సిటీ బ్యూరో, డిసెంబర్30 (నమస్తే తెలంగాణ) : 420 హామీలతో ప్రజలను మోసగించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. హైడ్రా, మూసీ పునరుద్ధరణ పేరిట పేదల ఇండ్లను కూల్చివేసింది. బుల్డోజర్లతో బస్తీలను తొలగించి అనాథలను చేసింది. హైడ్రా, మూసీ పేరిట వంచనకు గురైన కాంగ్రెస్ బాధితులకు ‘నమస్తే తెలంగాణ’ అండగా నిలబడింది. పేదలను కొట్టి పెద్దలకు పెట్టాలని కాంగ్రెస్ చేస్తున్న అరాచకాలను బట్టలిప్పి బజారులో నిలబెట్టింది. ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను ఎండగడుతున్న ఏకైక పత్రికగా నిలిచింది. పేదల పక్షాన ‘నమస్తే’ చేస్తున్న పోరాటంతో కాంగ్రెస్ బుల్డోజర్ వెనక్కి తగ్గింది. విధ్వంసాన్ని అడ్డుకునేందుకు తెగించి కొట్లాడింది. రెండేండ్ల కాంగ్రెస్ హైడ్రా అరాచకాలను నిలదీస్తూ పేదలకు రక్షణ వలయంగా నిలిచింది. బాధితుల పక్షాన నిలిచి కాంగ్రెస్ అరాచకాలను ప్రపంచానికి చూపించింది. పేదల పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వంపై కలబడి, నిలబడి భరోసా కల్పిస్తున్నది.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఔటర్ రింగ్ రోడ్డు లోపలి ఆక్రమణలను తొలగించాలనే ఉద్దేశంతో హైడ్రాను ఏర్పాటు చేసింది. కాంగ్రెస్ తీసుకొచ్చిన హైడ్రా అధికారులు పేదలను దోచి.. పెద్దలకు పెట్టాలనే లక్ష్యంగా పనిచేయడం ప్రారంభించింది. నగర వ్యాప్తంగా వేల కోట్ల రూపాయల విలువ చేసే భూములను కబ్జా చేసి విలాసవంతమైన నిర్మాణాలు ఏర్పరుచుకున్న కాంగ్రెస్ పెద్దలు, బడా వ్యాపారులను వదిలేసి నిరుపేదలు, దినసరి కూలీలే టార్గెట్‌గా విధ్వంసం సృష్టించారు. వేలాది మంది పేదలను రోడ్డుపాలు చేశారు. పండుగలు, సెలవు రోజుల్లో నిరుపేదలను చెరబట్టి వారి నివాసాలపైకి బుల్డోజర్ను ఎక్కుపెట్టారు. తమ బతుకులను రోడ్డుపాలు చేయొద్దని వేడుకున్నా కనికరించకుండా నిర్వాసితులను చేశారు. కాంగ్రెస్ వంచించిన బడుగు జీవులకు ‘నమస్తే తెలంగాణ’ అండగా నిలబడింది.
పేదలను కొట్టి పెద్దలకు పెట్టాలని కాంగ్రెస్ చేస్తున్న అరాచకాలను బట్టలిప్పి బజారులో నిలబెట్టింది. పేదల కష్టాలు, బాధలను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేస్తూ వస్తున్నది. ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను ఎండగడుతున్న ఏకైక పత్రికగా నిలిచింది. పేదల పక్షాన ‘నమస్తే’ చేస్తున్న పోరాటంతో కాంగ్రెస్ బుల్డోజర్ వెనక్కి తగ్గింది. పేదల ఇండ్లను కూల్చాలంటేనే భయపడేలా హైడ్రాలో మార్పు వచ్చింది. చాలా వరకు నిరుపేదల ఇండ్ల కూల్చివేతలు తగ్గించింది. చెరువుల సంరక్షణ పేరిట పేదల ఇండ్లను నేలమట్టం చేసిన హైడ్రాను నిలదీసింది. కాయకష్టం చేసి పైసాపైసా కూడబెట్టుకుని కట్టుకున్న నిరుపేదల ఇండ్లను కూలిస్తే హైడ్రాపై గర్జించింది. రెండేండ్ల కాంగ్రెస్ హైడ్రా అరాచకాలను ఎక్కడిక్కడ నిలదీస్తూ పేదలకు రక్షణ వలయంగా నిలిచింది.
మూసీ బస్తీ బతుకులను కాంగ్రెస్ ఛిద్రం చేసింది. మూసీ ప్రక్షాళన పేరిట వేల కోట్లు దండుకునేందుకు లక్షలాది ఇండ్లపై కన్నేసింది. ఎక్కడికక్కడ ఇష్టానుసారంగా ఎర్రగీతలతో మార్కింగులు చేసి నిర్దాక్షిణ్యంగా ఇండ్లను కూల్చేసింది. తరతరాలుగా నివసిస్తున్న గూడు చెదిరిపోతుంటే ఆ నిరుపేదల రోదనలు సైతం పట్టించుకోలేదు. సొంత ఇంటిని కూల్చేసి వందలాది మందిని రోడ్డున పడేసింది.
మూసీ ప్రక్షాళన అంటూ ఆగమేఘాల మీద జీవోలు తీసుకొచ్చి బుల్డోజర్లను పేదలపైకి పంపించింది. పరిహారం, పునరావాసం పేరిట నామమాత్రపు సాయం చేసి బస్తీ జీవులను మరింత పేదరికంలోకి నెట్టింది. లక్షలాది రూపాయల లోన్‌తో కట్టుకున్న ఇండ్లను నేలమట్టం చేయడంతో బ్యాంకులకు కప్పం కడుతున్నారు. ఏండ్లుగా నివసిస్తున్న హైదరాబాద్ మూలవాసులను కాంగ్రెస్ పగపట్టింది. కూల్చివేతలతో భయపెట్టినా బస్తీ ప్రజలు ప్రతిఘటించడంతో కృత్రిమ వరదలు సైతం సృష్టించింది. ఉస్మాన్‌సాగర్, హిమాయత్సాగర్లను పూర్తిగా నింపి ఒకేసారి పరీవాహక బస్తీలపైకి వదిలింది. నీటమునిగి బురదలో కూరుకుపోయి సర్వం కోల్పోయిన ప్రజలను కన్నెత్తి చూడలేదు.
మూసీ బస్తీలను చెరబట్టిన కాంగ్రెస్‌ను ‘నమస్తే తెలంగాణ’ కడిగిపారేసింది. సర్కారు కుట్రను భగ్నం చేసి బాధితులకు చూపించింది. మూసీ బురదను పేదలకు పూయాలనుకున్న కాంగ్రెస్ సర్కార్‌ను అడుగడుగునా అడ్డుకున్నది. గూడు చెదిరి రోడ్డుపాలైన నిర్వాసితులకు అండగా నిలిచింది. బాధితుల పక్షాన నిలిచి కాంగ్రెస్ అరాచకాలను ప్రపంచానికి చూపించింది. పేదలను వంచించేందుకు వేసిన కుట్రలు, ఎత్తుగడలను చిత్తు చేసింది. బాధితులకు ‘నమస్తే’ అండగా నిలవడంతో మూసీ కూల్చివేతలపై సర్కారు వెనక్కి తగ్గింది.