కొండాపూర్, మే 12 : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన పోక్సో కేసు ఘటనపై కాంగ్రెస్, బీజేపీ వైఖరిని తీవ్రంగా ఖండిస్తూ మంగళవారం చందానగర్ లో శేరిలింగంపల్లి నియోజకవర్గం బీఆర్ఎస్ శ్రేణులు భారీ నిరసన చేపట్టారు. చందానగర్ మాజీ కార్పొరేటర్ బొబ్బ నవతారెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన నిరసనలో బాలికకు వెంటనే న్యాయం చేయాలని, ఘాతుకానికి పాల్పడిన బండి భగీరథను వెంటనే అరెస్ట్ చేయాలంటూ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ముంబై జాతీయ రహదారిపై బైఠాయించి రోడ్డును దిగ్బంధించారు. ఈ సందర్భంగా నవతా రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ – బీజేపీ రాజకీయ నాటకాలు ఆపాలని, బాలికకు వెంటనే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణలో మహిళల భద్రత ప్రశ్నార్థకంగా మారిందని, దోషులను కఠినంగా శిక్షించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని” డిమాండ్ చేశారు. ప్రజల భద్రతను కాపాడాల్సిన ప్రభుత్వాలు రాజకీయ ప్రయోజనాల కోసం మౌనం వహించడం దురదృష్టకరామన్నారు. బాలికపై జరిగిన అమానుష ఘటనపై కాంగ్రెస్ ప్రభుత్వం, బీజేపీ నాయకత్వం స్పష్టమైన వైఖరి చెప్పాలన్నారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు మా పోరాటం ఆగదని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో నాయకులు రోజా, మమత, నాగమణి, వాల హరీష్, మిద్దెల మల్లారెడ్డి, తిరుమలేష్, కే రాములు, బీఎస్ఎన్ కిరణ్ యాదవ్, పొట్ట నరేందర్ యాదవ్, సంతోష్ రెడ్డి, రామకృష్ణ గౌడ్, శివరాజ్, బొపరాజు శ్రీనివాస్, శ్రీకాంత్, ప్రకాష్, వడ్డే శ్రీనివాస్, వాకిటి శంకర్, నవీన్ యాదవ్, ప్రమోద్, గౌస్, బాబు మల్లేష్, సుభాష్ రాథోడ్, బీఆర్ఎస్వీ రాజు, షరీన్, వడ్డే రాజు, జహంగీర్ తదితరులు పాల్గొన్నారు. నిరసనతో రహదారిపై ట్రాఫిక్కు అంతరాయం కలగగా, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నాయకులతో చర్చలు జరిపి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.