేసింది. నాకు ఈ నెల రూ.14 వేల వరకు బిల్లు వచ్చింది. విద్యుత్ శాఖ అధికారులు బిల్లు కట్టాలని ఒత్తిడి చేస్తున్నారు. లబ్ధిదారులే స్వచ్ఛందంగా ఈ పథకాన్ని విరమించుకునేలా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నది.
– దత్తు, ఎల్ఎన్నగర్, యూసుఫ్‌గూడ