చిక్కడపల్లి, అక్టోబర్ 8 : పేదల ఇండ్లకు నష్టం లేకుండా మూసీ ప్రక్షాళన చేపట్టాలని వామపక్ష నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో షోయబ్ హాలులో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.
సీపీఎం నగర కార్యదర్శి ఎం.శ్రీనివాస్, నగర నాయకుడు ఎం.మహేందర్, అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం నగర కార్యదర్శి ఎం.వరలక్ష్మి, సీపీఐ(ఎం-ఎల్) న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకులు ఝాన్సీ, సీపీఐ(ఎంఎల్) మాల్లైన్ రాష్ట్ర నాయకురాలు ఎస్.ఎల్.పద్మ, సీపీఐ (ఎం-ఎల్)న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకురాలు అనురాధ, ఎంసీపీఐ(యూ) రాష్ట్ర నాయకులు అనిల్ కుమార్, పీఓడబ్ల్యూ రాష్ట్ర నాయకురాలు సంధ్య, మానవ హక్కుల నేత సయ్యద్ బిలాల్ తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మూసీ ప్రక్షాళన జరగాలి, దానికి అవసరమైన చర్యలు చేపట్టాలి అంతేకానీ.. ప్రభుత్వం మూసీ సుందరీకరణ పేరుతో వేలాది మంది పేదలు, మధ్యతరగతి ప్రజల ఇండ్లను తొలగించాలనుకోవడం సమంజసం కాదన్నారు. టూరిజం అభివృద్ధి కోసం, కార్పొరేట్ కంపెనీల వ్యాపారాల కోసం పేదల ఇండ్లను తొలగించాలనుకోవడం అత్యంత దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు.
మూసీ ప్రాజెక్టుకు సంబంధించి డీపీఆర్‌తో సహా ఎలాంటి ప్రతిపాదనలు లేకుండానే ఇండ్ల తొలగింపునకు పూనుకోవడం అప్రజాస్వామిక చర్య అని అన్నారు. మూసీ ప్రాజెక్టులో ప్రభుత్వం చేపట్టదలచిన అభివృద్ధి పై విస్తృత చర్చలు జరిపిన తర్వాత ప్రజల ఆమోదంతో ముందుకెళ్లాలన్నారు.
మూసీ నది పరిసరాల్లో నివసిస్తున్న వేలాది మంది పేదలను అభివృద్ధిలో భాగస్వాములు చేయకుండా, వాళ్ల ఉపాధిని పట్టించుకోకుండా, ఏకపక్షంగా నగరం అవతలకు పంపించే చర్యలు ప్రజాపాలన అనిపించుకోదన్నారు. మూసీ నిర్వాసిత ప్రజలతో వారి నివాస హక్కుల కోసం, ప్రభుత్వ బెదిరింపు చర్యలకు వ్యతిరేకంగా వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు ఐక్యంగా పోరాడుతాయని వారు ప్రకటించారు.