సిటీబ్యూరో: మూసీ వరద నీరు బస్తీలకు పేదలకు కన్నీరే మిగిల్చింది. సర్వస్వం కోల్పోయి వరద బురదలో కూరుకుపోయిన సామగ్రిని చూస్తూ కన్నీటి పర్యంతమవుతున్నారు. ఆ బడుగు జీవులకు మూసీ కృత్రిమ వరద కట్టు బట్టలు, కన్నీటి సుడులనే మిగిల్చింది. ఏం జరుగుతుందో తెలుసుకునేలోగానే ఇండ్లన్నీ వరద నీటిలో మునిగిపోయాయి. కట్టుబట్టలతో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బయటకు పరుగులు తీశారు. ఎక్కడికి వెళ్లాలో తెలియక దిక్కుతోచని స్థితిలో తమ బంధువుల ఇండ్లలోకి వెళ్లి తలదాచుకున్నారు.
రెండు రోజులు తర్వాత బతుకు జీవుడా.. అంటూ బస్తీలోకి వచ్చి చూస్తే.. ఇండ్లలోని ఏ చిన్న వస్తువు కూడా పనికి రాకుండా మారిపోయాయి. దుస్తులు, బియ్యం, సరుకులు, నిత్యావసరాలు బురదలో కూరుకుపోయాయి. ఫ్యాన్లు, కూలర్లు, గ్యాస్ పొయ్యిలు, వంట సామగ్రి ఏదీ పనికి రాకుండా మారింది. ఇంటి పైకప్పును తాకిన వరద నీరు సామగ్రినంతా మట్టిలో కూరుకుపోయేలా చేయడంతో బాధితులు కన్నీటి పర్యంతమయ్యారు.
మూసానగర్ బస్తీలో ఇండ్లన్నీ నీటి మునిగి ప్రజలంతా రోడ్డున పడ్డారు. అదే బస్తీలో దాదాపు 50 మంది బీహార్‌కు చెందిన వలస కార్మికులు పదేండ్ల నుంచి నివసిస్తున్నారు. వరదలో వారు అద్దెకుంటున్న ఇండ్లకు కూడా మునిగిపోయాయి. వారంతా నిరాశ్రయులయ్యారు. ప్రభుత్వ అధికారులు ఆదివారం ఉదయం కొంతమందికి భోజనం, పాలు, తాగునీరు సరఫరా చేశారు. మూసానగర్‌లో ఉండే బీహార్ వలస కార్మికులకు మాత్రం ఇవ్వలేదు. మీరు ఇక్కడి వారు కాదు.. కాబట్టి మీకు ఆహారం ఇవ్వమని తేల్చిచెప్పినట్లు వారు వాపోతున్నారు.
వరద ముంచెత్తి ఇండ్లనీ మునిగిపోవడంతో చిన్నారుల పుస్తకాలన్నీ తడిచి ముద్దయ్యాయి. నోటు పుస్తకాలు, పాఠ్య పుస్తకాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. రేపటి నుంచి తాము బడికెట్లా పోవాలని బస్తీలకు చెందిన చిన్నారులు ప్రశ్నిస్తున్నారు. తమ తల్లిదండ్రులు మళ్లీ పుస్తకాలు కొనియ్యలేని పరిస్థితిలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరద వస్తుందని ముందుగా చెప్తే పుస్తకాలను తీసుకుపోయేవాళ్లమని నిట్టూరుస్తున్నారు. రూ. వేలు వెచ్చించి తమ పిల్లలకు కొనిచ్చిన పుస్తకాలు నీటి పాలయ్యాయని తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమవుతున్నారు.
జంట జలాశయాల గేట్లు ఎత్తి భారీ వరదను మూసీలోకి వదులుతున్నట్లు అధికారులెవరూ ప్రకటించలేదని బస్తీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్నచిన్న వరదలొచ్చిప్పుడు ఇండ్లలోకి వచ్చి సమాచారం చెప్పేవారని.. మునుపెన్నడూ రానంత వరద వచ్చినా ముందుగా చెప్పకపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. తమ ఇండ్లను ముంచేందుకే సమాచారం ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముందస్తు ప్రణాళిక ప్రకారమే తమ బతుకులను రోడ్డుపాలు చేశారని మండిపడుతున్నారు. .. బంధువుల ఇండ్లలో తలదాచుకున్నం ఒక్కసారిగా ఇండ్లలోకి వరద నీరు వచ్చింది.
క్షణాల్లోనే వరద తీవ్రత పెరగడంతో దిక్కుతోచని స్థితిలో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బయటకు పరుగులు తీశాం.ఎక్కడికి వెళ్లాలో తెలియక చుట్టాలు, తెలిసిన వాళ్ల ఇండ్లలో తలదాచుకున్నాం. జంట జలాశయాల గేట్లను ఎత్తడం వల్ల వరద ఇండ్లలోకి వస్తుందని మాకు ఎవరూ సమాచారం ఇవ్వలేదు. ముందుగా చెప్పి ఉంటే ఇంట్లో సామగ్రిని కొంతైనా తీసుకెళ్లేవాళ్లం. నిత్యావసరాల్లో కొంతైనా మిగిలేది. నిత్యావసరాలతో పాటు ఇంట్లో సామగ్రి మొత్తం బురదమయం అయింది. కట్టుకున్న బట్టలు తప్పా ఏదీ మిగలలేదు. మూసానగర్లోని 300 పైగా ఇండ్లు నీట మునిగాయి. నాకు రూ.2 లక్షల దాకా నష్టం జరిగింది. మరో రెండేండ్లు కష్టపడితేనే సామగ్రిని కొనగలుగుతాం.
-షాహీన్, మూసానగర్ బస్తీ
శుక్రవారం సాయంత్రం 5 గంటలప్పుడు కుటుంబమంతా కలిసి భోజనం చేస్తుండగా ఒక్కసారిగా వరద నీరు ఇంట్లోకి వచ్చింది. ఒకేసారి మోకాలి లోతు నీరు రావడంతో తింటున్న కంచాలతో సహా ఇక్కడే వదిలేసి బయటకు పరుగులు తీశాం. ఎక్కడ చూసినా వరద నీరు ఉండటంతో కట్టుబట్టలతోనే ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని మా అక్క వాళ్ల ఇంటికి వెళ్లాం. 25 ఏండ్ల నుంచి ఇక్కడే ఉంటున్నాం. ఇంత మొత్తంలో వరద ఎన్నడూ రాలేదు. ఆటో నడుపుకొంటూ పిల్లలను చదివిస్తున్నా.
వారం కిందటే కూతురు చదువుకు రూ.12వేలు అప్పుచేసి పుస్తకాలు కొన్నా. అవన్నీ తడిసి ముద్దయ్యాయి. బియ్యం, సామగ్రి సహా మొత్తం బురదలో మునిగిపోయాయి. నిన్నటి నుంచి ప్రభుత్వ అధికారులెవరూ ఇక్కడికి రాలేదు. కనీసం భోజనం, తాగునీరు కూడా ఇవ్వలేదు. నిన్నటి నుంచి పిల్లలు ఖాళీ కడుపుతో అలమటిస్తున్నారు. బిస్కెట్లు కొనిచ్చి వారిని వారిస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం మాపై ఎందుకు కక్ష కట్టిందో అర్థం కాట్లేదు.
– పోలె వెంకటేశ్, మూసానగర్ బస్తీ
బ్రిడ్జి కట్టనీకి వచ్చినం. గోల్నాక స్కూల్లో ఉన్నం. కప్పుకోనీకి దుప్పటి లేదు. పక్కకు ఏమీ లేదు. గచ్చు మీద పడుకున్నం.మూడు రోజులు తిండి పెట్టారు. పని చేయనీకి వచ్చినం. గవర్నమెంటోళ్లే ఇక్కడ గచ్చే వేశిన్రు.
– శంకరమ్మ, అంబేద్కర్ కాలనీ
రాత్రి పది గంటలకు మా ఇళ్లల్లోకి నీళ్లొచ్చినయ్. కట్టు బట్టలతోని బయటికి పోయినం. ఆకలైనా ఏ అధికారీ రాలే. పిల్లలకు పాల కోసం ఏడుస్తున్నరు. మేమే బయట తిరిగి షాపులకు పోయి పాలు కొనుక్కొచ్చుకున్నం. నీళ్లు కొనుక్కున్నం. మా ఏరియాలో మయినుద్దీన్ షేట్ ఉన్నడు. వందల మందికి తిండి పెట్టిండు. కానీ, గవర్నమెంట్ వాళ్లు ఏమీ పట్టించుకోలే.
– మహ్మద్ మఖ్దూం, శంకర్ నగర్, మలక్‌పేట
నీళ్లొచ్చినయ్. అప్పటికప్పుడు ఏం చేయాల్నో తోచలే. బిడ్డ ఇంటికి పోయి తలదాచుకున్న. ఇంట్లో సామాన్లే కారాబ్ అయితే, చిన్న చిన్న షాపులు నడుపుకునే మాలాంటోళ్లకు మాల్ మొత్తం పాడైపోయింది. నాకు ఈ షాపే బతుకుదెరువు. ఫోన్ కూడా నీళ్లల్లోనే పోయింది. మాకు ఆ దేవుడే దిక్కు.ఎన్నడూ ఇంత వరద రాలే. వరద రాబట్టే ఇండ్లల్లోకి వచ్చినయ్.
– షాహెదా బేగం , వినాయక వీధి, మూసానగర్
బతకనీకి అని నల్లగొండ జిల్లా మాల్ దగ్గర వెంకటంపేట గేట్ నుంచి సిటీకి వచ్చినం. కిరాయికి ఉంటున్నం. సుతారి పని చేసుకుంటున్నం. రెండు రోజులు ఇంట్ల నుంచి బయటికి రాలేకపోయినం. నల్లా నీళ్లు రాలే. తాగనీకి నీళ్లు లేవు. గవర్నమెంటోళ్లు పచ్చి మంచినీళ్లు ఇయ్యలే.
– రమావత్ భాగ్యలక్ష్మి