CM KCR | దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ ప్రభుత్వం దళితుల సంక్షేమం కోసం కృషి చేస్తోందని జాతీయ మేధావులు ప్రశంసించారు. తెలంగాణ సచివాలయానికి అంబేడ్కర్ పేరుపెట్టడం దేశానికి గర్వకారణమని కొనియాడారు. 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహ ఏర్పాటుకు సీఎం కేసీఆర్ కృషి అమోఘమని అన్నారు. దళితుల సంక్షేమం కోసం పాటుపడుతున్న సీఎం కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపేందుకు రవీంద్రభారతిలో మంగళవారం కృతజ్ఞత సభ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా దళితుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందని కొనియాడారు. హైదరాబాద్లో 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు చేయడం.. తెలంగాణ సచివాలయానికి అంబేడ్కర్ పేరు పెట్టడం గర్వకారణమని కొనియాడారు. అంబేడ్కర్ అందరివాడు అని ఓయూ వీసీ రవీందర్ యాదవ్ అన్నారు. దళితుల అభ్యున్నతికి కృషి చేస్తున్న సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు.
హైదరాబాద్లో అంబేడ్కర్ విగ్రహం పెట్టడం గొప్ప దార్శనికతకు నిదర్శనమని ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ కొనియాడారు. నియంతృత్వ రాజ్యాన్ని స్థాపించేందుకు మోదీ సర్కార్ యత్నిస్తుందని ఆయన అన్నారు. దేశ ప్రజలు చక్రబంధంలో ఇరుక్కున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు చేసినందుకు సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె.శ్రీనివాస్ తెలిపారు. ఆర్టికల్ 3 లేకపోతే ఇన్న రాష్ట్రాల ఏర్పాటుకు ఇబ్బంది అయ్యేదని అభిప్రాయపడ్డారు. అంబేడ్కర్ సమాజం మొత్తానికి చెందినవాడు అని అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ వీసీ సీతారామారావు అన్నారు. అంబేడ్కర్ ఒక ప్రభంజనం అని తెలంగాణ మహిళా యూనివర్సిటీ వీజీ విజ్ఞులత పేర్కొన్నారు. బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి కృషి చేయాలని అన్నారు.
ప్రబుద్ధ బారత్ ఇంటర్నేషనల్, సమతాదళ్, ఎస్సీ, ఎస్టీ ఆఫీసర్స్ ఫోరం నిర్వహించిన ఈ ధన్యవాద సభకు యూజీసీ మాజీ చైర్మన్ సుఖ్దేవ్ థోరట్, ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి, ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, టీఎస్పీఎస్సీ మాజీ చైర్మన్ ఘంటా చక్రపాణి తదితరులు హాజరయ్యారు.