Hyderabad | బంజారాహిల్స్, ఏప్రిల్ 19: పార్కుల నిర్వహణలో జీహెచ్ఎంసీ యూబీడీ విభాగం నిర్లక్ష్యంపై నమస్తే తెలంగాణ పత్రికలో ‘పార్కుకు వచ్చేదెలా.. సేద తీరేదెట్ల..’ అనే శీర్షికతో శనివారం ప్రచురించిన కథనంపై అధికారులు స్పందించారు.
బంజారాహిల్స్ డివిజన్ పరిధిలోని ఎమ్మెల్యే కాలనీని అనుకుని ఉన్న ఫోటోగ్రాఫర్ కాలనీలోని ట్రీ పార్కు దుస్థితిపై స్పందించిన జీహెచ్ఎంసీ యూబీడీ విభాగం అధికారులు శనివారం ఉదయం నుంచి పార్కులో క్లీనింగ్ పనులు ప్రారంభించారు. విపరీతంగా పెరిగిపోయిన పిచ్చిమొక్కలు తొలగించడంతో పాటు చెత్తాచెదారాన్ని శుభ్రం చేశారు. పార్కులోని వ్యర్థాలను తరలించారు. పార్కులోని మొక్కలకు వేసవికాలంలో నీరు అందించేలా చర్యలు తీసుకుంటామని యూబీడీ అధికారులు తెలిపారు. కాలనీ పార్కుపై అధికారులు నిర్లక్ష్యం వీడి ఇక నుంచి రెగ్యులర్గా దృష్టి పెట్టాలని కాలనీవాసులు కోరుతున్నారు.
నమస్తే తెలంగాణ ఆర్టికల్