Musi River | హైదరాబాద్ : హిమాయత్ సాగర్ నిండు కుండలా మారడంతో.. ఆ ప్రాజెక్టు 11 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. దీంతో మూసీ నదికి వరద పోటెత్తింది. పురానాపూల్ వద్ద మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. అక్కడున్న శివాలయంలోకి భారీగా వరద నీరు రావడంతో.. ఆ ఆలయం పూర్తిగా మునిగిపోయింది. పురానాపూల్ పరివాహక ప్రాంతాన్ని కూడా వరద నీరు ముంచెత్తింది. జియగూడ బైపాస్ రోడ్డుపై వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో.. పురానాపూల్ నుంచి లంగర్‌హౌజ్ వైపునకు రాకపోకలు నిలిపివేశారు. పురానాపూల్ వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆసిఫ్‌నగర్ మండల రెవెన్యూ అధికారి ఎస్ జ్యోతి పురానాపూల్ ప్రాంతాన్ని పర్యవేక్షించారు. వరద ఉధృతి మరింత పెరిగితే మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు.