బంజారాహిల్స్, మే 25: మా మీద ఎన్నికేసులు పెట్టినా.. జైలుకు పంపించినా.. ప్రభుత్వ, ఖాళీ స్థలాల కబ్జా మాత్రం ఆపము.. మా తీరు ఇంతే.. మేమింతే అనే రీతిలో బరితెగిస్తున్నారు కబ్జాదారులు. ఓవైపు ఖరీదైన ప్రభుత్వ స్థలాలను కాపాడేందుకు నిరంతరం రెవెన్యూ సిబ్బందినిఘా పెడుతుంటే.. మరోవైపు ఆ స్థలాలను కబ్జా చేసేందుకు ప్రయత్నించే క్రమంలో ప్రభుత్వ హెచ్చరిక బోర్డులను సైతం తొలగిస్తూ అధికారులకు సవాల్ విసురుతున్నారు కబ్జాదారులు.
నగరంలోనే అత్యంత ఖరీదైన ప్రాంతంగా ఉన్న షేక్‌పేట మండల పరిధిలోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, షేక్‌పేట తదితర ప్రాంతాల్లో పలు బస్తీలు, కాలనీల్లో ఖాళీ ప్రభుత్వ స్థలాలు ఉన్నాయి. ఈ స్థలాల్లో ప్రభుత్వ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడం, వాటిలోకి ఎవరూ ప్రవేశించకుండా చూడటం కోసం ల్యాండ్ ప్రొటెక్షన్ పేరుతో రెవెన్యూ సిబ్బంది పని చేస్తుంటారు. మండల పరిధిలో సుమారు 130 ల్యాండ్ పార్సల్స్ ఉండగా వాటిలో సుమారు 30 నుంచి 40దాకా యూఎల్సీ ల్యాండ్స్ ఉన్నాయి.
వీటిని కాపాడేందుకు తాత్కాలిక ప్రహరీలు నిర్మించడంతో పాటు స్థలాల్లో ప్రభుత్వ హెచ్చరిక బోర్డులను సైతం ఏర్పాటు చేశారు. అయితే ప్రభుత్వ హెచ్చరిక బోర్డులను రాత్రికి రాత్రే మాయం చేస్తున్న కొంతమంది కబ్జాదారులు స్థలాన్ని ఆక్రమించేందుకు యత్నిస్తుండగా, మరికొంతమంది బోర్డులు తొలగించి వాటి స్థానంలో స్థలం తమదంటూ రాతలు, పోస్టర్లు ఏర్పాటు చేసుకుంటూ రెవెన్యూ అధికారులకు సవాల్ విసురుతున్నారు.
స్థలం బయట ప్రభుత్వ హెచ్చరిక బోర్డు తీసేసిన తర్వాత లిటిగేషన్ ల్యాండ్ అంటూ రియల్ ఎస్టేట్ ఏజెంట్లను తీసుకువచ్చి కస్టమర్లకు చూపిస్తున్నారు. సదరు స్థలాన్ని చూసేందుకు వచ్చేవారిని బురిడీ కొట్టించి అందిన కాడికి దండుకుంటున్న ఘటనలు కూడా కోకొల్లలుగా ఉన్నాయి. ఈ క్రమంలో షేక్‌పేట మండల పరిధిలో రెవెన్యూ అధికారులు నిత్యం ప్రభుత్వ స్థలాలను చెక్ చేయడంతో పాటు ఎవైనా ఫిర్యాదులు వస్తే వెంటనే రంగంలోకి దిగి పోలీసులకు ఫిర్యాదులు చేస్తున్నారు.
షేక్‌పేట మండల పరిధిలో ఇటీవల నమోదైన కేసులు
ఈ క్రమంలో బంజారాహిల్స్ రోడ్ నంబర్ 10లో జలమండలి రిజర్వాయర్ పక్కన రూ.300కోట్ల విలువైన సుమారు 5 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించేందుకు పార్థసారథి అనే వ్యక్తి ఇప్పటివరకు అనేక సార్లు ప్రయత్నించాడు. ఎప్పటికప్పుడు రెవెన్యూ సిబ్బంది అక్కడకు రావడం, ప్రభుత్వ హెచ్చరిక బోర్డులు పెట్టడంతో పాటు రేకుల మీద సైతం హెచ్చరిక బోర్డులు రాసినా రాత్రికి రాత్రే వాటిని తొలగించిన ఘటనలున్నాయి. ఈ మేరకు 3 నెలల వ్యవధిలో రెండుసార్లు పార్థసారథితో పాటు అతడి అనుచరుల మీద కేసులు నమోదయ్యాయి.
బంజారాహిల్స్ రోడ్ నంబర్ 14లోని భాగ్యనగర్ స్టూడియోస్ స్థలం పక్కన సుమారు రూ.100 కోట్ల విలువైన ప్రభుత్వ స్థలాన్ని కాజేసేందుకు అబ్దుల్ ఖాలీద్ ప్రయత్నాలు చేస్తున్నాడు. దీంతో అక్కడ రెవెన్యూ సిబ్బంది పలుమార్లు బోర్డులు పెట్టడం, ఖాలీద్, అతడి అనుచరులు వాటిని తొలగించి ప్రైవేటు బోర్డులు రాయడం పరిపాటిగా మారింది. బోర్డులు తొలగించినందుకు ఇప్పటివరకు ఖాలీద్‌పై మూడుసార్లు కేసులు నమోదయ్యాయి.
నామమాత్రపు కేసులతోనే సరిపెడుతున్న పోలీసులు
ప్రభుత్వ స్థలాలను కాపాడటమే రెవెన్యూ అధికారులకు అత్యంత ప్రాధాన్యత అంశంగా ఉంటుంది. ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించేవారిపై కఠినంగా వ్యవహరించాల్సిన బాధ్యత పోలీసులపై ఉంది. అయితే రోజువారీ పని ఒత్తిడి, బందోబస్తులతో బిజీగా ఉంటున్న పోలీసులు ప్రభుత్వ స్థలాల కబ్జాల విషయంలో నమోదవుతున్న కేసుల దర్యాప్తులో కొంతమేర ఉదాసీనంగా వ్యవహరిస్తుండటమే కబ్జాదారుల ధైర్యానికి కారణమని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
ప్రభుత్వ స్థలంలో బోర్డులు తొలగించడం, స్థలం లోపలికి ప్రవేశించిన వారిపై నమోదయ్యే కేసుల్లో కేవలం నోటీసులు మాత్రమే ఇవ్వడం, కేసుల దర్యాప్తులో కూడా లోతుగా వెళ్లకపోవడం కూడా కబ్జాదారులకు అలుసుగా మారిందని అరోపణలున్నాయి. పలుమార్లు ప్రభుత్వ స్థలాలను అక్రమించే ప్రయత్నాలు చేసేవారిపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టడం, వీలుంటే ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద పరిగణించి గట్టి కేసులు పెడితేనే ఆక్రమణ ప్రయత్నాలు కొంతైనా తగ్గుతాయని రెవెన్యూ అధికారులు అంటున్నారు. ప్రభుత్వం కూడా ఆ దిశగా వెంటనే దృషి సారించాలని స్థానికులు కోరుతున్నారు.