Namasthe Telangana Effect | బంజారాహిల్స్, జూలై 17: హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెం 14లోని నందినగర్‌లో ఖరీదైన ప్రభుత్వ స్థలం ఆక్రమణలపై ఎట్టకేలకు షేక్‌పేట మండల రెవెన్యూ అధికారులు స్పందించారు. నమస్తే తెలంగాణ వరుస కథనాలతో స్పందించిన అధికారులు.. జేసీబీల సాయంతో ఆక్రమణలను కూల్చివేశారు.
అధికార పార్టీ నేతలతో పాటు మరికొందరి అండదండలు ఉండటంతో పలువురు నందినగర్ గ్రౌండ్స్‌లో లెక్కకు మించి ఆక్రమణలు చేశారు. దీంతో గత ఏడాదికాలంగా నంది నగర్‌కు ఆర్టీసీ బస్సులు సైతం రావడం మానేశాయి. నందినగర్ బస్టాప్‌లో ఖరీదైన ప్రభుత్వ స్థలం కబ్జాలపై నమస్తే తెలంగాణ ఇటీవల వరుస కథనాలను ప్రచురించింది. వీటిపై స్పందించిన షేక్‌పేట మండల సిబ్బంది.. గురువారం నాడు రంగంలోకి దిగారు. పోలీసు బందోబస్తు నడుమ జేసీబీల సాయంతో ఆక్రమణల కూల్చివేత చేపట్టారు. ఇష్టారాజ్యంగా ఏర్పాటు చేసిన హోటళ్లు, టీస్టాల్స్, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లను నేలమట్టం చేశారు. అలాగే ఖాళీ స్థలంలో ఇసుక, ఇటుక వ్యాపారాలు చేస్తుండగా వాటిని ఖాళీ చేయించారు.
Nandi Nagar2
బస్తీకి చెందిన కొంతమంది నేతలు వీటిని ఏర్పాటు చేయించి వేలల్లో అద్దెలు వసూలు చేసుకుంటున్నారని, మరికొంతమంది ఏకంగా కరెంట్ మీటర్లు సంపాదించి స్థలాన్ని శాశ్వతంగా కబ్జా చేసేందుకు స్కెచ్ వేస్తున్నారని స్థానికులు ఆరోపించారు. ప్రభుత్వ స్థలంలో అక్రమ నిర్మాణాలకు కరెంట్ మీటర్లు ఎలా ఇచ్చారో విచారణ చేస్తే ఎన్నో అవకతవకలు బయటపడతాయని డిమాండ్ చేశారు. కాగా, సుమారు 20 దాకా ఆక్రమణలు తొలగించినట్లు అధికారులు తెలిపారు. నందినగర్ గ్రౌండ్స్‌లో ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమిస్తే ఇకనుంచి ఉపేక్షించేది లేదని, అలాంటి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని తహసీల్దార్ అనితారెడ్డి హెచ్చరించారు. స్థలంలో శిథిలాలను తొలగించిన తర్వాత ఆర్టీసీ బస్సులను పునరుద్ధరించేలా చూడాలని స్థానికులు కోరారు. అడ్డదిడ్డంగా వచ్చిన ఆక్రమణలను తొలగించడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.