సిటీబ్యూరో, ఆగస్టు 7(నమస్తే తెలంగాణ): హైదరాబాద్ రియల్ వ్యాపారానికి హాట్ సెంటర్ నల్లగండ్ల. వెస్ట్‌సిటీలో ఉన్న గచ్చిబౌలి, మోకిలా, నల్లగండ్ల, రాయదుర్గం, మాదాపూర్, హైటెక్ సిటీకి అతి చేరువలో ఉండటం, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ బీహెచ్ఎల్, పలు సాఫ్ట్వేర్ కంపెనీలు నల్లగండ్ల ప్రాంతం నుంచి కార్యకలాపాలు కొనసాగిస్తుండగా.. చుట్టూ ఇంటర్నేషనల్ స్కూళ్లు, ఆధునిక హాస్పిటళ్లు, లింగంపల్లి ఎంఎంటీఎస్ నుంచి దగ్గరగా ఉండే నల్లగండ్లలో ఇప్పటికే బడా నిర్మాణ సంస్థలు హైరైజ్ అపార్టుమెంట్లు నిర్మిస్తుండటంతో ఈ ప్రాంతంలో విపరీతమైన డిమాండ్ ఉంది.
శాటిలైట్ టౌన్ షిప్పులతో మారనున్న తీరు..
వాక్ టూ వర్క్ కాన్సెప్టులో భాగంగా తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ చుట్టూ విస్తరించిన 158 కి.మీ మేర ఉన్న ఔటర్ రింగు రోడ్డుకు ఇరువైపులా దాదాపు 360 కి.మీల పరిధిలో గ్రోత్ కారిడార్‌ను ఆధునిక వసతులతో, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని శాటిలైట్ టౌన్షిప్లకు శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలో ఓఆర్ఆర్ వెంట 13 ప్రాంతాల్లో ఈ టౌన్ షిప్పులు రానుండగా.. తెల్లాపూర్ పరిసరాల్లో ఒక్క ప్రాజెక్టును ఆవిష్కరించాలనే ప్రతిపాదనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో టౌన్షిప్ నిర్మాణ పనులు మొదలుపెడితే గనుక, హైదరాబాద్ రియల్ రంగానికి మరింత ఊపునిస్తుందనడంలో అతిశయోక్తి లేదు.
రియల్ మార్కెట్ తీరు..
నల్లగుండ్ల చుట్టూ బడ్జెట్ అపార్టుమెంట్లు, లగ్జరీ విల్లాలే కాకుండా ప్రీమియం ఫ్లాట్లు కూడా ఉన్నాయి. ఈ ప్రాంతంలో నివాసం ఉండేందుకు ఎక్కువగా లగ్జరీ విల్లా ప్రాజెక్టులను కొనుగోలు చేసేందుకు మొగ్గుచూపుతారు.రెసిడెన్షియల్ స్పేస్‌కు భారీ డిమాండ్ ఉంటుందనీ, సొంతింటి కోసమైనా… రెంటల్ ఇన్ కం పొందేందుకే కాకుండా ప్రాపర్టీ ధర సైతం గ్రాడ్యుయల్‌గా ఏటా పెరుగడం ఖాయం. ఈ క్రమంలో సిటీలో ఇన్వెస్ట్ మెంట్పరంగా లేదా ఐటీ కారిడార్‌లో పనిచేస్తూ సొంతింటిని కలిగి ఉండాలనే ఆలోచన ఉన్నవారికి నల్లగండ్ల బెస్ట్ ఆఫ్షన్ అవుతుందని రియల్ నిపుణులు చెబుతున్నారు.