సిటీబ్యూరో, జనవరి 23 (నమస్తే తెలంగాణ) : జీహెచ్ఎంసీలో పరిపాలనా సౌలభ్యం కోసం ప్రభుత్వం భారీగా బదిలీలు చేపట్టింది. వివిధ పురపాలికల నుంచి బదిలీపై వచ్చిన మున్సిపల్ కమిషనర్లకు జీహెచ్ఎంసీలో కీలక పోస్టింగ్‌లు కల్పిస్తూ కమిషనర్ ఆర్వీ కర్ణన్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం 14 మంది అధికారులకు కొత్త బాధ్యతలు అప్పగించారు. ప్రభుత్వం ఇటీవలే జారీ చేసిన జీవో నంబర్ 87కు అనుగుణంగా ఈ నియామకాలు జరిగాయి.
బదిలీ అయిన వారిలో స్పెషల్ గ్రేడ్, సెలక్షన్ గ్రేడ్ అధికారులకు జోనల్, సరిల్ స్థాయిలో బాధ్యతలు కేటాయించారు. డాక్టర్ యాదగిరి రావుకు శేరిలింగంపల్లి, కూకట్పల్లి, గాజులరామారం జోన్ల జాయింట్ కమిషనర్(శానిటేషన్)గా నియమితులయ్యారు. జయంత్‌ను అడ్మినిస్ట్రేషన్ విభాగం జా యింట్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. మల్లయ్యకు ప్రధాన కార్యాలయంలోని ఎన్నికల విభాగం జాయింట్కమిషనర్గా బదిలీ అయ్యారు.
వివిధ సరిళ్లకు కొత్త డిప్యూటీ కమిషనర్లను కేటాయించారు. గాజులరామారం సరిల్కు శ్రీపాద రామేశ్వర్, కార్వాన్ సరిల్కు రాజేశ్ కుమార్, బహదూర్ పురాకు అహ్మద్ షఫీవుల్లా, బడంగ్ పేటకు సరస్వతి, ముషీరాబాద్‌కు ప్రవీణ్ కుమార్ రెడ్డి, యూసుఫ్ గూడకు సత్యనారాయణ రెడ్డి, జ్యోతిరెడ్డి అమీన్ పూర్ సరిల్ డిప్యూటీ కమిషనర్‌గా నియమితులయ్యారు. అలాగే జీడిమెట్ల సరిల్ డిప్యూటీ కమిషనర్‌గా శంకర్ సింగ్ బాధ్యతలు స్వీకరించనున్నారు.
కొంపల్లి సరిల్ అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్‌గా సీహెచ్ వేణును నియమించారు. బదిలీ అయిన అధికారులందరూ తక్షణమే తమ పాత బాధ్యతల నుంచి రిలీవ్ అయి, కొత్త స్థానాల్లో బాధ్యతలు స్వీకరించాలని కమిషనర్ ఆదేశించారు. బదిలీల ప్రక్రియ ముగిసిన వెంటనే విధుల్లో చేరి రిపోర్ట్ చేయాలని స్పష్టం చేశారు.