మూసీ ప్రక్షాళన పేరిట పేదల ఇండ్లను కూల్చేందుకు కార్యాచరణకు రంగం సిద్ధమైంది. మూడు జిల్లాల పరిధిలో దాదాపు 45 కిలోమీటర్లు ప్రవహిస్తున్న మూసీకి ఇరువైపులా పరీవాహక ప్రాంతానికి హద్దులను నిర్దారించారు. బఫర్ జోన్, ఫుల్ రివర్ లెవల్ పేరిట హద్దులను గుర్తించారు. మూసీ నది ప్రక్షాళనకు సంబంధించి అలైన్మెంట్ మ్యాప్ ఆన్లైన్లో చక్కర్లు కొడుతున్నది. ఈ మ్యాప్ ఆధారంగానే మూసీ వెంబడి ఆయా జిల్లాల రెవెన్యూ, ఇరిగేషన్, పోలీసులు ఆస్తులకు మార్కింగ్ చేస్తుండగా.. ఇందులో రివర్ బెడ్ (రెడ్ లైన్) , ఎఫ్ఆర్ఎల్ (బ్లూ లైన్) పేరుతో హద్దులను సర్కారు గుర్తించినట్లు తెలుస్తున్నది.
Operation Musi | సిటీబ్యూరో, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ) : పేదలకు కంటి నిండా కునుకు లేకుండా చేస్తున్న మూసీ మార్కింగ్ ప్రక్రియ.. ఇప్పుడు హద్దులను ఖరారు చేస్తూ మరో పిడుగు వేసింది. రెండు జంట జలాశయాల నుంచి మొదలుకుని గ్రేటర్ పరిధి దాటేంత వరకు మూసీ వెంబడి రివర్ బెడ్, ఫుల్ రివర్ లెవల్‌తో దాదాపు 45 కిలోమీటర్ల పొడవున హద్దులను నిర్దేశించింది. ఇందులో రెడ్ లైన్‌ను రివర్ బెడ్‌గా పరిగణిస్తుండగా.. బ్లూ కలర్ లైన్‌ను ఎఫ్ఆర్ఎల్ అని అధికారులు స్పష్టం చేశారు. దీని ఆధారంగా మూసీ వెంబడి నిర్మాణాలకు మార్కింగ్ ప్రక్రియ చేపడుతున్నారు.
హద్దుల కోసం ప్రత్యేక మ్యాప్..
మూసీ బ్యూటిఫికేషన్ ప్రాజెక్టును సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు మూడు నెలల్లోనే అంచనా వ్యయా న్ని రూ.లక్షన్నర కోట్లకు పెంచేసి.. మూసీ బ్యూటిఫికేషన్ కాంగ్రెస్‌కు ఏటీఎంలా మారనుందనే విమర్శలతో పౌర సమాజం గళమెత్తింది. దీనికోసం రెవె న్యూ, ఇరిగేషన్, జియో మ్యాపింగ్ అధ్యయన సంస్థలతో కలిసి మ్యాప్‌ను రూపొందించిందని ఎంఆర్డీసీఎల్ వర్గాలు వెల్లడించాయి.
గీతలతో మారనున్న పేదల తలరాత
ప్రస్తుతం రివర్ బెడ్ అంటే రెడ్ మార్కింగ్ ప్రక్రియ జరుగుతుండగా.. రెడ్ మార్కింగ్‌లోనే 60 నుంచి 70వేల ప్రాపర్టీలు ఉన్నట్లు తెలిసింది. అదే ఫుల్ రివర్ లెవల్ పేరిట (బ్లూ లైన్) మార్కింగ్ ప్రక్రియ మొదలైతే ఈ సంఖ్య రెండు లక్షలకు చేరేలా హద్దులు ఖరారు చేశారు. బ్లూ లైన్ తర్వాత బఫర్ జోన్‌కు మరో 30 నుంచి 40 మీటర్ల దూరాన్ని గుర్తించాలని ఇరిగేషన్ నిపుణులు తెలిపారు. నిబంధనల ప్రకారం ఎఫ్టీఎల్, బఫర్ జోన్ హద్దులను నిర్దారించాల్సి ఉండగా… ఇప్పటివరకు ఎఫ్ఆర్ఎల్ వరకు మాత్రమే ఎంఆర్డీసీఎల్ మార్కింగ్ చేసింది. దీనికి అదనంగా బఫర్ జోన్ కూడా ఉంటుందని చెబుతున్నారు.
లక్షన్నరకు పైగా నిర్మాణాలు..
మూసీ డెవలప్మెంట్ అలైన్మెంట్ మ్యాప్ అందుబాటులోకి రాక ముందు… మూసీకి ఇరువైపులా రివర్ బెడ్ పరిధిలో ఉన్న నిర్మాణాల సంఖ్య దాదాపు 30 నుంచి 40వేల మధ్య ఉంటుందని భావించారు. కానీ ప్రస్తుత మ్యాప్ ప్రకారం రివర్ బెడ్(రెడ్ లైన్) పరిధిలో వచ్చే నిర్మాణాల సంఖ్య 60 నుంచి 70వేలకు పెరిగే అవకాశం ఉంది. అలాగే ఎఫ్ఆర్ఎల్(బ్లూ లైన్) పరిధిలోకి వచ్చే ఆస్తుల సంఖ్య దాదాపు లక్షకు పైగానే ఉంటుందనే అంచనాలు ఉన్నాయి. ఒక్కో చోట ఎఫ్ఆర్ఎల్ వెడల్పు 80 నుంచి 100 మీటర్ల దూరంలోనే ఉండగా… దీనికి అదనంగా బఫర్ జోన్ నిర్దారించాల్సి ఉంటుంది. మూసీ ప్రక్షాళన పేరిట ఈ లెక్కన ప్రభుత్వం దాదాపు లక్షన్నరకు పైగా నిర్మాణాలను సుందరీకరణ పేరిట మూసీలో ముంచేసేందుకు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.