మేడ్చల్, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ): ట్రేడ్ లైసెన్స్ జారీలో మున్సిపల్ అధికారులు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో 16 మున్సిపాలిటీలు ఉండగా.. వివిధ రకాల వాణిజ్య సముదాయలు ఉన్నప్పటికీ ఆ స్థాయిలో ట్రేడ్ లైసెన్స్‌లు జారీ చేయకుండా లైసెన్స్‌లు జారీ చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. నిబంధనల మేరకు కాకుండా ఎలాంటి కొలతలు లేకుండా ఒకే తరహాలో ట్రేడ్ లైసెన్స్‌లు జారీ చేస్తున్నట్లు మున్సిపల్ కార్యాలయాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
వివిధ వ్యాపారాలు చేసుకునేవారు మున్సిపాలిటీలకు ఫీజులు చెల్లించి ట్రేడ్ లైసెన్స్‌లు పొందాల్సి ఉంటుంది. ట్రేడ్ లైసెన్స్‌లు జారీచేసే ముందు తప్పనిసరిగా రహదారులు, పొడవు, వెడల్పు కొలతల ద్వారా ట్రేడ్ లైసెన్స్ రుసుంను నిర్ధారిస్తారు. అయితే ఇవేమీ లేకుండానే నిబంధనలు విస్మరించి మున్సిపల్ అధికారులు చేతివాటం ప్రదర్శించి ట్రేడ్ లైసెన్స్‌లను జారీ చేస్తున్నారు.
ట్రేడ్ లైసెన్స్‌లు లేకుండా వ్యాపారాలు..!
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో అనేకంగా ట్రేడ్ లైసెన్స్‌లు లేకుండా వ్యాపారాలు జరుగుతున్నా యి. ఇలాంటి దుకాణాలపై మున్సిపల్ అధికారులు తనిఖీలు చేయడంలేదనే ఆరోపణలు ఉన్నాయి. ప్రతి సంవత్సరం ట్రేడ్ లైసెన్స్‌ను పొందాల్సి ఉన్నా అధికారుల నిర్లక్ష్యం మూలంగా వ్యాపారం చేసేవారు లైసెన్స్‌లు పొందడం లేదు. దీంతో మున్సిపాలిటీల ఆదాయానికి గండి పడుతుంది.
కొందరు తక్కువ ఫీజు ఉన్నప్పుడు పొందిన ట్రేడ్ లైసెన్స్ తిరిగి తీసుకుంటే ఫీజులు చెల్లించాల్సి వస్తుందని మున్సిపల్ అధికారులను మేనేజ్ చేస్తూ పాత ట్రేడ్ లైసెన్స్లతోనే వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. జిల్లాలోని నాలుగు కార్పొరేషన్లయైన జవహర్‌నగర్, బోడుప్పల్, పీర్జాదిగూడ, నిజాంపేట్‌లో వేలాది సంఖ్యలో వ్యాపార సముదాయాలు ఉన్నా 75 శాతం మాత్ర మే ట్రేడ్ లైసెన్స్‌లు పొంది..మిగతావారు పొందడం లేదంటూ మున్సిపల్ అధికారులే పేర్కొనడం గమనార్హం..
తనిఖీలు చేస్తే బట్ట బయలు..
వివిధ వ్యాపారుల సముదాయలపై తనిఖీలు చేస్తే ట్రెడ్ లైసెన్స్‌లు లేని వారి వ్యాపారాలు బట్టబయలు కానున్నాయి. తనిఖీలు చేసి ట్రేడ్ లైసెన్స్‌లు లేనివారికి జరిమానాలు విధించే అవకాశం ఉన్నా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంవల్లే ట్రేడ్ లైసెన్స్‌లు లేకుండా యథేచ్ఛగా వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. ఒక వేళ తనిఖీల్లో లైసెన్స్ లేదని బయటపడితే..మున్సిపల్ అధికారులతో కుమ్ముక్కు అవుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.