సిటీబ్యూరో, సెప్టెంబర్ 28(నమస్తే తెలంగాణ): ‘కట్టుకున్న బట్టలు తప్ప ఏమీ మిగలలేదు. కేవలం వాళ్లు వీళ్లు ఇచ్చిన అరటిపండ్లు తిని బతుకుతున్నం. మమ్మల్ని పట్టించుకున్నదెవరు. ఈ వైపు వచ్చిందెవరం’టూ ఓ మహిళ ఆవేదన. ‘ఉన్న ఒక్క దుకాణం పోయింది. ఇద్దరు పిల్లలతో ఎలా బతకాలి. వరద వచ్చేది ముందే అధికారులకు తెల్వదా.. ఇదంతా హైడ్రాతో కలిసి ప్రభుత్వం చేస్తున్న డ్రామా అనిపిస్తున్నది. వరద వచ్చేది చెప్పి మమ్మల్ని హెచ్చరించలేదు ఎందుకు..
ఇప్పుడు మమ్మల్ని ఎవరు ఆదుకుంటారు. ఇదేం సర్కార్’ అంటూ ఆగ్రహించిన ఓ మెకానిక్. ‘తినడానికి తిండి లేక.. తాగడానికి నీళ్లు లేక విలవిలలాడుతున్నం. మా ఇళ్లన్నీ బురదతో నిండినయ్. ఒక్కరంటే ఒక్క అధికారి కూడా రాలేదు. ఓట్ల కోసమైతే వస్తరు కానీ ఈ పరిస్థితిలో మా జీవితాలు బాగు చేయడానికి ఎవరూ రారా’ అంటూ ప్రశ్నించిన మధ్యతరగతి మహిళ. ఇది మూసీ వరద బాధితుల ఆవేదన. రేవంత్ సర్కార్ తీరుపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమను యేటిపాలు చేశారంటూ రోదిస్తున్నారు.
వారి ఆవేదన అరణ్యరోదన. వరద నీటిలో బిక్కుబిక్కుమంటూ రోజంతా గడిపి ప్రవాహ ఉధృతినుంచి తప్పించుకుని తమను తాము కాపాడుకోవడానికి మిద్దెలెక్కి, మేడలెక్కి, మసీదులో తలదాల్చుకుని తమ బతుకులు ఎలా దేవుడా అంటూ జీవనమరణపోరాటం చేశారు బడుగుజీవులు మూసీ వరద బాధితులు. మూసారంబాగ్, మూసానగర్, శంకర్‌నగర్, అంబేద్కర్‌నగర్, వినాయకవీధి, కృష్ణానగర్ తదితర బస్తీల్లో ఎక్కడ చూసినా బురదమయమే. రెండురోజుల నుంచి తమను ముంచెత్తిన వరద భయం నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతూ తమ ఇళ్లు, వాకిళ్లు కడుక్కుంటూ కనిపించారు.
ఎవరిని కదిలించినా కన్నీళ్లే. వరద వచ్చి అన్నీ తీసుకుపోయింది అంటూ అందరి నోటి నుంచి ఒకటే మాట. కట్టుబట్టలతో మిగిలాం. ఉన్నబట్టలు పనికిరాకుండా పోయాయి. ఇంట్లో వస్తువులేదీ మిగలేదు. తామెలా బతకాలి. తమకు దిక్కెవరంటూ రోదిస్తున్నారు. పైనుంచి నీళ్లు ముందే వదులుతున్నామంటూ ముందే తెలిసినా అధికారులు మాకు ఎందుకు చెప్పలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మా బతుకులను ఏటి పాల్జేసినోడు బాగుపడతడా అంటూ శాపనార్థాలు పెడుతున్నారు. చిన్నచిన్న పిల్లలతో ఎలా నెట్టుకురావాలంటూ తమ బతుకులను చూడండంటూ ఇళ్లల్లోకి తీసుకెళ్లి బురద మయమై, ముక్కులు అదిరిపోయే దుర్గంధంతో వరద తగ్గిన తర్వాత వారి నిత్యజీవనం అత్యంత దయనీయంగా ఉంది.
ముందే చెబితే సర్దుకునేవారేమో..!
గతంలో ఎప్పుడూ ఇంత వరద రాలేదని స్థానికులు చెబుతున్నారు. వరద వచ్చినా రోడ్లపైకి పారేది తప్ప ఇళ్లల్లోకి వచ్చిన దాఖలేలేవని అంటున్నప్పటికీ వారిలో మాత్రం ఇంకా వరద భయం కనిపిస్తోంది. నమస్తే తెలంగాణ బృందం ఆయా కాలనీల్లో పర్యటించినప్పుడు క్షేత్రస్థాయిలో పరిస్థితులు చాలా భయానకంగా కనిపించాయి. ముఖ్యంగా ప్రతీ ఇల్లు బురదమయంగా కనిపిస్తూ ఒక్కొక్కరూ ఇళ్లు సరిదిద్దుకునే ప్రయత్నాల్లో ఉన్నారు.
వారి ఇళ్లల్లో వస్తువులన్నీ పూర్తిగా నీటిలో మునిగి పనికిరాకుండా పోయాయి. నిత్యావసరాలు కూడా వరదలో కొట్టుకుపోవడంతో రెండురోజుల నుంచి స్వచ్ఛంద సంస్థలు ఇస్తున్న అరటిపండ్లు, బ్రెడ్లతో కాలం గడుపుతున్నారు. మరి సర్కార్ ఏం చేస్తున్నదంటూ ఎవరైనా ఇక్కడకు వస్తే కదా అంటూ అడుగుతున్నారు. రోడ్డుమీద నుంచే వెళ్లిపోయారు తప్ప తమ వైపు కన్నెత్తి కూడా చూడలేదని, ఇంత చెత్త సర్కార్ చూడనే లేదంటూ గతంలో హైదరాబాద్‌లో వరదలు వచ్చినప్పుడు కేసీఆర్ సర్కార్ పదివేలు ఇచ్చిన సందర్భాలు గుర్తు చేసుకున్నారు.
ఇదంతా పక్కా ప్లానేమో..!
వరదగుప్పిట నుంచి బయటపడుతున్న బస్తీప్రజలు ప్రస్తుతం మరో అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ మాట్లాడిన మాటలు వినిపిస్తూ మూసీ వరదలతో ఎక్కడెక్కడ ఎలాంటి చర్యలు తీసుకోవాలో అర్ధమవుతున్నదని అన్నదానికి ఇదంతా ప్రభుత్వమే చేయిస్తున్నదా అని అడుగుతున్నారు. గండిపేట దగ్గర రోజుల తరబడి నీళ్లు ఆపి ఒక్కసారిగా వదిలితే మా కాలనీలన్నీ మునిగిపోతే ఇవి సర్కారోళ్లు తీసుకోవచ్చనే ఆలోచిస్తున్నారేమో అని వాళ్లలో వాళ్లే చర్చించుకుంటున్నారు. తాము ఎప్పటినుంచో ఇక్కడ ఉంటున్నామని తాము కొనుక్కున్న ఇళ్లు ఎందుకిస్తాం.. మేమెక్కడికి పోతాం అంటూ ప్రశ్నిస్తున్నారు.
కట్టుకోవడానికి బట్టలు లేవు, నీళ్లు కూడా లేవు..
రాత్రి ఒక్కసారిగా నీళ్లు వచ్చేసరికి ఇంట్లో సరుకులన్నీ అందులో కొట్టుకుపోయినయ్. అసలు బయటకు రాలేని పరిస్తితి. చుట్టూ నీళ్లు.. ఎటుపోవాల్నో అర్ధం కాదు. కట్టుకున్న బట్టలతోనే బయటకు వచ్చేశాం. ఎదురుగా ఉన్న వాళ్ల ఇంట్లో మేడపైకి ఎక్కి రాత్రంతా ఉన్నాం. తెల్లవారిన తర్వాత కూడా ఎవరూ వచ్చి సాయం చేయలేదు. ఒకరిద్దరు సర్కారోళ్లు రోడ్డుపైకి వచ్చిపోయిండ్రు తప్ప మావైపు చూసిందే లేదు. తిండి లేదు. నీళ్లు లేవు. ఇప్పటికి కూడా నల్లా వదులుతలేరు. చాలా ఇబ్బంది అయితుంది. కట్టుకునే బట్టలు కూడా నీళ్లలో కొట్టుకుపోవడంతో ఏం చేయాలో తోస్తలేదు. కట్టుబట్టలతోనే మూడురోజుల నుంచి ఉంటున్నం.
-అఫ్సర్బీబీ, వినాయకవీధి
ఏమైతదోనని భయమైంది..
మొన్నటినుంచి తిండి లేదు. ఇంట్లో వస్తువులన్నీ తడిసిపోయాయి. నీళ్లు ఒక్కసారిగా వచ్చేసరికి నన్ను కుర్చీమీద కూర్చోబెట్టి బంగ్లా పైకి తీసుకుపోయింరు. చిన్నచిన్నపిల్లలకు ఏమైతదోనని భయమైంది. మేము ఇక్కడకు వచ్చి నలభై ఏళ్లయింది. ఎప్పుడూ ఇట్ల జరగలేదు.రోడ్డు మీద నుంచి నీళ్లు పోయేది కానీ ఇళ్లల్లోకి నీళ్లే రాలేదు.
నీళ్లు వచ్చేటప్పుడు సర్కారోళ్లు వచ్చి ముందుగా చెప్పి బయటకు పంపేది. కానీ ఇప్పుడసలు ఎవరూ రాలే. కనీసం తిండి కూడా పెట్టలే. పొద్దుగాల ఎవరో వచ్చి అరటిపండ్లు ఇచ్చిపోయింరు. అంతే తప్ప మా దిక్కు చూసినోళ్లే లేరు. మాకెందుకు చెప్పలేదని అధికారులను అడిగితే మాకు కూడా తెల్వదంటే వాళ్లపై కోపం చేసిన. ఇదేం సర్కార్. గతంలో నీళ్లు వస్తే మా పక్కవాడోళ్లను వేరే దగ్గరకు తీసకపోయి వాళ్లకు తిండి పెట్టేది. కానీ ఈసారి ఎక్కడకు పోవాల్నో తెలవక నీళ్లలోనే బతికినం.
-లక్ష్మిబాయి,శంకర్‌నగర్
మమ్మల్ని ఏట్ల పడేసిండ్రు
నలభై ఏళ్ల కిందట ఇక్కడకు వచ్చి కొనుక్కున్నం. ఎప్పుడునీళ్లు వచ్చినా రోడ్లపైకి వచ్చేది. నీళ్లు వస్తే అధికారులు వచ్చేది. మైకుల్లో చెప్పేది. పోలీసులతో మమ్మల్ని బయటకు పంపించేది. కానీ మా ఇంట్లోకి మాత్రం నీళ్లే రాలే. ఇప్పుడు ఇంతగనం నీళ్లు ఇదే మొదటిసారి వచ్చినయ్. వరద వదిలేసరికి నీళ్లు వచ్చినయంటున్నరు. మమ్మల్ని ఏట్ల పడేసిండ్రు. నీళ్లు వచ్చేసరికి అన్నం తిందామనుకుంటూ ప్లేట్లో పెట్టుకుని నీళ్లు ఒక్కసారిగా ఇంట్లోకి రావడంతో ఏం చేయాలో తెలియక తినే పళ్లెం వదిలేసి పరిగెత్తాను.
ఇంట్లో వాళ్లను తీసుకుని బయటకు పోదామంటే అసలు దారి లేదు. మెట్లెక్కి పైనే ఉండిపోయాం. 24 గంటలు నీళ్లల్లోనే ఉన్నాం. కట్టుబట్టలతో మిగిలిపోయాం. ఎట్లనో అట్ల బయటపడి దగ్గర ఉన్న మసీదులో పడుకున్నం. మాకు అసలు ఎవరూ సాయం చేయలేదు. పునరావాస కేంద్రాలు కూడా తెలవదు. అసలు మాకు చెప్పేందుకు అధికారులు ఇక్కడకు రావాలి కదా… ఎవరూ రాలేదు.
– నజ్మాబేగం,శంకర్‌నగర్
ఇల్లంతా వాసన.. దోమలతో చచ్చిపోతున్నం..
ఇంట్లోకి నీళ్లు వచ్చాయి. 24 గంటల పాటు అట్లనే ఉన్నం. దుర్వాసన, దోమలతో కరెంట్ లేక, నీళ్లు లేక నానా అవస్థలు పడ్డాం. ఇప్పుడు కూడా ఇల్లు వాసన అట్లనే ఉన్నది. అసలు గతంలో ఎప్పుడూ ఇంతగనం నీళ్లే రాలేదు. మూసీ బాగా పొంగితే మా దగ్గరకు నీళ్లు రోడ్లపైకి వచ్చేవి కానీ ఇళ్లలోకి రాలేదు. కానీ ఇప్పుడు మాత్రం మా దగ్గరకు నీళ్లు రావడానికి పైనుంచి వరద రావడంతో మ్యాన్‌హోల్స్ పొంగి , ఇంట్లో ఉన్న బాత్రూమ్లు, మోరీల్లో కూడా నీళ్లు పొంగి వచ్చాయి. మూసీ పక్కకు రిటైనింగ్ వాల్ కడితే ఈ సమస్య రాదు. ఓట్ల కోసం వస్తరు. మళ్లీ ఈ గల్లీలోకే రారు. ఇదేం లీడర్లు. ఇప్పటి వరకు మమ్మల్ని ఎవరూ పట్టించుకోలేదు.
– నూర్ఖియా,శంకర్‌నగర్
లక్షల రూపాయలు నష్టపోయాం..
గతంలో ఎప్పుడూ ఇంత పెద్ద వరద రాలేదు. మా ట్రావెల్స్‌కు సంబంధించిన మూడు బస్సులు పూర్తిగా దెబ్బతిన్నాయి. వాటిని బాగుచేయడానికి లక్షలరూపాయల ఖర్చవుతుంది. వరద వచ్చే ముందు అధికారులు వచ్చి చెప్పేవారు. ఇక్కడ ఉన్న గ్యారేజీల్లోకి వచ్చిన నీళ్లతో కార్లన్నీ ఖరాబైనయ్. ఆల్టో, ఐ20 రెండుకార్లు వరదలో కొట్టుకుపోయినయి. బస్సుల ఇంజన్లన్నీ దెబ్బతిన్నయ్. వరదగురించి ముందే చెబితే మేం వేరే దగ్గర పెట్టుకునేటోళ్లం. మాసామాన్లు కాపాడుకునేటోల్లం.
-హాజీ, మూసారంబాగ్