కొండాపూర్, డిసెంబర్ 18 : శేరిలింగంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ ఏ పార్టీలో ఉన్నాడో తేల్చి చెప్పాలని నియోజకవర్గ ప్రజలతో పాటు బీఆర్ఎస్ శ్రేణులు కోరుతున్నాయి. పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ ఇచ్చిన ఫిర్యాదుపై ఎలాంటి రుజువులు లేదంటూ స్పీకర్ తేల్చడంతో నియోజకవర్గ ప్రజల్లో మరింత అనుమానం మొదలయింది. గురువారం చందానగర్ బీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు, మాజీ కార్పొరేటర్ నవతారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నియోజకవర్గ నాయయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మినిమం వేజేస్ చైర్మన్ సామ వెంకట్‌రెడ్డితో కలిసి నవతారెడ్డి మాట్లాడారు.
స్పీకర్ నిర్ణయంతో శేరిలింగంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీకి చెందినవారు కాదని బహిర్గతమయిందన్నారు. మరి ఎమ్మెల్యే ప్రస్తుతం ఏ పార్టీలో ఉన్నారనే విషయంపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. తాను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాను అనుకుంటే ఈనెల 21వ తేదీన కేసీఆర్ అధ్యక్షతన జరిగే సీఎల్పీ ప్లీనరీ సమావేశానికి గులాబీ కండువా కప్పుకొని హాజరుకావాలన్నారు. ఒకవేళ హాజరు కాకపోతే, ప్రజలు ఆయనను పార్టీలో ఉన్నారని ఎలా నమ్ముతారని వారు ప్రశ్నించారు. గాజులరామారం సర్వే నంబర్ 307, శంషీగూడ సర్వే నంబర్ 57 లోని భూములను కాపాడుకోవడానికే ఎమ్మెల్యే కాంగ్రెస్‌లో చేరినట్లు ఆరోపించారు. కూకట్పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు తనపై వచ్చిన ఆరోపణలను ఖండిస్తూ.. విచారణ కోరినట్లుగానే, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే తనపై వచ్చిన ఆరోపణలపై తెలంగాణ ప్రభుత్వం ద్వారా విజిలెన్స్ విచారణ కోరి తన నిజాయితీని నిరూపించుకోవాలని సవాల్ విసిరారు.
ఒకవేళ ఎమ్మెల్యే బీఆర్ఎస్లో లేనట్లయితే, వెంటనే తన పదవికి రాజీనామా చేసి మళ్ళీ ప్రజల తీర్పు కోరాలని డిమాండ్ చేశారు. ప్రజలు తమ ఓటు ద్వారా ఇచ్చిన అధికారాన్ని గౌరవించాలని, లేనిపక్షంలో రాబోయే ఎన్నికల్లో శేరిలింగంపల్లి ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు పారునంది శ్రీకాంత్, రవి యాదవ్, రోజా, శ్రీనివాస్ గౌడ్, సంగారెడ్డి, వాలా హరీష్, మల్లారెడ్డి, శ్రీకాంత్, గోకరాజు శ్రీనివాస్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు