బన్సీలాల్ పేట్ : ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ వర్క్‌షాప్‌లో భాగంగా 18 రాష్ట్రాల నుంచి రాష్ట్ర నోడల్ అధికారుల బృందం శుక్రవారం గాంధీ దవాఖానను సందర్శించింది. గాంధీలో సౌకర్యాలు, రికార్డుల డిజిటల్ నిర్వహణ, వేగవంతమైన ఓపీ సేవలు, స్కాన్ అండ్ షేర్ విధానం, ల్యాబ్‌లో డిజిటల్ సేవలు అందించే విషయాలను గాంధీ దవాఖాన నోడల్ అధికారి డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి వారికి వివరించారు.
క్రాస్-లెర్నింగ్ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన వైద్యులకు గాంధీ దవాఖానలో రోగులకు అందిస్తున్న సేవలను సూపరింటెండెంట్ డాక్టర్ సీహెచ్ రాజకుమారి, సీఎస్ఆర్ఎంఓ డాక్టర్ శేషాద్రి వివరించారు. రోగుల హెల్త్ రికార్డులు డిజిటల్ చేయడం ద్వారా వారి ఆరోగ్య వివరాలు వారి మొబైల్ నెంబర్ ద్వారా వారి అకౌంట్లో ఉంటాయని, దీని ద్వారా వివరాలు, ల్యాబ్ రిపోర్టులు జీవితాంతం అందుబాటులో ఉంటాయని తెలిపారు. వంద శాతం డిజిటల్ చేయాలని ఇప్పటికే పూర్తిస్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు.
జాతీయస్థాయి మెడికల్ బృంద సభ్యులు డాక్టర్ పంకజ్ అరోరా, సౌరభ్ సింగ్, రితిక, బబిత, అభ్యుదయ్, గాంధీ దవాఖాన ఆర్‌ఎంఓలు డాక్టర్ రజని, డాక్టర్ మీనాక్షి, డాక్టర్ నజీమ్, డాక్టర్ సుధీర్, డాక్టర్ యోగి, డాక్టర్ నవీన్, డాక్టర్ సరిత, రాష్ట్ర బృందం దివ్య, డాక్టర్ విమల, సురేష్ పాల్గొన్నారు.